సేన మాట నిలబెట్టుకునేనా?
సాక్షి, ముంబై: జైతాపూర్ అణు విద్యుత్ ప్రాజెక్టు విషయంలో ఇచ్చిన హామీ విషయంలో శివసేన అయోమయంలో పడిపోయింది. ఈ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ స్థానిక ప్రజలకు అండగా నిలిచిన శివసేనకు ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో తగినంత మెజారిటీ రాకపోవడంతో అధికారం చేజారిపోయింది. అధికారంలోకి వస్తే ఈ ప్రాజెక్టును రద్దు చేస్తామని శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్‌ఠాక్రే ఎన్నికల ప్రచార సభల్లో స్థానిక రైతులు, ప్రజలకు హామీఇచ్చారు. అయితే అధికారానికి దూరమైన నేపథ్యంలో అక్కడి ప్రజల మద్దతుతో గెలిచిన ప్రజా ప్రతినిధులు అయోమయంలో పడిపోయారు.
అప్పటి కాంగ్రెస్, ఎన్సీపీ ప్రజాస్వామ్య కూటమి ప్రభుత్వం జైతాపూర్‌లోని మాడ్బన్ ప్రాంతంలో 1000 మెగావాట్ల సామర్థ్యం గల అణు విద్యుత్ ప్రాజెక్టును నిర్మించాలని సంకల్పించింది. అందుకు స్థల సేకరణతోపాటు అధ్యయనం కూడా చేయించింది. అయితే ఈ ప్రాజెక్టువల్ల తమ చాలా నష్టపోతామంటూ అక్కడి రైతులు, ప్రజలు వ్యతిరేకిస్తూ అనేక ఆందోళనలు నిర్వహించారు. కొన్నిసార్లు ఈ ఆందోళన హింసాత్మకంగా కూడా మారింది.
వీరికి శివసేన అండగా నిలవడంతో రాజకీయంగా ఈ ఆందోళన మరింత రాజుకుంది. ఈ ప్రాజెక్టును రద్దు చేయాలంటూ శివసేన నాయకులు, ప్రజా ప్రతినిధులు డిమాండ్ చేశారు. అప్పట్లో జరిగిన గ్రామపంచాయతీ, జిల్లా పరిషత్ తదితర స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇక్కడి ప్రజలు శివసేనకు భారీగా ఓట్లు వేశారు. దీంతో ఇక్కడ శివసేన రాజకీయంగా మరింత బలపడింది. ఆ తరువాత ఈ ఏడాది ఏప్రిల్‌లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ప్రాజెక్టు బాధితులు తమ ఓట్లను శివసేనకు వేసి పెద్ద సంఖ్యలో ప్రతినిధులను గెలిపించారు.
కేంద్రంలో నరేంద్ర మోడీ నేతృత్వంలో ఏర్పాటుచేసిన ప్రభుత్వంలో శివసేన కూడా ఉంది. అదేవిధంగా ఇటీవల జరిగిన శాసన సభ ఎన్నికల్లో ఇక్కడికి ప్రచారానికి వచ్చిన ఉద్ధవ్ ఠాక్రే తాము అధికారంలోకి రాగానే వివాదాస్పద జైతాపూర్ ప్రాజెక్టును రద్దుచేస్తామని ప్రకటించారు. దీంతో శివసేన అధికారంలోకి వస్తే ఈ ప్రాజెక్టు రద్దవుతుందని అంతా భావించారు.అయితే ఈ ఎన్నికల్లో శివసేనకు అధికారం చేపట్టేందుకు తగినంత మెజారిటీ రాకపోవడంతో ఆ పార్టీ నాయకులు అయోమయంలో పడిపోయారు.