శభాష్..శివ కేశవన్
నాగానో(జపాన్): 18వ ఆసియన్ ల్యూజ్ చాంపియన్ షిప్ లో భారత ల్యూజర్ శివ కేశవన్ అంచనాలకు తగ్గట్టు రాణించి రజత పతకం సాధించాడు. ఆదివారం ఇక్కడ జరిగిన ల్యూజ్ రేస్ లో శివ కేశవన్ రెండో స్థానం సాధించి రజత పతాకాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. మంచుపై నిర్వహించే ఈ పోటీలో శివ కేశవన్ ఆద్యంతం ఆకట్టుకున్నాడు. తొలి హీట్ లో రెండో స్థానం సాధించి రజతాన్నిఖాయం చేసుకున్న శివ.. రెండో హీట్ లో కొన్ని సాంకేతికపరమైన తప్పిదాలతో స్వర్ణాన్ని దక్కించుకునే అవకాశాన్నికోల్పోయాడు. ఈ ల్యూజ్ రేస్ లో తొలి స్థానంలో నిలిచిన హిదాన్రి కనాయామా(జపాన్) కు పసిడి దక్కగా, మూడో స్థానం సాధించిన కిమ్ డొంగ్ హైయిన్(దక్షిణకొరియా) కు కాంస్య పతకం లభించింది.
ఈ విజయంపై శివ కేశవ్ ఆనందం వ్యక్తం చేశాడు. తన ఖాతాలో మరో పతకం వచ్చి చేరినందుకు చాలా సంతోషంగా ఉందన్నాడు. ఈ ఏడాది తీవ్రమైన కష్టకాలాన్ని ఎదుర్కొన్న తనకు పతకం లభించడం నిజంగా ఊరటనిచ్చిందన్నాడు. మరోసారి భారత జెండాను అంతర్జాతీయ వింటర్ క్రీడల్లో ఎగరవేసే భాగ్యం దక్కినందుకు చాలా గర్వంగా ఉందని శివ పేర్కొన్నాడు. తదుపరి ఒలింపిక్స్ కు అర్హత సాధిస్తానని ఆశిస్తున్నట్లుపేర్కొన్నాడు. ఒకవేళ వచ్చే ఒలింపిక్స్ లో శివ పాల్గొంటే మాత్రం అది అతని కెరీర్ లో ఆరో ఒలింపిక్స్ అవుతుంది.