బిల్లు చూసి గుడ్లు తేలేశాడు
చండీగడ్: హరియాణా విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం మరోసారి బైటపడింది. ఓ చిన్న షాపుకు కోట్ల రూపాయల్లో వచ్చిన కరెంటు బిల్లు చూసి ఆ యజమానికి గుండె ఆగినంత పని అయింది. ఫరినాబాద్ నగరంలో చిన్న టైర్ల రిపేరీ షాప్ నడుపుకొనే సురేందర్ కి సుమారు 77 .89 కోట్ల రూపాయల కరెంట్ బిల్లు వచ్చింది. ఇంత భారీ మొత్తంలో బిల్లు రావడంతో షాకైన సదరు యజమాని తల్లి తీవ్ర అస్వస్థతకు గురైంది.
మరోవైపు తనకు ఎప్పుడూ రెండు వేలకు మించి బిల్లు రాలేదని సురేందర్ వాపోయాడు. ఒక ఫ్యాన్, ఒక లైట్ తప్ప మరేయితర విద్యుత్ పరికరాలు లేవని, ఇంత బిల్లు ఎలా వచ్చిందో అర్థం కావడం లేదన్నాడు. అక్టోబర్ 31 న తనకు ఈ భారీ బిల్లు వచ్చిందని తెలిపాడు. ఆ రాష్ట్రంలో విద్యుత్ వినియెగదారులకు ఇలాంటి కరెంట్ షాకులు మామూలేనట. గతంలో ఓ పాన్ షాపు యజమానికి 132 కోట్ల రూపాయల బిల్లును పంపారు. అంతకుముందు దక్షిణ హరియాణా బిజిలీ వితరణ్ నిగమ్ శాఖ 234 కోట్ల బిల్లును పంపి మరో వినియోగదారుడిని అయోమయంలోకి నెట్టేసింది. అయితే ఇది టెక్నికల్ ప్రాబ్లమ్ అని, కంప్యూటర్ తప్పిదమంటూ రాష్ట్ర విద్యుత్ శాఖ ప్రకటించింది.