Shiv Sena president Uddhav Tirkey
-
కొత్త కోడలిలా వ్యవహరించాలి..
సర్కార్‌కు ‘సామ్నా’ సూచన సాక్షి, ముంబై: కొత్త కోడలు అత్తవారింట అణకువతో అందరినీ సంతోషపరిచేందుకు మనస్ఫూర్తిగా పనిచేసేటట్లుగానే బీజేపీ సర్కార్ కూడా రాష్ట్ర ప్రజల ఆశలను తీర్చాలని ‘సామ్నా’లో శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే సూచించారు. సామ్నా శనివారం సంపాదకీయంలో ప్రభుత్వం ఏర్పాటైన తొలిరోజునే బీజేపీ ప్రభుత్వానికి సున్నితంగా మందలింపుతోపాటు సలహాలు, సూచనలు అందిస్తూ తనదైన శైలిలో హెచ్చరికలు జారీచేశారు. ముఖ్యంగా కొత్త ప్రభుత్వాన్ని నవ వధువుతో, రాష్ట్ర ప్రజలను అత్తతో పోల్చారు. పెళ్లైన కొత్తలో అత్తతోపాటు కుటుంబాన్ని సంతోషంగా ఉంచేందుకు కొత్త కోడలు పనులన్నింటినీ మనస్ఫూర్తిగా చేస్తుందని, తర్వాత అత్తపై పెద్దరికం చెలాయించేందుకు ప్రయత్నిస్తుందని వ్యాఖ్యానించారు. అయితే మహారాష్ట్ర ప్రజలు కఠినమైనవారు కాకపోయినా మంచి అత్తలాంటివారని బీజేపీకి చురకలంటించారు. అదేవిధంగా అత్తను (మహారాష్ట్ర ప్రజలను) సంతోషపెట్టడం కోడలి కర్తవ్యమని బీజేపీకి సూచించారు. అలాచేయకుండా అత్తపై పెద్దరికం చెలాయించేందుకు ప్రయత్నిస్తే మాత్రం తాము చెవులు పిండుతామని పేర్కొన్నారు. హామీలను పూర్తిచేయాలి... మహారాష్ట్రను ముక్కలుచేయకుండా అఖండంగానే ఉంచాలని ఉద్ధవ్ ఠాక్రే బీజేపీని కోరారు. అదేవిధంగా కొత్త ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను పూర్తిచేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజలకు కొత్త ప్రభుత్వంపై ఎంతో నమ్మకంతోపాటు ఎన్నో ఆశలు ఉంటాయని, వాటిని నెరవేర్చాల్సిన బాధ్యత వారిదేనని ఆయన స్పష్టం చేశారు. డీఎఫ్ సర్కారు గత 15 ఏళ్లల్లో ప్రజల అవసరాలను ఏమాత్రం తీర్చలేకపోయిందని, ఇలాంటి సందర్భంలో కొత్త ప్రభుత్వం ‘ఫినిక్స్ పక్షి’ మాదిరిగా పైకి ఎగరాలని, ఇది కొత్త ముఖ్యమంత్రితో జరగాలని తాము కోరుకుంటున్నట్లు ఉద్ధవ్ పేర్కొన్నారు. -
సేన మాట నిలబెట్టుకునేనా?
సాక్షి, ముంబై: జైతాపూర్ అణు విద్యుత్ ప్రాజెక్టు విషయంలో ఇచ్చిన హామీ విషయంలో శివసేన అయోమయంలో పడిపోయింది. ఈ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ స్థానిక ప్రజలకు అండగా నిలిచిన శివసేనకు ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో తగినంత మెజారిటీ రాకపోవడంతో అధికారం చేజారిపోయింది. అధికారంలోకి వస్తే ఈ ప్రాజెక్టును రద్దు చేస్తామని శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్‌ఠాక్రే ఎన్నికల ప్రచార సభల్లో స్థానిక రైతులు, ప్రజలకు హామీఇచ్చారు. అయితే అధికారానికి దూరమైన నేపథ్యంలో అక్కడి ప్రజల మద్దతుతో గెలిచిన ప్రజా ప్రతినిధులు అయోమయంలో పడిపోయారు. అప్పటి కాంగ్రెస్, ఎన్సీపీ ప్రజాస్వామ్య కూటమి ప్రభుత్వం జైతాపూర్లోని మాడ్బన్ ప్రాంతంలో 1000 మెగావాట్ల సామర్థ్యం గల అణు విద్యుత్ ప్రాజెక్టును నిర్మించాలని సంకల్పించింది. అందుకు స్థల సేకరణతోపాటు అధ్యయనం కూడా చేయించింది. అయితే ఈ ప్రాజెక్టువల్ల తమ చాలా నష్టపోతామంటూ అక్కడి రైతులు, ప్రజలు వ్యతిరేకిస్తూ అనేక ఆందోళనలు నిర్వహించారు. కొన్నిసార్లు ఈ ఆందోళన హింసాత్మకంగా కూడా మారింది. వీరికి శివసేన అండగా నిలవడంతో రాజకీయంగా ఈ ఆందోళన మరింత రాజుకుంది. ఈ ప్రాజెక్టును రద్దు చేయాలంటూ శివసేన నాయకులు, ప్రజా ప్రతినిధులు డిమాండ్ చేశారు. అప్పట్లో జరిగిన గ్రామపంచాయతీ, జిల్లా పరిషత్ తదితర స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇక్కడి ప్రజలు శివసేనకు భారీగా ఓట్లు వేశారు. దీంతో ఇక్కడ శివసేన రాజకీయంగా మరింత బలపడింది. ఆ తరువాత ఈ ఏడాది ఏప్రిల్‌లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ప్రాజెక్టు బాధితులు తమ ఓట్లను శివసేనకు వేసి పెద్ద సంఖ్యలో ప్రతినిధులను గెలిపించారు. కేంద్రంలో నరేంద్ర మోడీ నేతృత్వంలో ఏర్పాటుచేసిన ప్రభుత్వంలో శివసేన కూడా ఉంది. అదేవిధంగా ఇటీవల జరిగిన శాసన సభ ఎన్నికల్లో ఇక్కడికి ప్రచారానికి వచ్చిన ఉద్ధవ్ ఠాక్రే తాము అధికారంలోకి రాగానే వివాదాస్పద జైతాపూర్ ప్రాజెక్టును రద్దుచేస్తామని ప్రకటించారు. దీంతో శివసేన అధికారంలోకి వస్తే ఈ ప్రాజెక్టు రద్దవుతుందని అంతా భావించారు.అయితే ఈ ఎన్నికల్లో శివసేనకు అధికారం చేపట్టేందుకు తగినంత మెజారిటీ రాకపోవడంతో ఆ పార్టీ నాయకులు అయోమయంలో పడిపోయారు. -
కాషాయ కూటమికి ఢోకా లేదు
సామ్నాలో ఉద్ధవ్ ఠాక్రే సాక్షి , ముంబై: హిందూత్వ నేపథ్యంలో శివసేన-బీజేపీ కూటమికి చీలిక భయంలేదని, అది కొనసాగుతుందని శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే ప్రకటించారు. పార్టీ అధికార పత్రిక ‘సామ్నా’లో సోమవారం ప్రచురితమైన సంపాదకీయంలో తనదైన శైలిలో ప్రత్యర్థులపై మండిపడుతూనే మరోవైపు బీజేపీతో పొత్తుపై ఎలాంటి ఇబ్బందులు లేవని స్పష్టంచేశారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత శివసేన, బీజేపీల మధ్య ఆధిపత్యంపై మాటల పోరు కొనసాగుతోంది. దీంతో ఈ రెండు పార్టీల మధ్య పొత్తు వికటి స్తుందనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఇలాంటి నేపథ్యంలో శివసేన సామ్నా పత్రిక సంపాదకీయం ద్వారా శివసేన బీజేపీతో పొత్తు కొనసాగుతుందని స్పష్టం చేయడంతో అనేక మందిలో నెలకొన్న అయోమయానికి తెరపడింది. బీహార్‌లో హిందూవాదం సిద్ధాంతాల ముడి లేకపోవడంతో అక్కడ పొత్తు వికటించింది కాని మహారాష్ట్రలో ఇద్దరి మధ్య హిందూత్వవాదంపై ఉన్న ముడి చాలా గట్టిదని ఇది విడిపోయే ప్రసక్తేలేదని ఉద్ధవ్ పేర్కొన్నారు. శివసేనతోపాటు బీజేపీకి కూడా ఈ విషయం తెలుసన్నారు. అయితే హిందూవాదులకు వెన్నుపోటు పొడిచే ప్రయత్నం చేసేవారికి ప్రజలు బుద్ధి చెబుతారని ఉద్ధవ్ ఠాక్రే ఈ సందర్భంగా బీజేపీని హెచ్చరించారు.