శివ కేశవులిరువురికి ప్రీతికరమైన మాసం శ్రావణం! ఎందుకంటే..
శ్రావణమాసం అంతా ఉదయం, సాయంత్రం భగవన్నామ స్మరణతో హిందూ గృహాలు మారు మోగుతాయి. ఈ నెలలో పౌర్ణమినాడు చంద్రుడు ‘శ్రవణా’ నక్షత్రంలో సంచరించడం వలన ఈ మాసానికి ఆ పేరు వచ్చింది. సనాతన ధర్మంలో చంద్రమానం ప్రకారం మనకున్న పన్నెండు మాసాల్లో ఐదవది పవిత్రత కలిగినదీ శ్రావణ మాసం. శ్రావణంలో చేపట్టే ఎలాంటి కార్యానికైనా పవిత్రత ఉందంటున్నారు విజ్ఞులు. అంతటి పవిత్ర మాసం అధిక శ్రావణం అనంతరం, నిజ శ్రావణం నేటి (17వ తేదీ గురువారం) నుంచి మొదలయ్యింది.
ఈ మాసం శివ కేశవులకు ప్రీతికరం. ఈ మాసంతో అసలు వర్ష రుతువు ప్రారంభమవుతుంది. ముఖ్యంగా భగవదా రాధనలో శివ, కేశవ భేదం లేకుండా పూజించడానికి విశేషమైనది ఈ మాసం. ఈ నెలలో చేసే ఏ చిన్న దైవ కార్యమైనా కొన్ని వేల రెట్లు శుభ ఫలితాన్నిస్తుందని ప్రతీతి. సోమవారాల్లో శివుని ప్రీత్యర్థం ఉపవాస దీక్ష చేస్తే, అనేక శుభ ఫలితాలు కలుగుతాయంటారు. వీటికి తోడు శ్రావణ శుక్ల పక్షంలో గల పదిహేను రోజులు ఎంతో విశేషమైన రోజులనీ, ఒక్కో రోజు ఒక్కో దేవుడికి పూజలు చేయాలనీ వేదాలు చెబుతున్నాయి.
త్రిమూర్తుల్లో స్థితికారుడు, దుష్ట శిక్షకుడు, శిష్ట రక్షకుడు అయిన మహావిష్ణువుకు, ఆయన దేవేరి మహాలక్ష్మికి కూడా అత్యంత ప్రీతి కరమైనది శ్రావణమాసం అంటారు. మహావిష్ణువు జన్మ నక్షత్రం శ్రావణ నక్షత్రం. శ్రావణ మాసంలో అన్ని మంగళవారల్లో చేసే వ్రతం ‘మంగళగౌరీ’ వ్రతం. దీన్ని శ్రావణ మంగళవార వ్రతం అనీ, మంగళ గౌరీ నోము అని పిలుస్తుంటారు. ఇదే మాసంలో పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం ‘వరలక్ష్మి’ వ్రతం చేయాలి. ఒకవేళ అప్పుడు వీలు కాకుంటే శ్రావణ మాసంలో మరొక శుక్రవారమైనా ఈ వ్రతం ఆచరి స్తారు. ముత్తయిదువులకు వాయినాలిచ్చి ఆశ్వీరాదాలు తీసుకుంటారు.
శుక్లపక్ష ద్వాదశి, దామోదర ద్వాదశి అని ఈ మాసంలో రెండు శుభ దినాలున్నాయి. శుక్ల పక్ష ఏకాదశి నాడు ఉపవాసం ఉండి మహా విష్ణునువును పూజించినట్లయితే మోక్షం లభిస్తుందంటారు. శ్రావణ పౌర్ణమి, రాఖీ పౌర్ణమిగా జరుపుకొనే శుక్ల పక్ష పౌర్ణమి రోజు సోదర, సోదరీ సంబంధానికి సూచికగా రక్షా బంధనం జరుపుకొంటున్నాం. అంతే కాక కొందరు ఈ రోజున నూతన యజ్ఞోపవీతం ధరించి, వేదభ్యాసాన్ని ప్రారంభిస్తారు. కృష్ణపాడ్యమి, హయగ్రీవ జయంతి, కృష్ణపక్ష విదియ, రాఘవేంద్ర స్వామి ఆరాధన వంటివి సైతం ఈ నెలలోనే రావడం విశేషం. కృష్ణాష్టమి, పోలాల అమావాస్య వంటివి కూడా ఈ నెలలోనే వస్తాయి.
– నందిరాజు రాధాకృష్ణ
(చదవండి: శ్రావణం.. పర్యావరణహితం)