న్యూఢిల్లీ: దేశ రాజధానిలోని శాస్త్రి భవన్లో సోమవారం సాయంత్రం ఒక్క సారిగా మంటలు వ్యాపించాయి. దీంతో అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి మంటలను నియంత్రణలోకి తీసుకొచ్చారు. ఇటీవల కాలంలో శాస్త్రి భవన్ నిత్యం వార్తల్లో ఉంటున్న విషయం తెలిసిందే. పెట్రోలియం శాఖకు చెందిన అత్యంత కీలక లావాదేవీల, విధివిధానాల, వ్యవహారాలకు సంబంధించిన పలు పత్రాలు ఇందులోనే ఉన్నాయి. అయితే, ఈ మధ్య కాలంలో ఈ పత్రాలన్నీ లీకయ్యాయని, వీటి వెనుక పెద్దల హస్తం ఉందనే ఆరోపణలతో ప్రస్తుతం కేసులు నడుస్తున్న క్రమంలో అదే భవన్కు మంటలు అంటుకోవడం పెద్ద అనుమానానికి తావిస్తోంది. కావాలనే ఎవరో ఈ విధ్వంసక చర్యకు పాల్పడి ఉండొచ్చని, ఆ కోణాన్ని ఏ మాత్రం తోసిపుచ్చలేమని కూడా పోలీసులు చెప్తున్నారు.