సెల్యులాయిడ్ శక్తి స్వరూపిణి
తెలుగు సినిమా పుట్టి 83 ఏళ్లు. వేల సినిమాలొచ్చాయి. కానీ, వాటిల్లో స్త్రీ శక్తి ప్రధానమైన చిత్రాలు తక్కువే. గడచిన పాతికేళ్లలో అయితే అది మరీ పలచబడి పోయింది. రాశి తక్కువైనా వాసిలో గొప్పవైన అలాంటి తొమ్మిది సినిమాల గురించి... ఈ నవరాత్రుల్లో...
కర్తవ్యం (1990) - స్త్రీ పాత్రలన్నీ ప్రేమ, పెళ్ళి లాంటి అంశాల చుట్టే తిరుగుతున్న టైమ్‌లో తెలుగు తెరపై లేడీ ఓరియంటెడ్ సినిమాలకు కొత్త ఊపు తెచ్చిన చిత్రం. సమకాలీన సమాజంలోని కిరణ్ బేడీ జీవితం స్ఫూర్తితో అల్లుకున్న ఈ లేడీ ఐ.పి.ఎస్. ఆఫీసర్ కథ ఉత్తేజపూరిత అనుభవం. తెలుగు, తమిళం, హిందీ - ఇలా ఎక్కడకు వెళ్ళినా హిట్టే. ఈ కథతో ‘షీ మ్యాన్’ పాత్రలకు విజయశాంతి కేరాఫ్ అడ్రసయ్యారు. ‘లేడీ అమితాబ్’ పట్టంతో పాటు, కోటి పారితోషికం తీసుకున్న తొలి తెలుగు హీరోయిన్ అయ్యారు.
అశ్వని (1991) - ఇటీవల హిందీలో వస్తున్న అనేకానేక జీవితకథా చిత్రాలకూ, స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ సినిమాలకూ చాలా ముందే పాతికేళ్ళ క్రితం తెలుగులో చేసిన ప్రయత్నం. జాతీయ చాంపియన్ అయిన భారతీయ అథ్లెట్ అశ్వినీ నాచప్ప జీవితం ఆధారంగా రూపొందిన సినిమా ఇది. అశ్వినితోనే ఆ పాత్రను పోషింపజేయడం అప్పట్లో మరో సంచలనం. ప్రతిభను పసిగట్టి సానపెట్టేవాళ్ళుంటే స్త్రీలేమీ తక్కువకారని చాటిచెప్పిన స్ఫూర్తిదాయక చిత్రం.
అమ్మోరు (1995) - మామూలు మనుషుల్ని తట్టుకోవడమే కష్టం. అలాంటిది ఆమె దుష్టశక్తితోనే తలపడాల్సి వచ్చింది. భర్త ఎక్కడో దూరంగా ఉన్నాడు. ఉన్నదల్లా అమ్మోరు తల్లి అండ. ఆ నమ్మకంతోనే కష్టాలన్నీ భరించింది. ఇలాంటి కథలు చాలా వచ్చి ఉండొచ్చు. గ్రాఫిక్స్‌తో డీల్ చేయడమే వండర్. సౌందర్య యాక్టింగ్ లేడీస్ ఫాలోయింగ్ తెచ్చింది.
ఒసేయ్... రాములమ్మా! (1997) - తెలంగాణలోని మహిళా విప్లవాన్ని తెరపై చూపెట్టిన ‘ఎర్ర’ సినిమా. దొరల సంస్కృతిపై ఎక్కుపెట్టిన సెల్యులా యిడ్ గన్. మాదాల రంగారావు, ఆర్. నారాయణమూర్తి తరహా సినిమాలకు దాసరి నారాయణరావు ఇచ్చిన పర్‌ఫెక్ట్ బాక్సాఫీస్ క్లైమాక్స్ - ఈ సూపర్ హిట్ సినిమా. ‘ప్రజా యుద్ధ నౌక’లుగా నిలిచిన విప్లవ గాయకుల జీవిత స్ఫూర్తి, మహిళా ఉద్యమకారుల చైతన్యదీప్తి కలగలిసి, ‘వందేమాతరం’ శ్రీనివాస్ స్వరం, సుద్దాల అశోక్‌తేజ కలం పదును రుచిచూపెట్టాయి. విజయశాంతి రాజకీయజీవిత ఆకాంక్షలకు ఊపిరిలూదిన పాస్‌పోర్ట్ ఈ ఫిల్మ్.
అంతఃపురం (1999) - ప్రేమ తప్ప ఇంకేమీ తెలియని, కుటుంబం తప్ప ఇంకేం వద్దనుకునే అమ్మాయి. ఆమె జీవితంలో ఊహించని పరిణామం. కుట్రలూ కుతంత్రాలూ రక్తపాతాలూ మారణహోమాలు నిండిన లోకంలోకి వచ్చి పడింది. కుందేలు పిల్ల కాస్తా శివంగిలా మారింది. కృష్ణవంశీ తీసిన సినిమాల్లో వన్ ఆఫ్ ది బెస్ట్. సౌందర్య నటించలేదు. జీవించిందంతే.
9 నెలలు (2001) - ‘సరోగసీ’ (అద్దె గర్భం) ఇప్పుడు హాట్ టాపిక్. దీని గురించి క్రాంతికుమార్ 14 ఏళ్ల క్రితమే వెండితెరపై చర్చించారు. అప్పుడ ప్పుడే కెరీర్‌లో కుదురుకుంటున్న సౌందర్యకు పర్సనల్ శాటిస్‌ఫేక్షన్ ఇచ్చిన సినిమా. ముందే కూసిన ఈ కోయిల నిజానికి ఇప్పుడు రావాల్సింది.మిస్సమ్మ (2003) - కుటుంబాన్ని నొప్పి లేకుండా సుతిమెత్తగా డీల్ చేయగల స్త్రీ, ఒక కంపెనీని డీల్ చేయడం కష్టం కాదు. తన తర్వాత సంస్థకు వారసుణ్ణి ఎంపిక చేయడం కోసం ఓ స్త్రీ చేసిన అన్వేషణ, తపనే ఈ ‘మిస్సమ్మ’ సినిమా. భూమికకు ‘ఖుషీ’తో పేరొచ్చిందేమో కానీ, ఈ ‘మిస్సమ్మ’ మాత్రం ఆమెకు గ్రేట్ మెమరీగా నిలిచిపోతుంది.
అరుంధతి (2009) - ఈ ఆధునిక సాంకేతిక యుగంలో విజువల్ ఎఫెక్ట్స్ పరిజ్ఞానాన్ని వినియోగించుకొని పాతకాలపు అంధ విశ్వాసాలను తెరపై ఆవిష్కరించిన హార్రర్ - ఫ్యాంటసీ ఫిల్మ్. తెలుగుతెరపై గ్రాఫిక్స్ శకానికి మొదటి నుంచి నారుపోసి నీరు పెడుతూ వచ్చిన నిర్మాత ఎం. శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి కలల పంట. కోడి రామకృష్ణ మార్కు దర్శకత్వ ప్రతిభ, అనుష్కలోని అపూర్వ అభినయ పార్శ్వం బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులతో ‘వదల బొమ్మాళీ! వదల!’ అనిపించాయి. కోట్ల ఖర్చుకు పదుల కోట్ల వసూళ్ళు తెచ్చి, బాక్సాఫీస్ వద్దా మహిళలు మహారాణులేనని చూపింది.
రుద్రమదేవి (2015) - మూడు దశాబ్దాల తరువాత తెలుగులో వచ్చిన భారీ హిస్టారికల్ ఫిల్మ్. లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో అత్యంత భారీ ఖర్చు (రూ. 80 కోట్లు)తో తయారైన సినిమా. భారతదేశంలో గద్దెనెక్కి, రాజ్యమేలిన తొలి మహిళ రాణీ రుద్రమదేవి జీవిత కథ. దర్శక - నిర్మాత గుణశేఖర్ దాదాపు మూడేళ్ళు చేసిన భారీ 3డీ యజ్ఞం. లేడీ ఓరియెంటెడ్ కథలకు, క్లిష్టమైన పాత్రపోషణకు కొత్త చిరునామా అనుష్క కెరీర్‌లో కొత్త శిఖి పింఛం!