Jaitapur nuclear power project
-
‘జైతాపూర్’ అణు ప్రాజెక్టును తీవ్రంగా పరిగణించాలి
- శివసేన ఎంపీ అరవింద్ సావంత్ - సేన ఎంపీలతో పీఎం మోదీ భేటీపై ఉద్ధవ్ ఆగ్రహం సాక్షి, ముంబై: వివాదాస్పద జైతాపూర్ అణు విద్యుత్ ప్రాజెక్టును తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉందని శివసేన ఎంపీ అరవింద్ సావంత్ అన్నారు. మాతోశ్రీ బంగ్లాలో జరిగిన సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీ శివసేన ఎంపీలతో భేటీ అయి ఈ ప్రాజెక్టును వ్యతిరేకించ వద్దని సూచించడంతో శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ఎంపీలపై కూడా ఆయన గుర్రుగా ఉన్నారు. ఈ ప్రాజెక్టును ముందు నుంచే శివసేన వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. బీజేపీకి మిత్రపక్షంగా ఉంటూనే వ్యతిరేక ధొరణితో ఇరుపార్టీల మధ్య శివసేన చిచ్చు రేపుతోంది. కాగా, గతంలో ఇండియా-పాకిస్తాన్ల మధ్య జరిగే క్రికెట్ మ్యాచ్‌లను శివసేన వ్యతిరేకించింది. దీనికి కొన్ని రాజకీయ పార్టీలు తోడుకావడంతో చివరకు ఇరు దేశాల మధ్య క్రికెట్ మ్యాచ్‌లు పూర్తిగా నిషేధించారు. కాని ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇరు దేశాల మధ్య మళ్లీ క్రికెట్ మ్యాచ్‌లు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. దీనిపై కూడా మాతోశ్రీ లో చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. వచ్చే సంవత్సరం శివసేన స్వర్ణోత్సవాలు జరుపుకోనుంది. దీంతో భవిష్యత్తులో సొంత బలంపై ఎన్నికల్లో పోటీచేసే అవకాశముందా...? అనే కోణంలో చర్చలు జరిపారు. ఉద్ధవ్ ఠాక్రే నిర్వహించిన ఈ సమావేశంలో రాందాస్ అఠవలే, సుభాష్ దేశాయి, సంజయ్ రావుత్ తదితర కీలక నాయకులు పాల్గొన్నారు. -
న్యూక్లియర్ ప్రాజెక్టుపై మా వైఖరి సుస్పష్టం
సాక్షి, ముంబై: వివాదాస్పద జైతాపూర్ న్యూక్లియర్ విద్యుత్ ప్రాజెక్టు విషయంపై తమ వైఖరిలో ఎలాంటి మార్పు ఉండదని శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే స్పష్టం చేశారు. ఎన్నికల అనంతరం ఆయన శనివారం కొంకణ్ పర్యటనకు బయలుదేరారు. గణపతి పులే దేవాలయంలో పూజలు నిర్వహించిన ఆయన తన పర్యటనను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొంకణ్ ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్రప్రభుత్వంతోపాటు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడతామని చెప్పారు. ముఖ్యంగా జైతాపూర్ విద్యుత్ ప్రాజెక్టు విషయంపై ప్రజలకు మద్దతుగా నిలుస్తామని మరోసారి ఉద్ధవ్ ఠాక్రే హామీ ఇచ్చారు. తాము అధికారంలోకి వస్తే ఈ ప్రాజెక్టును రద్దుచేస్తామని శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే ఎన్నికల ప్రచార సభల్లో స్థానిక రైతులకు, ప్రజలకు హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం తాము ప్రతిపక్షంలో ఉన్నా ప్రాజెక్టు విషయంలో తమ వైఖరిలో ఎలాంటి మార్పు ఉండదని ఆయన స్పష్టం చేశారు. గత కాంగ్రెస్, ఎన్సీపీ ప్రజాస్వామ్య కూటమి ప్రభుత్వం జైతాపూర్లోని మాడ్బన్ ప్రాంతంలో 1000 మెగావాట్ల సామర్థ్యం గల న్యూక్లియర్ ప్రాజెక్టు నిర్మించాలని సంకల్పించింది. అందుకు స్థలసేకరణ, ఇతర అధ్యయనం పనులు పూర్తిచేసింది. కాని ఈ ప్రాజెక్టు వల్ల తాము చాలా నష్టపోతామని అప్పట్లో అక్కడి రైతులు, ప్రజలు వ్యతిరేకిస్తూ అనేక ఆందోళనలు నిర్వహించారు. కొన్నిసార్లు ఈ ఆందోళన హింసాత్మకంగా కూడా మారింది. వీరికి శివసేన అండగా నిలవడంతో రాజకీయంగా ఈ ఆందోళన మరింత రాజుకుంది. ప్రాజెక్టు నిర్మాణ ప్రతిపాదనను రద్దు చేయాలని శివసేన నాయకులు, ప్రజాప్రతినిధులు డిమాండ్ చేశారు. దీంతో గ్రామపంచాయతీ, జిల్లా పరిషత్ తదితర స్థానిక సంస్థల ఎన్నికల్లోనేకాక లోకసభ, శాసన సభ ఎన్నికల్లో కూడా శివసేనకు ఇక్కడ మంచి ఆదరణ లభించింది. ఈ నేపథ్యంలో కొంకణ్ ప్రజలకు ఇచ్చిన మాటపై శివసేన కట్టుబడి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. -
సేన మాట నిలబెట్టుకునేనా?
సాక్షి, ముంబై: జైతాపూర్ అణు విద్యుత్ ప్రాజెక్టు విషయంలో ఇచ్చిన హామీ విషయంలో శివసేన అయోమయంలో పడిపోయింది. ఈ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ స్థానిక ప్రజలకు అండగా నిలిచిన శివసేనకు ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో తగినంత మెజారిటీ రాకపోవడంతో అధికారం చేజారిపోయింది. అధికారంలోకి వస్తే ఈ ప్రాజెక్టును రద్దు చేస్తామని శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్‌ఠాక్రే ఎన్నికల ప్రచార సభల్లో స్థానిక రైతులు, ప్రజలకు హామీఇచ్చారు. అయితే అధికారానికి దూరమైన నేపథ్యంలో అక్కడి ప్రజల మద్దతుతో గెలిచిన ప్రజా ప్రతినిధులు అయోమయంలో పడిపోయారు. అప్పటి కాంగ్రెస్, ఎన్సీపీ ప్రజాస్వామ్య కూటమి ప్రభుత్వం జైతాపూర్లోని మాడ్బన్ ప్రాంతంలో 1000 మెగావాట్ల సామర్థ్యం గల అణు విద్యుత్ ప్రాజెక్టును నిర్మించాలని సంకల్పించింది. అందుకు స్థల సేకరణతోపాటు అధ్యయనం కూడా చేయించింది. అయితే ఈ ప్రాజెక్టువల్ల తమ చాలా నష్టపోతామంటూ అక్కడి రైతులు, ప్రజలు వ్యతిరేకిస్తూ అనేక ఆందోళనలు నిర్వహించారు. కొన్నిసార్లు ఈ ఆందోళన హింసాత్మకంగా కూడా మారింది. వీరికి శివసేన అండగా నిలవడంతో రాజకీయంగా ఈ ఆందోళన మరింత రాజుకుంది. ఈ ప్రాజెక్టును రద్దు చేయాలంటూ శివసేన నాయకులు, ప్రజా ప్రతినిధులు డిమాండ్ చేశారు. అప్పట్లో జరిగిన గ్రామపంచాయతీ, జిల్లా పరిషత్ తదితర స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇక్కడి ప్రజలు శివసేనకు భారీగా ఓట్లు వేశారు. దీంతో ఇక్కడ శివసేన రాజకీయంగా మరింత బలపడింది. ఆ తరువాత ఈ ఏడాది ఏప్రిల్‌లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ప్రాజెక్టు బాధితులు తమ ఓట్లను శివసేనకు వేసి పెద్ద సంఖ్యలో ప్రతినిధులను గెలిపించారు. కేంద్రంలో నరేంద్ర మోడీ నేతృత్వంలో ఏర్పాటుచేసిన ప్రభుత్వంలో శివసేన కూడా ఉంది. అదేవిధంగా ఇటీవల జరిగిన శాసన సభ ఎన్నికల్లో ఇక్కడికి ప్రచారానికి వచ్చిన ఉద్ధవ్ ఠాక్రే తాము అధికారంలోకి రాగానే వివాదాస్పద జైతాపూర్ ప్రాజెక్టును రద్దుచేస్తామని ప్రకటించారు. దీంతో శివసేన అధికారంలోకి వస్తే ఈ ప్రాజెక్టు రద్దవుతుందని అంతా భావించారు.అయితే ఈ ఎన్నికల్లో శివసేనకు అధికారం చేపట్టేందుకు తగినంత మెజారిటీ రాకపోవడంతో ఆ పార్టీ నాయకులు అయోమయంలో పడిపోయారు.