అమ్మనాన్నకోసం 370 మైళ్ల పరుగు
బీజింగ్: త్వరలోనే తమ మాతృదేశానికి సంబంధించి జరగనున్న ఇయర్ వేడుకలు.. ఆ సమయంలో ఎలాగైనా తన తల్లిదండ్రులతో ఉండాలి. కానీ, చాలా దూరంగా ఉన్నాడు. టికెట్స్ బుక్ చేద్దామంటే ఎంతో రద్దీ. రైలు, బస్సులకు టికెట్ బుక్ చేసుకునే అవకాశం లేదు. ఒక వేళ అలా బుక్ చేసుకున్నా.. సురక్షితంగా వెళతామా లేదా అన్న టెన్షన్.. ఏం చేసైనా ఆరోజు తన తల్లిదండ్రులతో గడపాలి. అప్పుడు ఆలోచించాడు. ఆ వెంటనే బ్యాగ్ సర్దుకుని భుజాన వేసుకున్నాడు. షూ కట్టుకొని ఇక రోడ్డెక్కాడు.
తన కాళ్లకు పనిచెప్పి పరుగందుకున్నాడు. ఒకటి కాదు రెండు దాదాపు 370 మైళ్ల దూరంలో ఉన్న తన అమ్మనాన్నల చెంతకు పరుగు ద్వారా వెళుతున్నాడు. ఇది లండన్ నుంచి ఈడెన్ బర్గ్ కు మధ్య సాగే 14 మారథాన్లతో సమానం. ఏడు రోజులుగా సాగుతున్న అతడి ప్రయాణం మరో రెండు రోజుల్లో ముగియనుంది. గురువారం సాయంత్రానికి అతడు తన ఇంటికి చేరుకునే అవకాశం ఉంది.
ఇదంతా చైనా ఇయర్ వేడుకలకు హాజరవుతున్న హువాంగ్ చాంగ్ యాంగ్ (33) సృష్టిస్తున్న రికార్డు కథ. షెంజెన్ ప్రాంతం నుంచి చెంజోవ్ కు 370 మైళ్ల దూరం పరుగెత్తుతున్నాడు. తమ దేశ ఇయర్ వేడుకల్లో పాల్గొనేందుకు ఇప్పటికే చైనాలో వివిధ ప్రాంతాల్లోని ప్రజలు భారీ సంఖ్యలో తమ సొంత ప్రాంతాలకు క్యూకట్టారు. ఈ నేపథ్యంలో అన్ని ట్రాన్స్ పోర్ట్ మార్గాలు రద్దీగా మారాయి. దీంతో 2.9 బిలియన్ల మంది రద్దీని అధిగమించడంకోసం హువాంగ్ పరుగునే ప్రయాణ సాధనంగా ఎంచుకొని ముందుకు కదిలాడు.