ఐపీఎస్ అధికారికి ఫేస్ బుక్ బెడద!
పాట్నా: శివదీప్ వామాన్నారో లాండే.. అతను బీహార్ లో ఒక పాపులర్ ఐపీఎస్ అధికారి. అతనికి ఏ విధమైన సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో సభ్యత్వం లేదు. కాగా, అతని పేరు మీద ఒక నకిలీ అకౌంట్ సృష్టించిన వ్యక్తి ఓ యువతి వద్ద నుంచి రూ.51వేలు కాజేసిన ఘటన తాజాగా వెలుగుచూసింది. శివదీప్ పేరు మీద ఓ ఫేస్ బుక్ అకౌంట్ సృష్టించడమే కాకుండా ఓ వ్యక్తి ఘరానా మోసానికి తెరలేపాడు. ఫేస్ బుక్ లో ఓ యువతితో పరిచయం పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే తాను ఒక స్వచ్ఛంధ సంస్థ కోసం నిధులు సమీకరిస్తున్నానని నమ్మబలికాడు. దీంతో ఆ మాయగాడి మాటలు నమ్మిన ఆ బాలిక అతనికి యాభై వేల రూపాయలను అతనిచ్చిన అకౌంట్ లో జమ చేసింది.
ఆ వ్యక్తి అటు తరువాత ఫేస్ బుక్ ఛాటింగ్ ఆపేయడంతో ఆ యువతికి అనుమానం వచ్చి పోలీసులను ఆశ్రయించింది. దీంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు బ్యాంకు అకౌంట్ నంబర్ తదితర వివరాలు సేకరించారు. అతను బీహార్ లోని దాద్ నగర్ జిల్లాకు చెందిన గోపాల్ కృష్ణగా గుర్తించారు. ప్రస్తుతం ఆ నకిలీ ఫేస్ బుక్ అకౌంట్లను నిషేధించిన పోలీసులు అతన్ని అరెస్టు చేసే పనిలో పడ్డారు.