ఏడాదంతా శతాబ్ది పండుగ
- ముగిసిన ఓయూ శతాబ్ది ప్రారంభ వేడుక
- విద్యార్థుల్లో స్ఫూర్తి నింపిన పూర్వ విద్యార్థుల ప్రసంగాలు
సాక్షి, హైదరాబాద్: పోరాటాల పురిటిగడ్డ ఉస్మానియా విశ్వవిద్యాలయం శతాబ్ది వేడుకలు ఏడాది పొడవునా కొనసాగనున్నాయి. ఈ నెల 26న ప్రారంభమైన ఈ వేడుకలు 2018 ఏప్రిల్ 28తో ముగుస్తాయి. ఇందు కోసం నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఓయూ ‘ఎ’ గ్రౌండ్ వేదికగా మూడు రోజుల పాటు వైభవంగా జరిగిన ప్రారంభ ఉత్సవాలను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రారంభించిన విషయం తెలిసిందే. క్యాంపస్‌లో చదువుకుని దేశవిదేశాల్లో స్థిరపడిన పూర్వ విద్యార్థులు, ఇక్కడే చదివి ఇక్కడే పరి శోధనలు చేసి, అధ్యాపకులుగా, వీసీలుగా పనిచేసి పదవి విరమణ పొందినవారు, నిపుణులు, రాజకీయ ప్రముఖులు ఈ వేడుకల్లో జ్ఞాపకాలను పంచుకున్నారు.
గ్లోబల్ అలుమ్ని మీట్...
ఇప్పటి వరకు వర్సిటీలో కోటి మందికి పైగా విద్యార్థులు చదువుకున్నారు. వీరిలో లక్షలాది మంది దేశవిదేశాల్లో ఉన్నతమైన హోదాల్లో స్థిరపడ్డారు. వీరందరినీ ఒకే వేదికపైకి తీసుకొచ్చేందుకు వచ్చే డిసెంబర్‌లో ఓయూ గ్లోబల్ అలుమ్ని మీట్ నిర్వహించాలని నిర్ణయించారు. పూర్వ విద్యార్థులను రప్పించి ‘ఎన్‌రిచింగ్ ఉస్మానియా విత్ ఏ గ్లోబల్ విజన్’పేరుతో వర్సిటీ అభివృద్ధికి తోడ్పడాలని పూర్వ విద్యార్థుల సంఘం భావిస్తోంది.
ముగింపు రోజు భారీగా హాజరు...
శతాబ్ది వేడుకలు శుక్రవారం సాయంత్రం ముగిశాయి. ప్రారంభ వేడుకలకు 18 వేల మంది పూర్వ విద్యార్థులు హాజరు కాగా, రెండో రోజైన గురువారం ఐదు వేల మంది హాజరయ్యారు. కేంద్ర మంత్రులు మహేంద్రనాథ్, బండారు దత్తాత్రేయ, మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్‌రావు, మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి, ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్‌తో పాటు వివిధ వర్సిటీలకు చెందిన వంద మంది వీసీలు హాజరై స్ఫూర్తిదాయక ప్రసంగాలు చేశారు. ఇక చివరి రోజైన శుక్రవారం వేలాది మంది క్యాంపస్, అనుబంధ కళాశాలలకు చెందిన పూర్వ విద్యార్థులు తరలిరావడంతో వర్సిటీ కళకళలాడింది. క్యాంపస్‌లోని చాయ్ దుకాణాలు, హాస్టళ్లు, తరగతి గదుల్లో తిరుగుతూ... పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. శతాబ్ది ఉత్సవాల లోగోల వద్ద సెల్ఫీలు దిగి భద్రపరుచుకున్నారు.
దత్తతకు వంద గ్రామాలు
పూర్వ విద్యార్థుల ద్వారా తెలంగాణలో దత్తత తీసుకున్న వంద గ్రామాల్లో విద్య, వైద్యం, వంటి మౌళిక సదుపాయాలు మెరుగుపడనున్నాయి. ఇందు కోసం రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లోని వంద గ్రామాలను కూడా ఎంపిక చేయడం గమనార్హం. గ్లోబల్ మీట్‌లో భాగంగా వివిధ రంగాలకు చెందిన వంద మంది నిపుణులను సన్మానించడంతో పాటు గౌరవ డాక్టరేట్‌లను ప్రదానం చేయనున్నారు. ప్రారంభ వేడుకలు ఎంత వైభవంగా నిర్వహించారో.. అంతే ఘనంగా ముగింపు ఉత్సవాలు జరపాలని వర్సిటీ అధికారులు నిర్ణయించారు.