మారని ధోరణులపై ఆత్మగౌరవ పోరాటం
మహిళా సంక్షేమం కోసం బోర్డు మీటింగ్. మీటింగ్ లోపల ఆసీనులంతా పురుషులే! సాధికారతపై అత్యున్నత స్థాయి సమావేశం. మహిళా శాఖ తప్ప అన్ని శాఖలకు పిలుపు. మంచే చేస్తున్నాం కదా..
పిలవడం ఎందుకులే అనుకుంటారేమో! ట్రాన్స్‌జెండర్‌లకు తెలీదు.. నోయిడా మెట్రో తమకో స్టేషన్ ఇస్తోందని.. ఆ స్టేషన్‌కు షీ మ్యాన్ అని పేరు పెట్టిందని. తెలిశాక.. ఆ పేరును పెట్టొద్దంది. ‘ప్రత్యేకం’ అంటూ వేరుగా చూడొద్దంది!!
హైదరాబాద్ మెట్రో రైల్వేలో రెడ్, బ్లూ, గ్రీన్ లైన్‌లు ఉన్నట్లు నోయిడా మెట్రో రైల్వేలో ‘ఆక్వా’ లైన్ ఉంది. ఆ లైన్ నోయిడా స్టేషన్ నుంచి గ్రేటర్ నోయిడా స్టేషన్‌కు వెళుతుంది. ఆ మధ్యలో ‘సెక్టార్ 50’ స్టేషన్ ఉంటుంది. ఆ స్టేషన్‌ని ఇప్పుడు ట్రాన్‌జెండర్ సిబ్బంది కోసం ప్రత్యేకంగా తీర్చిద్దిబోతోంది నోయిడా మెట్రో. నోయిడా మెట్రోలో ఉన్న ట్రాన్స్‌జెండర్ స్టాఫ్ అందరినీ అక్కడికి విధులకు బదలీ చేస్తారు. అందులోని వివిధ విభాగాలలో, కౌంటర్‌లలో ట్రాన్స్‌జెండర్‌లే ఉంటారు. వాళ్లకోసం ప్రత్యేక సదుపాయాలు, వసతులు ఏర్పరుస్తారు. అక్కడ దిగి, ఎక్కే ట్రాన్స్‌జెండర్ ప్రయాణికులకు కూడా ప్రత్యేక సౌకర్యాలు ఉంటాయి. ట్రాన్స్‌జెండర్‌ల అవసరాలకు, హక్కులకు ప్రాధాన్యం ఇచ్చేందుకు ఎన్.ఎం.ఆర్.సి. (నోయిడా మెట్రో రైల్ కార్పోరేషన్) ఈ నిర్ణయం తీసుకుంది. ఎన్.ఎం.ఆర్.సి. మేనేజింగ్ డైరెక్టర్ రీతూ మహేశ్వరి చెబుతున్న దానిని బట్టి ‘‘ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీ కలుపుకుని పోవడం’’ ఇందులోని ప్రధాన ఉద్దేశం. అయితే ఆ ఉద్దేశంతో ‘పూర్తిగా’ కలసిపోయేందుకు ట్రాన్స్‌జెండర్‌లు సిద్ధంగా లేరని ఏర్పాట్లన్నీ అయ్యాక రీతూ దృషికొచ్చింది. ఇప్పటికే కలిసిమెలిసి ఉన్నవాళ్లను మళ్లీ ‘ప్రత్యేకంగా’ కలుపుకుని పోవడం ఏంటనే వారి ప్రశ్నను పక్కన పెడితే.. ఆ స్టేషన్‌కు ‘షీ మ్యాన్’ అని పేరు పెట్టాలని నోయిడా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ తీర్మానించడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తమవుతోంది.
నోయిడా మెట్రో లైన్ గత ఏడాది జనవరిలో మొదలైంది. ఆక్వాలైన్ 30 కి.మీ. పొడవున ఉంటుంది. మధ్యలో 21 స్టేషన్‌లు ఉంటాయి. వాటిల్లో ‘సెక్టార్ 50’ ఒక స్టేషన్. ఈ ఏడాది మార్చిలో సెక్టార్ –76, పరీచౌక్ స్టేషన్‌లను నోయిడా మెట్రో పింక్ స్టేషన్‌లుగా మార్చింది. సెక్యూరిటీ గార్డులు మినహా అక్కడంతా మహిళా సిబ్బందే పని చేస్తుంటారు. టికెట్ కౌంటర్‌లు మొదలు మిగతా అన్ని కౌంటర్‌లలో మహిళలే విధులు నిర్వహిస్తుంటారు. ఆ స్టేషన్‌లో ఉండే లంచ్‌రూమ్, టాయిలెట్ రూమ్స్ అన్నీ మహిళల కోసమే. మహిళా ప్రయాణికుల కోసం బిడ్డలకు పాలివ్వడానికి ‘స్తన్యగృహాలు’ ఉంటాయి. అవి పింక్ స్టేషన్‌లు అని స్పష్టంగా తెలిసేలా గోడలకు, బోర్డులకు లేత గులాబీ రంగు పెయింట్ వేసి ఉంటుంది. అదే విధంగా ట్రాన్స్‌జెండర్‌లకు కూడా ఒక స్టేషన్ ఉంటే వాళ్ల సమస్యలకు పరిష్కారంగా, వివక్షకు దూరంగా ఉంటుందని రీతూ భావించారు. అయితే అలా ‘దూరంగా’ ఉంచాలని అనుకోవడమే తమను దూరం చేస్తోందని, మరీ ముఖ్యంగా షీ మ్యాన్ అనే పేరు తమ కమ్యూనిటీని తక్కువ చేసి చూపిస్తోందని ట్రాన్స్‌జెండర్‌లు అంటున్నారు. ఎన్.ఎం.ఆర్.సి. ఊహించని పరిణామం ఇది.
ఒక ట్రాన్స్‌జెండర్‌ను షీ మ్యాన్ అనడంలోని ఔన్నత్యం ఏమిటో ట్రాన్స్‌జెండర్‌లకు అర్థం కావడం లేదు. హి–షి, హీఫిమేల్, షీమేల్, లేడీబాయ్ అనే వాటిలానే షీ మ్యాన్‌నూ వారు పరిగణిస్తున్నారు. ఈ పేర్లన్నీ అవమానాలు వారి దృష్టిలో. గేలి చేసే మాటలు. ‘‘షి మ్యాన్ అనేది హీనపరిచే మాట. ఆడ కాదు, మగ కాదు అనడం’’ అంటారు డాక్టర్ అక్సా షేక్. ట్రాన్స్ ఉమన్ డాక్టర్ అక్సా. అంజన్ జోషి ఇంతకన్న కాస్త ఆగ్రహంగానే స్పందిస్తున్నారు. ‘‘షీ మ్యాన్ అంటే ఏంటి వాళ్ల ఉద్దేశం! అవమానిస్తున్నారా.. నాన్–జెండర్ కమ్యూనిటీని ఆ మాటతో!!’’ అంటున్నారు. అంజన్ ఎల్జీబీటీ హక్కుల సంస్థ ‘స్పేస్’కు సహవ్యవస్థాపకులు. ఇక ట్విట్టర్‌లో కూడా ట్రాన్స్‌జెండర్‌ల తరఫున షీ మ్యాన్ అనే పేరుపై నిరసన స్వరం వినిపిస్తోంది. దీంతో ఇప్పుడు షీ మ్యాన్ అని కాకుండా.. ‘ట్రాన్స్‌జెండర్ స్టేషన్’, ‘రెయిన్ బో స్టేషన్’ వంటి పేర్లను ఉదాహరిస్తూ నోయిడా మెట్రో తన వెబ్ సైట్‌లో ట్రాన్స్‌జెండర్‌ల నుంచి సూచనలు, సలహాలను కోరబోతోంది. ‘‘బోర్డు డైరెక్టర్‌లతో పాటు ఒక ఎన్జీవో సంస్థ ప్రతినిధి కూడా అమోదించిన తర్వాతే ‘షీ మ్యాన్’ అనే పేరును ఎంపిక చేశాం. అయితే ఆమోదించవలసిన వాళ్లు ఆమోదిస్తేనే ఏ పేరైనా ఖరారు అవుతుంది’’ అని రీతూ మహేశ్వరి ఒక ప్రకటన విడుదల చేయడం ట్రాన్స్‌జెండర్‌లను కొద్దిగా శాంతింపజేసింది. వారంటున్నది నిజమే. ‘ప్రత్యేకం’ అనేది వేరు చేసేదిగా ఉండకూడదు.
‘‘షీ మ్యాన్ అనే పేరుపై బోర్డు మీటింగులో ఏకాభిప్రాయం వ్యక్తం అయింది. అయితే ఆ పేరు ట్రాన్స్‌జెండర్‌లకు నచ్చలేదు కాబట్టి కొత్త పేరు కోసం వారి నుంచే సూచనలు కోరాలని నిర్ణయించాం.– రీతూ మహేశ్వరి, ఎన్.ఎం.ఆర్.సి. ఎండీ
‘‘రెండు సగాల నిండుదనం అని అర్థం వచ్చే ‘షీ మ్యాన్’ అనే మాటలను ట్రాన్స్‌జెండర్‌లు ఏనాటికీ సమ్మతించరు. పైగా అది వారిని బాధిస్తుంది’’.– డాక్టర్ అక్సా షేక్, ట్రాన్స్ ఉమన్
Comments
Please login to add a commentAdd a comment