వానొస్తే దుకాణాల మూతే..
షాపులను ముంచెత్తుతున్న వర్షపునీరు
నీళ్లువెళ్లే దారిలేక తంటాలు
లోతట్టు ప్రాంతాలు జలమయం
వర్షం కురిసినప్పుడల్లా వ్యాపారాలు బంద్
వేములవాడ : వేములవాడ రాజన్న ఆలయం ముందున ఉన్న దుకాణాలు వానొస్తే మూతపడుతున్నాయి. భారీ వర్షం కురిస్తే.. ముల్లె–మూటా సర్దుకుని షాపులకు తాళాలు వేస్తున్నారు. ఇందుకు కారణం.. వర్షపు నీరు ఎటూ వెళ్లే దారిలేదు. ఎక్కడపడితే అక్కడే నిలిచిపోతోంది. లోతట్టు ప్రాంతాల్లోని దుకాణాల్లోకి చేరుతోంది. ప్రధానంగా బద్దిపోచమ్మ, భీమన్నగుడి ప్రాంతాల నుంచి వచ్చే వర్షపు నీరంతా అంబేద్కర్ చౌరస్తా, రాజన్న గుడి, జాత్రాగ్రౌండ్ ప్రాంతాల్లోని దుకాణాల్లోకి వచ్చి చేరుతోంది. దీంతో దుకాణాలు మూసివేసి సరుకులు ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. సాలీనా రూ.70 కోట్ల పైచిలుకు ఆదాయం వస్తున్నా.. రాజన్న ఆలయ అధికారులు, రూ.కోట్లలో ఆదాయం సమకూర్చుకుంటున్న నగరపంచాయతీ అధికారులు లోతట్టు ప్రాంతాల్లోని వరద తాకిడి ప్రాంతాలను పట్టించుకున్న పాపాన పోవడం లేదు. సుమారు అరవై ఏళ్లుగా ఇదే దుస్థితి కొనసాగుతోంది. వర్షం కురిసినప్పుడల్లా ఆ నీటిలో రూ.లక్షల విలువైన సరుకులు తడిసి ఎందుకూ పనికిరాకుంటాపోతున్నాయి. ఆగస్టు 3వ తేదీన శ్రావణమాసం ప్రారంభమవుతుంది. నిత్యం వేలాది మంది భక్తులు వస్తుంటారు. వర్షాలు కురిస్తే భక్తులు సైతం ఈమార్గం గుండా నడవడం గగనమే. పాలుకులు ఇప్పటికైనా స్పందించి ఈ ప్రాంతంలో తగిన చర్యలు తీసుకోవాలని వ్యాపారులు కోరుతున్నారు.
వేములవాడ– కరీంనగర్ రోడ్డు అధ్వానంగా మారింది. వేములవాడ నుంచి కొదురుపాక వరకు వేలాది గుంతలు, గతుకులతో వాహనదారులకు తీవ్ర ఇక్కట్లు కలుగుతున్నాయి. తద్వారా ప్రమాదాలు జరుగుతున్నాయి. వచ్చేనెల 3వ తేదీ నుంచి శ్రావణమాసం వేడుకలు నిర్వహిస్తారు. దీంతో నిత్యం వేలాది మంది భక్తులు వేములవాడ రాజన్న దర్శనం కోసం ఈ మార్గం ద్వారానే వస్తుంటారు. కనీసం ప్యాచ్ వర్క్ అయినా చేయించాలని స్థానికులు కోరుతున్నారు.
సర్కారు సేవలకు దారేది..?
పట్టణంలోని పశువైద్యశాల, కోర్టు భవనం, నగరపంచాయతీ కార్యాలయం ముందు వర్షపు నీరు నిలిచి ఉంటోంది. కనీసం కార్యాలయంలోకి వెళ్లేందుకు దారి లేకుండాపోయింది. బురద, నీరు నిల్వకావడంతో కాలినడక సైతం గగనమవుతోంది.