breaking news
She Man
-
మీ ముద్దు మాకొద్దు
మహిళా సంక్షేమం కోసం బోర్డు మీటింగ్. మీటింగ్ లోపల ఆసీనులంతా పురుషులే! సాధికారతపై అత్యున్నత స్థాయి సమావేశం. మహిళా శాఖ తప్ప అన్ని శాఖలకు పిలుపు. మంచే చేస్తున్నాం కదా.. పిలవడం ఎందుకులే అనుకుంటారేమో! ట్రాన్స్జెండర్లకు తెలీదు.. నోయిడా మెట్రో తమకో స్టేషన్ ఇస్తోందని.. ఆ స్టేషన్‌కు షీ మ్యాన్ అని పేరు పెట్టిందని. తెలిశాక.. ఆ పేరును పెట్టొద్దంది. ‘ప్రత్యేకం’ అంటూ వేరుగా చూడొద్దంది!! హైదరాబాద్ మెట్రో రైల్వేలో రెడ్, బ్లూ, గ్రీన్ లైన్లు ఉన్నట్లు నోయిడా మెట్రో రైల్వేలో ‘ఆక్వా’ లైన్ ఉంది. ఆ లైన్ నోయిడా స్టేషన్ నుంచి గ్రేటర్ నోయిడా స్టేషన్‌కు వెళుతుంది. ఆ మధ్యలో ‘సెక్టార్ 50’ స్టేషన్ ఉంటుంది. ఆ స్టేషన్‌ని ఇప్పుడు ట్రాన్‌జెండర్ సిబ్బంది కోసం ప్రత్యేకంగా తీర్చిద్దిబోతోంది నోయిడా మెట్రో. నోయిడా మెట్రోలో ఉన్న ట్రాన్స్‌జెండర్ స్టాఫ్ అందరినీ అక్కడికి విధులకు బదలీ చేస్తారు. అందులోని వివిధ విభాగాలలో, కౌంటర్లలో ట్రాన్స్జెండర్లే ఉంటారు. వాళ్లకోసం ప్రత్యేక సదుపాయాలు, వసతులు ఏర్పరుస్తారు. అక్కడ దిగి, ఎక్కే ట్రాన్స్‌జెండర్ ప్రయాణికులకు కూడా ప్రత్యేక సౌకర్యాలు ఉంటాయి. ట్రాన్స్జెండర్ల అవసరాలకు, హక్కులకు ప్రాధాన్యం ఇచ్చేందుకు ఎన్.ఎం.ఆర్.సి. (నోయిడా మెట్రో రైల్ కార్పోరేషన్) ఈ నిర్ణయం తీసుకుంది. ఎన్.ఎం.ఆర్.సి. మేనేజింగ్ డైరెక్టర్ రీతూ మహేశ్వరి చెబుతున్న దానిని బట్టి ‘‘ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీ కలుపుకుని పోవడం’’ ఇందులోని ప్రధాన ఉద్దేశం. అయితే ఆ ఉద్దేశంతో ‘పూర్తిగా’ కలసిపోయేందుకు ట్రాన్స్జెండర్లు సిద్ధంగా లేరని ఏర్పాట్లన్నీ అయ్యాక రీతూ దృషికొచ్చింది. ఇప్పటికే కలిసిమెలిసి ఉన్నవాళ్లను మళ్లీ ‘ప్రత్యేకంగా’ కలుపుకుని పోవడం ఏంటనే వారి ప్రశ్నను పక్కన పెడితే.. ఆ స్టేషన్‌కు ‘షీ మ్యాన్’ అని పేరు పెట్టాలని నోయిడా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ తీర్మానించడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తమవుతోంది. నోయిడా మెట్రో లైన్ గత ఏడాది జనవరిలో మొదలైంది. ఆక్వాలైన్ 30 కి.మీ. పొడవున ఉంటుంది. మధ్యలో 21 స్టేషన్లు ఉంటాయి. వాటిల్లో ‘సెక్టార్ 50’ ఒక స్టేషన్. ఈ ఏడాది మార్చిలో సెక్టార్ –76, పరీచౌక్ స్టేషన్లను నోయిడా మెట్రో పింక్ స్టేషన్లుగా మార్చింది. సెక్యూరిటీ గార్డులు మినహా అక్కడంతా మహిళా సిబ్బందే పని చేస్తుంటారు. టికెట్ కౌంటర్లు మొదలు మిగతా అన్ని కౌంటర్లలో మహిళలే విధులు నిర్వహిస్తుంటారు. ఆ స్టేషన్లో ఉండే లంచ్రూమ్, టాయిలెట్ రూమ్స్ అన్నీ మహిళల కోసమే. మహిళా ప్రయాణికుల కోసం బిడ్డలకు పాలివ్వడానికి ‘స్తన్యగృహాలు’ ఉంటాయి. అవి పింక్ స్టేషన్లు అని స్పష్టంగా తెలిసేలా గోడలకు, బోర్డులకు లేత గులాబీ రంగు పెయింట్ వేసి ఉంటుంది. అదే విధంగా ట్రాన్స్జెండర్లకు కూడా ఒక స్టేషన్ ఉంటే వాళ్ల సమస్యలకు పరిష్కారంగా, వివక్షకు దూరంగా ఉంటుందని రీతూ భావించారు. అయితే అలా ‘దూరంగా’ ఉంచాలని అనుకోవడమే తమను దూరం చేస్తోందని, మరీ ముఖ్యంగా షీ మ్యాన్ అనే పేరు తమ కమ్యూనిటీని తక్కువ చేసి చూపిస్తోందని ట్రాన్స్జెండర్లు అంటున్నారు. ఎన్.ఎం.ఆర్.సి. ఊహించని పరిణామం ఇది. ఒక ట్రాన్స్‌జెండర్‌ను షీ మ్యాన్ అనడంలోని ఔన్నత్యం ఏమిటో ట్రాన్స్జెండర్లకు అర్థం కావడం లేదు. హి–షి, హీఫిమేల్, షీమేల్, లేడీబాయ్ అనే వాటిలానే షీ మ్యాన్‌నూ వారు పరిగణిస్తున్నారు. ఈ పేర్లన్నీ అవమానాలు వారి దృష్టిలో. గేలి చేసే మాటలు. ‘‘షి మ్యాన్ అనేది హీనపరిచే మాట. ఆడ కాదు, మగ కాదు అనడం’’ అంటారు డాక్టర్ అక్సా షేక్. ట్రాన్స్ ఉమన్ డాక్టర్ అక్సా. అంజన్ జోషి ఇంతకన్న కాస్త ఆగ్రహంగానే స్పందిస్తున్నారు. ‘‘షీ మ్యాన్ అంటే ఏంటి వాళ్ల ఉద్దేశం! అవమానిస్తున్నారా.. నాన్–జెండర్ కమ్యూనిటీని ఆ మాటతో!!’’ అంటున్నారు. అంజన్ ఎల్జీబీటీ హక్కుల సంస్థ ‘స్పేస్’కు సహవ్యవస్థాపకులు. ఇక ట్విట్టర్లో కూడా ట్రాన్స్జెండర్ల తరఫున షీ మ్యాన్ అనే పేరుపై నిరసన స్వరం వినిపిస్తోంది. దీంతో ఇప్పుడు షీ మ్యాన్ అని కాకుండా.. ‘ట్రాన్స్‌జెండర్ స్టేషన్’, ‘రెయిన్ బో స్టేషన్’ వంటి పేర్లను ఉదాహరిస్తూ నోయిడా మెట్రో తన వెబ్ సైట్లో ట్రాన్స్జెండర్ల నుంచి సూచనలు, సలహాలను కోరబోతోంది. ‘‘బోర్డు డైరెక్టర్లతో పాటు ఒక ఎన్జీవో సంస్థ ప్రతినిధి కూడా అమోదించిన తర్వాతే ‘షీ మ్యాన్’ అనే పేరును ఎంపిక చేశాం. అయితే ఆమోదించవలసిన వాళ్లు ఆమోదిస్తేనే ఏ పేరైనా ఖరారు అవుతుంది’’ అని రీతూ మహేశ్వరి ఒక ప్రకటన విడుదల చేయడం ట్రాన్స్జెండర్లను కొద్దిగా శాంతింపజేసింది. వారంటున్నది నిజమే. ‘ప్రత్యేకం’ అనేది వేరు చేసేదిగా ఉండకూడదు. ‘‘షీ మ్యాన్ అనే పేరుపై బోర్డు మీటింగులో ఏకాభిప్రాయం వ్యక్తం అయింది. అయితే ఆ పేరు ట్రాన్స్జెండర్లకు నచ్చలేదు కాబట్టి కొత్త పేరు కోసం వారి నుంచే సూచనలు కోరాలని నిర్ణయించాం.– రీతూ మహేశ్వరి, ఎన్.ఎం.ఆర్.సి. ఎండీ ‘‘రెండు సగాల నిండుదనం అని అర్థం వచ్చే ‘షీ మ్యాన్’ అనే మాటలను ట్రాన్స్జెండర్లు ఏనాటికీ సమ్మతించరు. పైగా అది వారిని బాధిస్తుంది’’.– డాక్టర్ అక్సా షేక్, ట్రాన్స్ ఉమన్ -
సెల్యులాయిడ్ శక్తి స్వరూపిణి
తెలుగు సినిమా పుట్టి 83 ఏళ్లు. వేల సినిమాలొచ్చాయి. కానీ, వాటిల్లో స్త్రీ శక్తి ప్రధానమైన చిత్రాలు తక్కువే. గడచిన పాతికేళ్లలో అయితే అది మరీ పలచబడి పోయింది. రాశి తక్కువైనా వాసిలో గొప్పవైన అలాంటి తొమ్మిది సినిమాల గురించి... ఈ నవరాత్రుల్లో... కర్తవ్యం (1990) - స్త్రీ పాత్రలన్నీ ప్రేమ, పెళ్ళి లాంటి అంశాల చుట్టే తిరుగుతున్న టైమ్‌లో తెలుగు తెరపై లేడీ ఓరియంటెడ్ సినిమాలకు కొత్త ఊపు తెచ్చిన చిత్రం. సమకాలీన సమాజంలోని కిరణ్ బేడీ జీవితం స్ఫూర్తితో అల్లుకున్న ఈ లేడీ ఐ.పి.ఎస్. ఆఫీసర్ కథ ఉత్తేజపూరిత అనుభవం. తెలుగు, తమిళం, హిందీ - ఇలా ఎక్కడకు వెళ్ళినా హిట్టే. ఈ కథతో ‘షీ మ్యాన్’ పాత్రలకు విజయశాంతి కేరాఫ్ అడ్రసయ్యారు. ‘లేడీ అమితాబ్’ పట్టంతో పాటు, కోటి పారితోషికం తీసుకున్న తొలి తెలుగు హీరోయిన్ అయ్యారు. అశ్వని (1991) - ఇటీవల హిందీలో వస్తున్న అనేకానేక జీవితకథా చిత్రాలకూ, స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ సినిమాలకూ చాలా ముందే పాతికేళ్ళ క్రితం తెలుగులో చేసిన ప్రయత్నం. జాతీయ చాంపియన్ అయిన భారతీయ అథ్లెట్ అశ్వినీ నాచప్ప జీవితం ఆధారంగా రూపొందిన సినిమా ఇది. అశ్వినితోనే ఆ పాత్రను పోషింపజేయడం అప్పట్లో మరో సంచలనం. ప్రతిభను పసిగట్టి సానపెట్టేవాళ్ళుంటే స్త్రీలేమీ తక్కువకారని చాటిచెప్పిన స్ఫూర్తిదాయక చిత్రం. అమ్మోరు (1995) - మామూలు మనుషుల్ని తట్టుకోవడమే కష్టం. అలాంటిది ఆమె దుష్టశక్తితోనే తలపడాల్సి వచ్చింది. భర్త ఎక్కడో దూరంగా ఉన్నాడు. ఉన్నదల్లా అమ్మోరు తల్లి అండ. ఆ నమ్మకంతోనే కష్టాలన్నీ భరించింది. ఇలాంటి కథలు చాలా వచ్చి ఉండొచ్చు. గ్రాఫిక్స్‌తో డీల్ చేయడమే వండర్. సౌందర్య యాక్టింగ్ లేడీస్ ఫాలోయింగ్ తెచ్చింది. ఒసేయ్... రాములమ్మా! (1997) - తెలంగాణలోని మహిళా విప్లవాన్ని తెరపై చూపెట్టిన ‘ఎర్ర’ సినిమా. దొరల సంస్కృతిపై ఎక్కుపెట్టిన సెల్యులా యిడ్ గన్. మాదాల రంగారావు, ఆర్. నారాయణమూర్తి తరహా సినిమాలకు దాసరి నారాయణరావు ఇచ్చిన పర్ఫెక్ట్ బాక్సాఫీస్ క్లైమాక్స్ - ఈ సూపర్ హిట్ సినిమా. ‘ప్రజా యుద్ధ నౌక’లుగా నిలిచిన విప్లవ గాయకుల జీవిత స్ఫూర్తి, మహిళా ఉద్యమకారుల చైతన్యదీప్తి కలగలిసి, ‘వందేమాతరం’ శ్రీనివాస్ స్వరం, సుద్దాల అశోక్‌తేజ కలం పదును రుచిచూపెట్టాయి. విజయశాంతి రాజకీయజీవిత ఆకాంక్షలకు ఊపిరిలూదిన పాస్‌పోర్ట్ ఈ ఫిల్మ్. అంతఃపురం (1999) - ప్రేమ తప్ప ఇంకేమీ తెలియని, కుటుంబం తప్ప ఇంకేం వద్దనుకునే అమ్మాయి. ఆమె జీవితంలో ఊహించని పరిణామం. కుట్రలూ కుతంత్రాలూ రక్తపాతాలూ మారణహోమాలు నిండిన లోకంలోకి వచ్చి పడింది. కుందేలు పిల్ల కాస్తా శివంగిలా మారింది. కృష్ణవంశీ తీసిన సినిమాల్లో వన్ ఆఫ్ ది బెస్ట్. సౌందర్య నటించలేదు. జీవించిందంతే. 9 నెలలు (2001) - ‘సరోగసీ’ (అద్దె గర్భం) ఇప్పుడు హాట్ టాపిక్. దీని గురించి క్రాంతికుమార్ 14 ఏళ్ల క్రితమే వెండితెరపై చర్చించారు. అప్పుడ ప్పుడే కెరీర్లో కుదురుకుంటున్న సౌందర్యకు పర్సనల్ శాటిస్ఫేక్షన్ ఇచ్చిన సినిమా. ముందే కూసిన ఈ కోయిల నిజానికి ఇప్పుడు రావాల్సింది.మిస్సమ్మ (2003) - కుటుంబాన్ని నొప్పి లేకుండా సుతిమెత్తగా డీల్ చేయగల స్త్రీ, ఒక కంపెనీని డీల్ చేయడం కష్టం కాదు. తన తర్వాత సంస్థకు వారసుణ్ణి ఎంపిక చేయడం కోసం ఓ స్త్రీ చేసిన అన్వేషణ, తపనే ఈ ‘మిస్సమ్మ’ సినిమా. భూమికకు ‘ఖుషీ’తో పేరొచ్చిందేమో కానీ, ఈ ‘మిస్సమ్మ’ మాత్రం ఆమెకు గ్రేట్ మెమరీగా నిలిచిపోతుంది. అరుంధతి (2009) - ఈ ఆధునిక సాంకేతిక యుగంలో విజువల్ ఎఫెక్ట్స్ పరిజ్ఞానాన్ని వినియోగించుకొని పాతకాలపు అంధ విశ్వాసాలను తెరపై ఆవిష్కరించిన హార్రర్ - ఫ్యాంటసీ ఫిల్మ్. తెలుగుతెరపై గ్రాఫిక్స్ శకానికి మొదటి నుంచి నారుపోసి నీరు పెడుతూ వచ్చిన నిర్మాత ఎం. శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి కలల పంట. కోడి రామకృష్ణ మార్కు దర్శకత్వ ప్రతిభ, అనుష్కలోని అపూర్వ అభినయ పార్శ్వం బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులతో ‘వదల బొమ్మాళీ! వదల!’ అనిపించాయి. కోట్ల ఖర్చుకు పదుల కోట్ల వసూళ్ళు తెచ్చి, బాక్సాఫీస్ వద్దా మహిళలు మహారాణులేనని చూపింది. రుద్రమదేవి (2015) - మూడు దశాబ్దాల తరువాత తెలుగులో వచ్చిన భారీ హిస్టారికల్ ఫిల్మ్. లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో అత్యంత భారీ ఖర్చు (రూ. 80 కోట్లు)తో తయారైన సినిమా. భారతదేశంలో గద్దెనెక్కి, రాజ్యమేలిన తొలి మహిళ రాణీ రుద్రమదేవి జీవిత కథ. దర్శక - నిర్మాత గుణశేఖర్ దాదాపు మూడేళ్ళు చేసిన భారీ 3డీ యజ్ఞం. లేడీ ఓరియెంటెడ్ కథలకు, క్లిష్టమైన పాత్రపోషణకు కొత్త చిరునామా అనుష్క కెరీర్లో కొత్త శిఖి పింఛం!