సత్యాగ్ని కథలు
మైనారిటీ సాహిత్యానికి మొదటి చేర్పు
తెలుగు కథలో గురజాడ ‘పెద్ద మసీదు’ ఉంది. శ్రీపాద ‘ఇలాంటి తవ్వాయి వస్తే’ ఉంది. రాయలసీమ తొలితరం కథల్లో ఒక ముస్లిం వైద్యుని చేత కొడుకుకు వైద్యం నిరాకరించే చాందస అత్తగారిని ఎదిరించే కోడలి కథ ఉంది. నెల్లూరు కేశవస్వామి కథల నిండా ముస్లిములే. ముస్లింల జీవితాలు, పాత్రలు తెలుగు కథల్లో ఆది నుంచీ ఉన్నాయి. అయితే అవి ముస్లిమేతరులు రాసినవి. ఒక ముస్లిం అయి ఉండి ముస్లింల జీవితాల గురించి రాయవచ్చని మొదటగా ప్రయత్నించింది షేక్ హుసేన్. ‘సత్యాగ్ని’ కలం పేరుతో ఈ ఒరవడిని దిద్దింది ఒక రాయలసీమ రచయిత కావడం ఆ ప్రాంతానికి గర్వకారణం.
1980వ దశకంలో ఆయన మొదలుపెట్టిన ఈ పరంపర ఆ తర్వాత తెలుగులో కొనసాగింది. ముఖ్యంగా ‘బా’ రహమతుల్లా (ప్రకాశం జిల్లా) వంటి రచయితలు తెలుగు ముస్లిం కథను ఒక మెట్టు పైన చేర్చారు. సలీం (ప్రకాశం జిల్లా) తొలి ముస్లిం జీవన నవల- ‘వెండి మేఘం’ రాసి తెలుగు నవలను సంపద్వంతం చేశారు. వీరిని మినహాయించి కోస్తా ప్రాంతంలో చెప్పుకోదగ్గ పురోగతి లేకపోయినా రాయలసీమలో, తెలంగాణ ప్రాంతంలో ముస్లిం కథ విస్తృతంగా వికసించింది. రాయలసీమలో దాదాహయత్, శశిశ్రీ (బేపారి రహంతుల్లా), మహమూద్, ఎన్నెస్ ఖలందర్, అక్కంపేట ఇబ్రహీం, ఇనయతుల్లా తదితరులతో పాటు షేక్ హుసేన్ స్వయంగా చెప్పుకున్నట్టు ఆయన కథాధోరణికి నిజమైన వారసుడిగా వేంపల్లి షరీఫ్ ఆవిర్భవించారు.
ఇక తెలంగాణలో ఖాజా ముస్లిం కథల పతాకనెత్తారు. ఆ వరుసలో అఫ్సర్, దిలావర్, షాజహానా, హనీఫ్, ఇక్బాల్ చంద్, అన్వర్, పానమరక అలీ, యూసఫ్ బాబా, కవి యాకూబ్, యాకూబ్ పాషా తదితరులు తెలంగాణ ముస్లిం జీవనాన్ని విస్తారంగా కథా సాహిత్యంలో నమోదు చేశారు. ఇన్ని కథలు, పుస్తకాలు వచ్చినా మొదటి మెట్టు వేసింది షేక్ హుసేన్ అనేది చరిత్రలో నమోదైన సత్యం. హుసేన్ కథలు సూటిగా సరళంగా ఉంటాయి. సమస్యను తీసుకుని క్లుప్తంగా చర్చిస్తాయి. ఒకరికి లొంగని పరిష్కారాలు చూపిస్తాయి.
తొలి రోజులలో షేక్ హుసేన్ కథలు దాదాపు ఎఫ్.ఐ.ఆర్‌లను తలపించినా రాను రాను వాటి పరిధి, లోతు విస్తారమైంది. ముస్లింల కథలు రాయడం మొదలుపెట్టే సమయానికి ఆయన సంయమనం పాటించడం చూస్తాం. అంతర్గత సంస్కరణ కోసం ముస్లిం సమాజానికి ఆయన చెప్పిన హితవు వంటి కథలు ఈ సంపుటిలో అనేకం ఉన్నాయి. ‘యంత్రం’, ‘ముతా’, ‘పాచికలు’, ‘ఖులా’, ‘హలాలా’... ఇవన్నీ హుసేన్ కథల్లోనే కాదు తెలుగు కథల్లో కూడా ముఖ్యమైనవి. ముస్లిం సమాజం ఎలా వంచనకు గురి అవుతున్నదో పెత్తందార్ల చేతుల్లో ముస్లింలు ఎలా పావులవుతున్నారో హుసేన్ రాస్తారు.
అలాగే స్త్రీల తరఫున, స్త్రీల కొరకు వకాల్తా పుచ్చుకోవడమే కాదు ఇస్లాంలో స్త్రీల అణచివేత ఉందనే దురభిప్రాయాన్ని తొలగిస్తూ వారికి ఉన్న హక్కులను కూడా కథలుగా మలిచారు. మగాడి తరఫున ‘తలాక్’ మాత్రమే అందరికీ తెలుసు. కాని వివాహ బంధం నుంచి బయటపడటానికి స్త్రీకి ’ఖులా’ హక్కు ఇస్లాం ఇచ్చిందని ఎందరికి తెలుసు? ‘ముతా’ పేరుతో పేద ఆడపిల్లలను నెలకూ రెండు నెల్లకూ (దుబాయ్ షేకులు) పెళ్లి చేసుకునే ఆచారం ఉందని నమ్మించేవారిని అదసలు ఇస్లాంలో సమ్మతం కాదనే కథ వీటిలో ఉంది.
స్త్రీలు తమ కాళ్ల మీద తాము నిలబడాలనుకోవడం, ఆత్మవిశ్వాసంతో ముందుకు నడవాలనుకోవడం హుసేన్ కథల్లో బలమైన స్టాండ్. లోపలి రచయితలు ముస్లిం సమాజాన్ని దుమ్మెత్తి పోయడం కన్నా ముందు వారికి అవసరమైన సాహిత్యం అందించాలనే ధోరణి హుసేన్‌ది. ఇది అభిలషణీయమైన ధోరణి.
ఇందులో ఒకటి రెండు జ్ఞాపకాల వంటి కథలు ఉన్నాయి. అవి లేకపోయినా పర్వాలేదు. ఒక కథ- ‘ఖబరా ఖోదువ్’ (గోరి తవ్వేవాడు) మీద ప్రేమ్‌చంద్ ‘కఫన్’ ప్రభావం ఉంది. కేతు విశ్వనాథరెడ్డి, సింగమనేని నారాయణ ముందుమాటలు పుస్తకం విలువను పెంచాయి.
తెలుగులో మొదటి ముస్లిం కథలున్న ఈ సంపుటి ప్రతి ఒక్కరూ చదవతగ్గది.
- నెటిజన్ కిశోర్
సత్యాగ్ని కథలు- షేక్ హుసేన్ సత్యాగ్ని
వెల: రూ.120
ప్రతులకు: 9866040810