ఇటువంటి ఘటనలు సహజమే
సాఫ్ట్వేర్ ఇంజనీర్‌ను కొట్టిచంపడంపై శిరోలే వివాదాస్పద వ్యాఖ్యలు
పుణే: ఫేస్బుక్లో అభ్యంతరకరమైన విషయాలను పోస్ట్ చేసినప్పుడు ఇటువంటి పరిణామాలు జరగడం సహజమేనంటూ బీజేపీ నేత, పుణే ఎంపీ అనిల్ శిరోలే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. శివాజీ, బాల్ఠాక్రేలపై అభ్యంతరకరమైన అంశాలను పోస్ట్ చేశాడనే అనుమానంతో ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ షేఖ్ మొహిసిన్ సాదిఖ్‌ను హిందూ రాష్ట్ర సేనకు చెందిన కొందరు గురువారం తీవ్రంగా కొట్టిన విషయం తెలిసిందే.
ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సాదిఖ్ మృతిచెందడంతో ఈ విషయమై ఎంపీ అనిల్ శిరోలేను పార్లమెంటు ఆవరణలో పాత్రికేయులు ప్రశ్నించినపుడు ఆయన పైవిధంగా స్పందించారు. ఇదిలాఉండగా సాఫ్ట్వేర్ ఇంజనీర్‌పై బుధవారం దాడిచేసిన ఘటనకు సంబంధించి పోలీసులు మరో నలుగురిని అరెస్టు చేశారు. దీంతో ఈ కేసులో ఇప్పటిదాకా అరెస్టు చేసినవారి సంఖ్య 17కు చేరింది. అత్యంత దారుణమైన ఘటనకు పాల్పడిన వీరిపై బెయిల్ దొరకడానికి వీలులేని సెక్షన్ల ప్రకారం కేసులు నమోదు చేసే అవకాశముందని పోలీసులు చెబుతున్నారు.