ఇది భారతీయ ముస్లిం మహిళల విజయం
న్యూఢిల్లీ: భారతీయ ముస్లిం మహిళ షయరా బానో చరిత్ర సష్టించారు. ఆమె మొక్కవోని ధైర్యంతో దాదాపు రెండేళ్ల న్యాయపోరాటం ద్వారా వివాదాస్పద ట్రిపుల్ తలాక్ విధానంపై విజయం సాధించారు. ట్రిపుల్ తలాక్‌కు వ్యతిరేకంగా ఆమె 2016, ఫిబ్రవరి నెలలో వేసిన కేసుకు ఆఫ్రీన్ రెహమాన్, మరో ముస్లిం మహిళా సంఘం తోడుగా నిలవడం కేసు అంతిమ విజయానికి తోడ్పడింది. గతంలో నోటి ద్వారా స్పష్టంగా మూడు సార్లు తలాఖ్, తలాఖ్, తలాఖ్ అని ఉచ్ఛరించడం ద్వారా ముస్లిం భర్తలు తమ భార్యలకు విడుకులు ఇచ్చేవారు.
నానాటికి పెరుగుతున్న సాంకేతికాభివృద్ధి కారణంగా సమాజంలో ట్రిపుల్ తలాఖ్ విధానానికి స్పస్తి చెప్పాల్సిందిపోయి మరింత సులువుగా మారింది. టెలిఫోన్ ద్వారానే కాకుండా ఫేస్బుక్, స్పీడ్‌పోస్ట్, టెక్స్ట్ మిస్సేజ్‌ల ద్వారా ముస్లిం భర్తలు విడాకులు తీసుకోవడం మొదలయింది. ఈ కారణంగా విడాకులు ఇచ్చిన భార్యల బతుకుతెరువుకు భరణం కూడా చెల్లించడం లేదు. ఈ కారణంగానే ఈ ట్రిపుల్ తలాఖ్ ఆటవిక విధానాన్ని ప్రపంచంలో 22 ఇస్లామిక్ దేశాలు నిషేధించాయి. షయరా బానో కన్నా ముందు అనేక మంది ముస్లిం మహిళలు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. అయితే వారంతా హిందువులకు, ముస్లింలకు ఉమ్మడి పౌర స్మతి అమలు చేయడం ద్వారా తమకు న్యాయం చేయాలని కోరారు.
2016, ఫిబ్రవరి నెలలో సుప్రీం కోర్టును ఆశ్రయించిన బానో ఏకపక్షంగా ఉన్న త్రిపుల్ తలాఖ్‌ను నిషేధించాలని, అలాగే మొదటి భర్తను మళ్లీ పెళ్లి చేసుకోవాలంటే మధ్యలో మరో పర పురుషుడిని పెళ్లి చేసుకొని, విడాకులు ఇచ్చి రావాలనే ‘నిఖా హలాలా’ను రద్దు చేయాలని, ముస్లిం పురుషుల బహు భార్యత్వ హక్కులను కూడా రద్దు చేయాలని కోరారు. చట్టం ముందు స్త్రీ, పురుషులు సమానమన్నది మహిళల ప్రాథమిక, రాజ్యాంగ హక్కని ఆమె వాదించారు. ఈ వాదనతోనే ఆమె సగం విజయం సాధించినట్లయింది. మహిళల ప్రాథమిక, రాజ్యాంగ హక్కుల ప్రాతిపదికనే ఏడాదికిపైగా విచారణ జరుగుతూ వచ్చింది.
ముస్లిం వివాహం చట్టం పట్ల ముస్లిం మహిళల వైఖరి మారుతుందనడానికి బానో కేసే మంచి ఉదాహరణ. ఆమెను స్ఫూర్తిగా తీసుకొని జైపూర్‌కు చెందిన ఆఫ్రీన్ రహమాన్, స్పీడ్ పోస్ట్ ద్వారా తనకు ట్రిపుల్ తలాఖ్‌ను పంపిన భర్తపై సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ దశలో అభిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్డు అధ్యక్షురాలు షాయిస్ట అంభర్ తలాక్‌కు వ్యతిరేకంగా మాట్లాడారు. ఆ తర్వాత భారతీయ ముస్లిం మహిళా ఆందోళన్ బానోకు మద్దతుగా కేసులో ఇంప్లీడ్ అయ్యింది. గత ఆరువారాలుగా వారు దేశవ్యాప్తంగా ట్రిపుల్ తలాక్‌కు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నారు. సాధారణ మహిళల నుంచి 50 వేల సంతకాలను సేకరించారు. ఈ దశలో జాతీయ మహిళా కమిషన్ కూడా స్పందించి బానో కేసుకు మద్దతు ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం కూడా ట్రిపుల్ తలాక్ వ్యతిరేకంగా వాదించడం విశేషం. ఇన్ని పరిణామాల నేపథ్యంలో కేసును విచారించిన సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం 3:2 తీర్పు తేడాలో ట్రిపుల్ తలాక్ విధానాన్ని నిషేధించింది.
ఇంతకు ఎవరీ షయరా బానో?
ఉత్తరాఖండ్‌లోని కాశీపూర్‌కు చెందిన మధ్య తరగతి ముస్లిం కుటుంబంలో పుట్టిన షయరా బానో సోషియాలజీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు. ఆమె కథనం ప్రకారం 2001లో ఆమె పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత కొన్ని రోజులకే మరింత కట్నం కావాలంటూ బోనోను వేధించసాగారు. కుటుంబ సభ్యులను కలవనిచ్చేవాడు కాదు. కాలక్రమంలో మగ బిడ్డ, ఆడ బిడ్డ కలిగింది. అయినా బానో భర్తలో పెద్దగా మార్పు రాలేదు. అదనపు సంతానాన్ని పోషించలేనంటూ ఆరేడు సార్లు భార్యకు అబార్షన్ చేయించారు. చివరకు 14 ఏళ్ల తర్వాత, అంటే 2015లో బానోను పుట్టింటికి పంపించారు. ఆ తర్వాత వచ్చి ఇద్దరి పిల్లలను తన వెంట తీసుకెళ్లారు. పోస్ట్‌లో ఆస్తి పంపకాల కాగితాలు త్వరలో పంపిస్తానని చెప్పి వెళ్లాడు. ఓ రోజు స్పీడ్ పోస్ట్రాగా దాన్ని బానో తెరచి చూసింది. అందులో తలాఖ్, తలాఖ్, తలాఖ్ అని రాసి ఉంది. ముస్లిం మత పెద్దల వద్దకు వెళ్లగా ఆ తలాఖ్ చెల్లుతుందని వారు చెప్పారు. అప్పుడు బానో ఓ న్యాయవాదిని మాట్లాడుకొని తన న్యాయ పోరాటాన్ని ప్రారంభించారు.
ఆఫ్రీన్ రహమాన్
జైపూర్‌కు చెందిన ఎంబీఏ గ్రాడ్యుయేషన్ ఆఫ్రీన్ 2014లో ఇండోర్‌కు చెందిన న్యాయవాదిని పెళ్లి చేసుకున్నారు. ఆమె సోదరులు 25 లక్షల రూపాయల లోన్ తీసుకొని ఆమె పెళ్లి చేశారు. కొన్ని రోజుల నుంచే కుటుంబంలో కలహాలు వచ్చాయి. ఏడాది కాగానే ఆఫ్రీన్‌ను పుట్టింటికి పంపించి వేసిన భర్త స్పీడ్ పోస్ట్‌లో ట్రిపుల్ తలాఖ్‌ను పంపించారు. అప్పటికే బానో కేసు సుప్రీం కోర్టు విచారణలో ఉండడంతో ఆఫ్రీన్ కూడా సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు.
జకియా, నూర్జాహాన్
జకియా సోమన్, నూర్జాహాన్ నియాజ్‌లు 2007లో భారతీయ ముస్లిం మహిళా ఆందోళన్ సంస్థను ఏర్పాటు చేశారు. 15 రాస్ట్రాల నుంచి 30 వేల మంది మహిళా సభ్యులు ఇందులో ఉన్నారు. మసీదుల్లోకి, ముంబైలోని హాజీ అలి దర్గాలోకి ముస్లిం మహిళలను అనుమతించాలంటూ పలు ఆందోళనలను నిర్వహించిన ఈ సంస్థ బానో, ఆఫ్రీన్ పక్షాన కోర్టులో తన వాదనను వినిపించింది. ఈ సంస్థ దేశవ్యాప్తంగా సర్వే నిర్వహించి దేశంలోని ముస్లిం మహిళల్లో 92 శాతం మంది ట్రిపుల్ తలాఖ్‌ను వ్యతిరేకిస్తున్నట్లు తేల్చింది. ఈ తీర్పు ముస్లిం మహిళలకు చరిత్రాత్మకమని తీర్పు అనంతరం బానో వ్యాఖ్యానించారు.