Shatabdi Celebrations
-
శతాబ్ది ఉత్సవాలకు తెలంగాణ హైకోర్టు ముస్తాబు
-
శతాబ్ది ఉత్సవాలకు హైకోర్టు ముస్తాబు
సాక్షి, హైదరాబాద్: శతాబ్ది ఉత్సవాలకు హైకోర్టు ముస్తాబవుతోంది. ఈ నెల 20న హైకోర్టు శతాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఈ ఉత్సవాలకు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ లావు నాగేశ్వరరావు, జస్టిస్ ఆర్ సుభాష్‌రెడ్డి హాజరుకానున్నారు. ఈ ఉత్సవాల ఏర్పాట్లను తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. 1920 ఏప్రిల్ 20న ప్రారంభం.. ఏడవ నిజాం నవాబు మీర్ ఉస్మాన్ ఆలీఖాన్ 1920 ఏప్రిల్ 20వ తేదీన మూసీనది ఒడ్డున ఈ హైకోర్టు భవనాన్ని ప్రారంభించారు. జైపూర్‌కు చెందిన ఇంజనీర్, ఆర్కిటెక్ట్ శంకర్‌లాల్ హైకోర్టు నమూనాను తయారు చేశారు. హైదరాబాద్‌కు చెందిన ఇంజనీర్ మెహర్ అలీ ఫజల్ నిర్వహణ బాధ్యతలను చేపట్టారు. రూ.18.22 లక్షల అంచనా వ్యయంతో హైకోర్టు భవన నిర్మాణ కాంట్రాక్ట్‌ను నవరతన్ దాస్ దక్కించుకున్నారు. ఇండో ఇస్లామిక్ సంప్రదాయ రీతిలో హైకోర్టు భవనాన్ని నిర్మించారు. ఆరుగురు జడ్జీలు, న్యాయవాదుల సంఘం పనిచేసేలా భవన నిర్మాణం జరిగింది. 1956లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు 11 మంది జడ్జీలతో ఈ భవనం నుంచే కార్యకలాపాలు ప్రారంభించింది. హైకోర్టు తొలి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ కోకా సుబ్బారావు వ్యవహరించారు. వైఎస్సార్ హయాంలో విస్తరణ.. డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో హైకోర్టు విస్తరణకు ప్రభుత్వం నుంచి పూర్తి సహాయ సహకారాలు అందించారు. -
ఏడాదంతా శతాబ్ది పండుగ
- ముగిసిన ఓయూ శతాబ్ది ప్రారంభ వేడుక - విద్యార్థుల్లో స్ఫూర్తి నింపిన పూర్వ విద్యార్థుల ప్రసంగాలు సాక్షి, హైదరాబాద్: పోరాటాల పురిటిగడ్డ ఉస్మానియా విశ్వవిద్యాలయం శతాబ్ది వేడుకలు ఏడాది పొడవునా కొనసాగనున్నాయి. ఈ నెల 26న ప్రారంభమైన ఈ వేడుకలు 2018 ఏప్రిల్ 28తో ముగుస్తాయి. ఇందు కోసం నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఓయూ ‘ఎ’ గ్రౌండ్ వేదికగా మూడు రోజుల పాటు వైభవంగా జరిగిన ప్రారంభ ఉత్సవాలను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రారంభించిన విషయం తెలిసిందే. క్యాంపస్‌లో చదువుకుని దేశవిదేశాల్లో స్థిరపడిన పూర్వ విద్యార్థులు, ఇక్కడే చదివి ఇక్కడే పరి శోధనలు చేసి, అధ్యాపకులుగా, వీసీలుగా పనిచేసి పదవి విరమణ పొందినవారు, నిపుణులు, రాజకీయ ప్రముఖులు ఈ వేడుకల్లో జ్ఞాపకాలను పంచుకున్నారు. గ్లోబల్ అలుమ్ని మీట్... ఇప్పటి వరకు వర్సిటీలో కోటి మందికి పైగా విద్యార్థులు చదువుకున్నారు. వీరిలో లక్షలాది మంది దేశవిదేశాల్లో ఉన్నతమైన హోదాల్లో స్థిరపడ్డారు. వీరందరినీ ఒకే వేదికపైకి తీసుకొచ్చేందుకు వచ్చే డిసెంబర్లో ఓయూ గ్లోబల్ అలుమ్ని మీట్ నిర్వహించాలని నిర్ణయించారు. పూర్వ విద్యార్థులను రప్పించి ‘ఎన్‌రిచింగ్ ఉస్మానియా విత్ ఏ గ్లోబల్ విజన్’పేరుతో వర్సిటీ అభివృద్ధికి తోడ్పడాలని పూర్వ విద్యార్థుల సంఘం భావిస్తోంది. ముగింపు రోజు భారీగా హాజరు... శతాబ్ది వేడుకలు శుక్రవారం సాయంత్రం ముగిశాయి. ప్రారంభ వేడుకలకు 18 వేల మంది పూర్వ విద్యార్థులు హాజరు కాగా, రెండో రోజైన గురువారం ఐదు వేల మంది హాజరయ్యారు. కేంద్ర మంత్రులు మహేంద్రనాథ్, బండారు దత్తాత్రేయ, మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్‌రావు, మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి, ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్‌తో పాటు వివిధ వర్సిటీలకు చెందిన వంద మంది వీసీలు హాజరై స్ఫూర్తిదాయక ప్రసంగాలు చేశారు. ఇక చివరి రోజైన శుక్రవారం వేలాది మంది క్యాంపస్, అనుబంధ కళాశాలలకు చెందిన పూర్వ విద్యార్థులు తరలిరావడంతో వర్సిటీ కళకళలాడింది. క్యాంపస్‌లోని చాయ్ దుకాణాలు, హాస్టళ్లు, తరగతి గదుల్లో తిరుగుతూ... పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. శతాబ్ది ఉత్సవాల లోగోల వద్ద సెల్ఫీలు దిగి భద్రపరుచుకున్నారు. దత్తతకు వంద గ్రామాలు పూర్వ విద్యార్థుల ద్వారా తెలంగాణలో దత్తత తీసుకున్న వంద గ్రామాల్లో విద్య, వైద్యం, వంటి మౌళిక సదుపాయాలు మెరుగుపడనున్నాయి. ఇందు కోసం రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లోని వంద గ్రామాలను కూడా ఎంపిక చేయడం గమనార్హం. గ్లోబల్ మీట్లో భాగంగా వివిధ రంగాలకు చెందిన వంద మంది నిపుణులను సన్మానించడంతో పాటు గౌరవ డాక్టరేట్లను ప్రదానం చేయనున్నారు. ప్రారంభ వేడుకలు ఎంత వైభవంగా నిర్వహించారో.. అంతే ఘనంగా ముగింపు ఉత్సవాలు జరపాలని వర్సిటీ అధికారులు నిర్ణయించారు. -
నూరేళ్ల ఉత్సవాలు చూద్దాం రారండి..
ఉస్మానియా యూనివర్సిటీ: నిజాం నవబ్ మీర్ ఉస్మాన్ అలీఖాన్ స్థాపించిన ఉస్మానియా విశ్వవిద్యాలయం విజయవంతగా నూరు వసంతాలు పూర్తి చేసుకుంది. నేటి నుంచి మూడు రోజుల పాటు జరిగే ప్రారంభ ఉత్సవాలు, సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు సుందరంగా అలంకరించిన క్యాంపస్‌ను నేటి తరం విద్యార్థులు చూడాల్సిందే. క్యాంపస్‌లోని కళాశాలలు, కార్యాలయాలు, హాస్టల్స్ విద్యుద్దీపాల కాంతుల్లో మెరిసిపోతున్నాయి. క్యాంపస్ ఎన్సీసీ గేటు నుంచి ఆర్ట్స్ కళాశాల వరకు ప్రతి చెట్టూ కాంతులీనుతున్నాయి. అత్యాధునిక మ్యూజియం సిద్ధం క్యాంపస్ సైన్స్ కళాశాలలోని జంతుశాస్త్రం విభాగంలో ఆసియా ఖండంలోనే అతిపెద్దదైన మృతిచెందిన జంతువుల మ్యూజియాన్ని రేపటి నుంచి తెరవనున్నారు. జియాలజీ విభాగంలో వివిధ రకాల గ్రానైట్ రాళ్లు, ఇంజినీరింగ్ కళాశాలలోని వర్క్‌షాప్‌లు, యూనివర్సిటీ లైబ్రరీ, ఆర్ట్స్ కళాశాల భవన నిర్మాణ శైలి, ఫిజిక్స్, కెమిస్ట్రీ, జూవాలజీ, బోటాని, ఫోరెన్సిక్ సైన్స్, బయో కెమిస్ట్రీ తదితర విభాగాలను, పరిశోధన ల్యాబులనూ చూడవచ్చు. శతాబ్ది ఉత్సవాల సందర్భంగా క్యాంపస్‌లోని ఆర్ట్స్ కళాశాల ఎదుట భారీ ఎత్తున సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఆహ్వాన కార్డులు, పాసుల కొరత ఓయూ శతాబ్ది ఉత్సవాల సభలోకి ప్రవేశించేందుకు ఆహ్వానకార్డులు, పాసుల కొరత ఏర్పడింది. సభను కేవలం 15 వేల మంది కోసం నిర్మించారు. అయితే ఉత్సవాలను వేల సంఖ్యలో చూసేందుకు విద్యార్థులు, పూర్వవిద్యార్థులు, విశ్రాంత ఉద్యోగులు పోటీపడుతున్నారు. వివిధ దేశాలలో స్థిరపడిన వందలాది ఓయూ పూర్వవిద్యార్థులు విచ్చేశారు.