- శివసేన ఎంపీ అరవింద్ సావంత్
- సేన ఎంపీలతో పీఎం మోదీ భేటీపై ఉద్ధవ్ ఆగ్రహం
సాక్షి, ముంబై: వివాదాస్పద జైతాపూర్ అణు విద్యుత్ ప్రాజెక్టును తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉందని శివసేన ఎంపీ అరవింద్ సావంత్ అన్నారు. మాతోశ్రీ బంగ్లాలో జరిగిన సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీ శివసేన ఎంపీలతో భేటీ అయి ఈ ప్రాజెక్టును వ్యతిరేకించ వద్దని సూచించడంతో శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ఎంపీలపై కూడా ఆయన గుర్రుగా ఉన్నారు.
ఈ ప్రాజెక్టును ముందు నుంచే శివసేన వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. బీజేపీకి మిత్రపక్షంగా ఉంటూనే వ్యతిరేక ధొరణితో ఇరుపార్టీల మధ్య శివసేన చిచ్చు రేపుతోంది. కాగా, గతంలో ఇండియా-పాకిస్తాన్‌ల మధ్య జరిగే క్రికెట్ మ్యాచ్‌లను శివసేన వ్యతిరేకించింది. దీనికి కొన్ని రాజకీయ పార్టీలు తోడుకావడంతో చివరకు ఇరు దేశాల మధ్య క్రికెట్ మ్యాచ్‌లు పూర్తిగా నిషేధించారు. కాని ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇరు దేశాల మధ్య మళ్లీ క్రికెట్ మ్యాచ్‌లు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి.
దీనిపై కూడా మాతోశ్రీ లో చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. వచ్చే సంవత్సరం శివసేన స్వర్ణోత్సవాలు జరుపుకోనుంది. దీంతో భవిష్యత్తులో సొంత బలంపై ఎన్నికల్లో పోటీచేసే అవకాశముందా...? అనే కోణంలో చర్చలు జరిపారు. ఉద్ధవ్ ఠాక్రే నిర్వహించిన ఈ సమావేశంలో రాందాస్ అఠవలే, సుభాష్ దేశాయి, సంజయ్ రావుత్ తదితర కీలక నాయకులు పాల్గొన్నారు.
‘జైతాపూర్’ అణు ప్రాజెక్టును తీవ్రంగా పరిగణించాలి
Published Thu, May 14 2015 11:36 PM | Last Updated on Fri, Aug 24 2018 2:17 PM
Advertisement