డ్రీమ్ గర్ల్‌ని ఆకట్టుకున్న రకుల్
డ్రీమ్ గర్ల్ హేమ మాలినితో నటించే అవకాశం వస్తే ఎవరైనా ఊరికే ఉంటారా? అదే హేమమాలిని వీరాభిమాని అయితే ఎగిరి గంతేస్తారు కదూ. టాలీవుడ్ తెరపై దూసుకుపోతున్న రకుల్ ప్రీత్ సింగ్‌కి 'షిమ్లా మిర్చి' చిత్ర రూపంలో ఈ అవకాశం దొరికింది. ఇక అంతే.. తనకు వచ్చీరాని తమిళంలో తెగ కబుర్లు చెప్పి హేమమాలినిని రకుల్ ప్రీత్ సింగ్ ఆకట్టుకుంది. షిమ్లాలో షూటింగ్ జరుపుకొంటున్న ఈ సినిమాలో.. హేమ మాలిని కూతురుగా రకుల్ నటిస్తోంది.
హేమమాలిని నటించిన బ్లాక్ అండ్ వైట్ చిత్రాల్లో ఆమె అందాన్ని కళ్లార్పకుండా చూసేదాన్నని రకుల్ చెప్పింది. కచ్చితమైన టైమింగ్‌తో డైలాగ్‌ని స్పష్టంగా చెప్పడానికి హేమ ఎంతగానో సాధన చేసేవారంది. షూటింగ్ సమయంలో ఆమె జీవిత కథలను తనతో పంచుకోవడం మరువలేని అనుభూతి అని రకుల్ చెప్పుకొచ్చింది. చాలా కష్టమైన స్టెప్పులను కూడా హేమ మాలిని చాలా సునాయాసంగా చేసేవారని, తనతో కలిసి స్టెప్పులేయడం చాలా కష్టమైనప్పటికీ హేమ సహకారంతో సౌకర్యవంతంగా చేయగలిగానని రకుల్ సంతోషంతో గంతులేస్తోంది.