భలే మంచి నిధుల ‘మార్గమూ’
సంపాదనకు కార్పొరేటర్ల కొత్త ఎత్తులు అందరి దృష్టీ రోడ్ల నిర్మాణంపైనే.
ఉన్న రోడ్లు తొలగించి కొత్తగా నిర్మాణం
కొన్ని చోట్ల పైపై మెరుగులు
విస్తృతంగా శంకుస్థాపనలు
అధికారాంతమున కార్పొరేటర్ల నిధుల వేట
రోడ్లంటే ప్రయాణానికి ఉపయోగపడతాయనే విషయమే అందరికీ తెలుసు. కానీ అవి ‘ఆర్థికంగా’ ఆదుకుంటాయని కొందరికే తెలుసు. మరికొంచెం ముందుకెళితే...అవి ఎంత బాగా ‘ఉపయోగపడగలవో’ మన కార్పొరేటర్లకు తెలుసు. అందుకే అధికారాంతమున చక్కగా ఉన్న రోడ్లను తొలిచేసి.. వాటిపై కొత్తవి నిర్మించే పనికి పూనుకున్నారు. ఈ నిధులు సంపాదించే యజ్ఞానికి కాంట్రాక్టర్లు, ఇంజినీర్లు తమవంతుగా సాయం చేస్తున్నారు. అడుగు వేయడానికే వీలు లేని ఎన్నో రహదారులను వదిలేసిన మన అధికార గణం... అందంగా ఉన్న రహదారులను ధ్వంసం చేసి... కొత్తగా కనిపించేలా చేయడానికి చూపిస్తున్న ఉత్సాహంలోని అంతరార్ధం ఎవరికీ తెలియనిది కాదు. ఇవే కాదండోయ్... మరో రెండు రోజుల్లో కార్పొరేటర్ల పదవీ కాలం ముగుస్తున్న నేపథ్యంలో...పైపులైన్లు...డ్రైనేజీల వంటి వాటికీ విస్తృతంగా శంకుస్థాపనలు చేస్తూ... నాలుగు రాళ్లు వెనకేసుకోవడంతో పాటు... మళ్లీ పోటీ చేసే అవకాశం వస్తే ప్రజల దృష్టిలో పడాలనే ప్రయత్నం చేస్తున్నారు.
సిటీబ్యూరో: నగరంలోని రోడ్లు అటు కార్పొరేటర్లకు, ఇటు కాంట్రాక్టర్లు, ఇంజినీర్లకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. గ్రేటర్ బడ్జెట్లో వివిధ పనులకు కేటాయించే నిధులు ఖర్చయినా... కాకున్నా... రోడ్ల నిధులు మాత్రం ఇట్టే ఖర్చయిపోతుంటాయి. అందుకు కారణం వేసిన రోడ్లపైనే మళ్లీ మళ్లీ వేసే అవకాశం ఉండడమే. అదీ కష్టమనిపిస్తే పైపై మెరుగులు దిద్దితే సరి. ఈ అవకాశాన్ని వారంతా చక్కగా ‘వినియోగించుకుంటున్నారు’. నాణ్యతా ప్రమాణాల గురించి ఆలోచించాల్సిన అవసరం ఉండదు. మరుసటి రోజుకే పాడైపోయినా ‘మాయదారి వర్షం ముంచేసింది’ అని చేతులు దులుపుకోవచ్చు. దీంతో కార్పొరేటర్లు సైతం తమ బడ్జెట్లో వీటికే ఎక్కువ ప్రాధాన్యమిస్తారు. మరో మూడు రోజుల్లో ప్రస్తుత పాలక మండలి గడువు ముగిసిపోనున్న తరుణంలో అనేక ప్రాంతాల్లో చురుగ్గా రోడ్ల పనులు చేపట్టడం వారి శ్రద్ధను తెలియజేస్తోంది.
ఇలా నిధుల వరద...
ఏటా దాదాపు రూ. 200 కోట్లకు తగ్గకుండా రోడ్ల కోసం వెచ్చిస్తున్నారు. గత ఐదేళ్లుగా వెయ్యి కోట్లకు పైగా రోడ్లపాలు చేశారు. ప్రజల అవస్థలు మాత్రం తప్పడం లేదు.రంజాన్, బోనాలు, వినాయక నిమజ్జనం, బక్రీద్ వంటి పండుగల సందర్భంగా రోడ్ల మరమ్మతుల పేరిట చేసే ఖర్చు దీనికి అదనం.
ఆర్థిక సంవత్సరం చివరి మూడు నెలల్లో ఎక్కువ నిధులు ఖర్చు చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరం ఇప్పటికే రూ.194 కోట్లు ఖర్చు చేయడం గమనార్హం. మిగతా నాలుగు నెలల్లో మరో రూ. 200 కోట్ల వరకు ఖర్చు చేసే అవకాశాలున్నాయి.
ప్రస్తుత సంవత్సరం
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మేజర్ రోడ్ల అభివృద్ధికిరూ.54.87 కోట్లు, మైనర్ రోడ్లకు రూ.57.80 కోట్లు, రహదారుల వెడల్పునకు రూ.52.76 కోట్లు, జంక్షన్ల అభివృద్ధికి రూ. 5.85 కోట్లు ఖర్చు చేశారు. ఇంకా మేజర్ రోడ్లు, ఫుట్‌పాత్‌ల నిర్వహణ, మరమ్మతుల పద్దు కింద రూ.11.68 కోట్లు, మైనర్ రోడ్ల నిర్వహణ, మరమ్మతులకు రూ.9.93 కోట్లు ఖర్చు చేశారు. తవ్విన రోడ్లు పూడ్చేందుకు రూ.4.10 కోట్లు, మార్కింగ్‌కు దాదాపు కోటి ఖర్చు చేశారు.