రాత్రికి ..రాత్రే తొలగింపు!
⇒ రాత్రికి రాత్రే..తరలిన ‘శివాజీ’ విగ్రహం
⇒ మెరీనాలో కనిపించని నిలువెత్తు ‘గాంభీర్యం’
⇒ అభిమానుల్లో నిరాశ రాజకీయ పక్షాల వ్యతిరేకత
⇒ అడయార్‌లోని స్మారక మండపంలో ఏర్పాట్లు
చెన్నై మెరీనా తీరంలో ఉన్న నడిగర్ తిలగం శివాజీ గణేషన్ విగ్రహాన్ని అధికార వర్గాలు చడీ చప్పుడు కాకుండా, రాత్రికి రాత్రే తొలగించాయి. ఆమార్గంలో గాంభీర్యంగా నిలువెత్తులో ఇన్నాళ్లు అందర్నీ ఆకర్షించిన విగ్రహం గురువారం ఉదయాన్నే అదృశ్యం కావడం సర్వత్రా విస్మయంలో పడ్డారు. నడిగర తిలగం అభిమానుల్లో తీవ్ర ఆవేదన బయలుదేరింది. తొలగించిన విగ్రహాన్ని అడయార్‌లోని శివాజీ స్మారక మండపానికి తరలించారు. ఈ చర్య అభిమానులకు తీవ్ర మనస్తాపం కలిగించింది.
సాక్షి, చెన్నై : మెరీనా తీరంలో ఉన్న శివాజీ గణేషన్ తొలింపుతో ఆయన అభిమానుల్లో ఆవేదన నెలకొంది. తెలుగు సినీ రంగంలో నందమూరి తారకరామారావు, అక్కినేని నాగేశ్వరరావు, తమిళ సినీలోకానికి ఎంజీయార్, నడిగర్ తిలగం శివాజీ గణేషన్ రెండు కళ్లు లాంటి వారనేది జగమెరిగిన సత్యం. వీరంతా ఇప్పుడు మన మధ్యలో లేరు. అయితే, వారి మదుర జ్ఞాపకాలు వెండి తెర వెలుగుల రూపంలో నేటికీ దర్శనం ఇస్తున్నాయి.
వీరిని గౌరవించుకునే విధంగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకెళ్తున్నాయి. ఆ దిశగా తమిళనాడు రాజధాని నగరం చెన్నైలో అత్యంత జన సంచారంతో నిండిన ప్రదేశంలో ఉన్న మెరీనా తీరంలో నడిగర్ తిలగంకు 2006లో డీఎంకే ప్రభుత్వం నిలువెత్తు విగ్రహాన్ని ఏర్పాటు చేసింది. ఆ తీరంలోని కామరాజర్ రోడ్డు, రాధాకృష్ణన్ రోడ్డు కూడలిలో నడిగర్ తిలగం నట ఖ్యాతిని, అభిమానాన్ని, గౌరవాన్ని చాటే విధంగా గాంభీర్యంగా ఈ విగ్రహం దర్శనం ఇస్తుంటుంది.
వ్యతిరేకతతో ఆగ్రహం
ఎంతో ప్రతిష్టాత్మకంగా డీఎంకే హయంలో ఏర్పాటు చేసిన ఈ విగ్రహంపై 2011లో వ్యతిరేకత బయలుదేరింది. అన్నాడీఎంకే సర్కారు అధికార పగ్గాలు చేపట్టిన కొన్ని నెలల్లో విగ్రహం రచ్చకెక్కింది. ఈ నిలువెత్తు విగ్రహం కారణంగా ఆ మార్గంలో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయన్న గాంధేయ వాది శ్రీనివాసన్ పిటిషన్ వివాదానికి దారితీసింది. ఈ పిటిషన్‌కు వ్యతిరేకత బయలుదేరింది. విగ్రహాన్ని తొలగించొద్దంటూ సినీ ప్రముఖులు కమిషనరేట్‌ను ఆశ్రయించారు.
అభిమానులు ఆందోళనలకు దిగారు. అదే సమయంలో పోలీసుల్ని వివరణ కోరగా, ఆ విగ్రహానికి వ్యతిరేకంగానే రిట్ పిటిషన్ దాఖలు చేయడం వివాదానికి మరింత ఆజ్యం పోసినట్టు అయింది. ఈ వివాదంతో ఈ పిటిషన్‌ను తాము విచారించబోమంటూ తొలుత విచారించిన బెంచ్ చేతులు ఎత్తేసింది. అలాగే, విగ్రహం తొలగింపునకు జరుగుతున్న కుట్రలపై రాజకీయ పక్షాలు కదిలాయి. తమ గళాన్ని గట్టిగా విన్పించాయి. ఆ విగ్రహాన్ని తొలగించొద్దంటూ డిమాండ్ చేశాయి. అయితే, ఫలితం శూన్యం.
రాత్రికి రాత్రే..
మెరీనా తీరంలో నిలువెత్తులో గాంభీర్యంగా 4040 రోజుల పాటుగా దర్శనం ఇస్తూ వచ్చిన నడిగర్ తిలగం శివాజీ విగ్రహం గురువారం ఉదయాన్నే అదృశ్యం కావడం అందర్మీ విస్మయంలో పడేసింది. అభిమానుల్ని తీవ్ర ఆవేదనకు గురి చేసింది. బుధవారం అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో అధికార వర్గాలు ఆ విగ్రహాన్ని అక్కడి నుంచి తొలగించాయి. వెల్డింగ్ మిషన్లు, క్రేన్లు వంటి వాటి సాయంతో అతి కష్టం మీద ఆ విగ్రహాన్ని అక్కడి నుంచి తీశారు.
వీర పాండి కట్టబొమ్మన్ పాత్రలో ఇనుప సంకెళ్లను తెంచుతూ శివాజీ గణేషన్ జీవించారని చెప్పవచ్చు. ప్రస్తుతం ఆ తరహాలో ఆయన విగ్రహాన్ని ఇనుప సంకెళ్లతో కట్టి మరీ లారీల్లో ఎక్కించి విగ్రహం చెక్కు చెదరకుండా అడయార్‌కు తరలించారు. స్మారక మండపంలో విగ్రహాన్ని ఉంచారు. అన్ని పనులు ముగియగానే, త్వరలో ఈ మండపాన్ని ప్రారంభించనున్నారు. అప్పుడే ఈ విగ్రహ దర్శనం అభించనుంది.
తొలగించాల్సిందే
చివరకు శివాజీ విగ్రహం వ్యవహారానికి సంబంధించిన పిటిషన్ల విచారణలన్నీ అప్పటి న్యాయమూర్తి అగ్ని హోత్రి, కేకే శశిధర్ నేతృత్వంలోని బెంచ్ ముందుకు చేరాయి. విచారణను ముగించిన ఈ బెంచ్ 2014 జనవరిలో తీర్పును వెలువరించింది. ఆ విగ్రహాన్ని తొలగించాల్సిందేనని కోర్టు తీర్పు ఇవ్వడం అభిమానుల్లో ఆవేదనను మిగిల్చింది.
అయితే, దివంగత సీఎం జయలలిత విగ్రహం తొలగింపునకు కొంత సమయాన్ని కోర్టును కోరారు. ఇందుకు కారణం, అడయార్‌లో శివాజీ కోసం నిర్మిస్తున్న స్మారక మండపం పనుల కోసం. ఆ మండపంలో ఈ విగ్రహాన్ని ఏర్పాటుచేయనున్నట్టు ప్రకటించారు. ప్రస్తుతం ఆ మండపం పనులు ముగింపు దశకు చేరాయి.
మరో విగ్రహం ఏర్పాటు
తమ అభిమాన కథానాయకుడి విగ్రహం అదృశ్యంతో అభిమానుల్లో తీవ్ర ఆవేదన బయలుదేరింది. ఆ విగ్రహం ఉన్న దిమ్మె వద్ద గురువారం పాలాభిషేకం చేశారు. మెరీనా తీరంలో మరో విగ్రహం ఏర్పాటు చేసే వరకు విశ్రమించబోమని ప్రతిజ్ఞ చేశారు. శివాజీ కుమారులు, నటులు ప్రభు, రామ్‌కుమార్ మాట్లాడుతూ, చట్టపరంగా మెరీనా తీరంలో మరో విగ్రహం ఏర్పాటుకు అభిమానులతో కలిసి తమ కుటుంబం సైతం ముందుకు సాగుతుందన్నారు. కాగా, ఈ విగ్రహం తొలగింపును రాజకీయపక్షాలు తీవ్రంగా తప్పుబట్టాయి. రాత్రికి రాత్రే తొలగించడం భావ్యమా అని తమిళనాడు కాంగ్రెస్ అధ్యక్షుడు తిరునావుక్కరసర్, మాజీ అధ్యక్షుడు ఈవీకేఎస్ ఇళంగోవన్, నామ్ తమిళర్ కట్చి నేత సీమాన్, వీసీకే నేత తిరుమావళవన్ తీవ్రంగా ఖండించారు.