సుకుమార్ మార్క్ ప్రేమకథ
‘‘నేను చేసిన ‘ఆర్య’ చిత్రానికి సూర్య ప్రతాప్ అసోసియేట్ డెరైక్టర్‌గా చేశాడు. అతనిలో మంచి ఈజ్ ఉంది. సూర్యప్రతాప్ చెప్పిన లైన్ నచ్చి, ఈ కథ తయారు చేశాను. ఈ కథను తనే తెరకెక్కిస్తే న్యాయం జరుగుతుందనుకున్నా. ఈ చిత్రానికి దేవిశ్రీస్రాద్, రత్నవేలు, రాజ్‌తరుణ్.. ఈ ముగ్గురూ హీరోలు. స్నేహానికి విలువిచ్చి, సంగీతం అందించడానికి దేవిశ్రీప్రసాద్, ఛాయగ్రాహకుడిగా చేయడానికి రత్నవేలు ఒప్పుకున్నారు. సున్నితమైన ప్రేమకథ నేపథ్యంలో ఈ చిత్రం ఉంటుంది’’ అని దర్శకుడు సుకుమార్ చెప్పారు. ఆయన నిర్మాతగా మారి, సుకుమార్ రైటింగ్స్ పతాకంపై పీఏ మోషన్ పిక్చర్స్ సంస్థ అధినేత థామస్ రెడ్డి ఆదూరితో కలిసి నిర్మిస్తున్న చిత్రం ‘కుమారి 21 ఎఫ్’.
పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో రాజ్‌తరుణ్, షీనా బజాజ్ జంటగా రూపొందుతున్న ఈ చిత్రం ఆదివారం మొదలైంది. ముహూర్తపు దృశ్యానికి అక్కినేని నాగచైతన్య కెమెరా స్విచాన్ చేయగా, ‘దిల్’ రాజు క్లాప్ ఇచ్చారు. దర్శకుడు సురేందర్‌రెడ్డి గౌరవ దర్శకత్వం వహించారు. సూర్య ప్రతాప్ మాట్లాడుతూ - ‘‘‘కరెంట్’ తర్వాత నేను దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఇది. నన్ను నమ్మి సుకుమార్ అవకాశం ఇచ్చారు. ఆ నమ్మకాన్ని నిలబెడతా’’ అన్నారు. ఈ నెల 16న రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తామని నిర్మాతల్లో ఒకరైన థామస్ రెడ్డి ఆదూరి అన్నారు. ఈ చిత్రానికి మాటలు: పొట్లూరి వెంకటేశ్వరరావు, సహనిర్మాతలు: ఎం. రాజా, ఎస్. రవికుమార్.