ఉప్పుకొట్టుకు దారేది...!
టన్ను ఉప్పు ఉత్పత్తి చేస్తే వారికి దక్కేది రూ.60 మాత్రమే. కిలో ఉప్పు రూ.200 అమ్ముడవుతున్న విషయం చెప్పగానే వారు నిర్వేదంగా నవ్వి ఊరుకున్నారు. తమ జీవితాలు ఉప్పు కొటార్ల మధ్య అనేక అసౌకర్యాల నడుమ నిలువుటెండలో తెల్లారిపోతున్నాయంటూ గుడ్లనీరు కుక్కుకున్నారు.
మనకు భయమూ.. భక్తీ రెండూ ఎక్కువే... ఏ వదంతి వినిపించినా ఎంతో భయపడిపోతాం... వెంటనే తగిన జాగ్రత్తల కోసం నానా హైరానా పడిపోతాం.. ఉప్పు కొరత ముంచుకొచ్చిందన్నా.. వినాయకుడు పాలు తాగు తున్నాడన్నా.. ఒకే రకమైన పరుగు... ఉప్పుకోసం కిరాణా షాపుల ముందు క్యూకట్టడం, వినాయకుడి ఆలయాల ముందు పాలక్యాన్లు పట్టుకుని పడిగాపులు పడటంలో మనలను మించిన వారు లేనేలేరు. ఎందుకంటే వదం తులు నమ్మడం మన జన్మహక్కు.
నల్లవ్యాపారుల ధనదాహం...
ఉప్పు కొరత రానున్నదంటూ ఈ మధ్య పుకార్లు షికారు చేయడంతో తీవ్ర కలకలం రేగింది. బీహార్, బెంగాల్ వం టి పెద్ద రాష్ట్రాలతో పాటు ఈశాన్యాన ఉన్న చిన్నా చితక రాష్ట్రాలు కూడా అతలాకుతలమయ్యాయి. కిలో 16 రూపా యలున్న ఉప్పు వంద నుంచి రెండొందల రూపాయల దాకా అమ్ముడు పోయింది. జనం ఎంత ఎగబడితే ధర అంత పెరిగిపోయింది. సెల్ఫోన్ల పుణ్యమా అంటూ క్షణా ల్లో వార్తలు దావానలంలా వ్యాపించాయి. ఉప్పు ప్యాకెట్ల కోసం జనం షాపుల ముందు బారులు తీరారు. చాలా చోట్ల నోస్టాక్ బోర్డులు కనిపించాయి. రోజూ పది ప్యాకెట్లు అమ్మే షాపులు వంద ప్యాకెట్లు అమ్ముకున్నాయి. బీహార్, పశ్చిమబెంగాల్లతో పాటు, మేఘాలయ, మిజోరాం, అరుణాచల్, నాగాలాండ్ తదితర రాష్ట్రాలలో జనం ఉప్పు ప్యాకెట్ల కోసం ఎగబడ్డారు.
గ్రామీణ ప్రాంతాలకన్నా పట్టణాలలో ఈ కలకలం ఎక్కువగా కనిపించింది. దీంతో ఆయా రాష్ట్రాల నిత్యా వసర మంత్రిత్వశాఖలు ప్రత్యేకంగా రంగంలో దిగి జనా న్ని సమాధానపరచాల్సివచ్చింది. మంత్రులు కూడా మనకు ఉప్పు కొరత లేనేలేదంటూ గణాంకాలు ఏకరువు పెడుతూ పెద్ద పెద్ద ప్రకటనలు ఇవ్వాల్సివచ్చింది. దాదాపు 15 మందిని అరెస్టు చేసి ‘మూడో డిగ్రీ’ ప్రయో గిస్తే వారి వెనకున్న దొంగవ్యాపారులంతా బైటపడ్డారు. మందిని భయపెట్టి సొమ్ము చేసుకుందామనుకున్న నల్ల వ్యాపారులకు అలా అరదండాలు పడ్డాయి. ఈ ఉదంతాన్ని రాజకీయంగా సొమ్ము చేసుకోవడానికి కాంగ్రెస్, బీజేపీ రెండూ పోటీ పడ్డాయి. వదంతులను రేకెత్తించింది బీజేపీయేనంటూ కాంగ్రెస్ నాయకులు విమర్శించగా, ఉప్పు ధరలను కూడా అదుపు చేయలేక మా మీద విమర్శలు చేస్తున్నారంటూ బీజేపీ నాయకులు తిప్పికొట్టారు.
ఉప్పు కొరత ఊహాజనితమే....
మూడువైపులా మహాసముద్రాలున్న మన దేశంలో ఉప్పు కొరత వస్తుందంటే ఎవరైనా నమ్ముతారా? అయినా వదం తులకు లాజిక్కు ఉంటుందా? ఏదైనా పుకారు మన చెవిన పడగానే లేడికి లేచిందే ప్రయాణమన్నట్లు పొలోమంటూ ఎగబడడమే... అసలు మనకు ఉప్పుకు కొరత వచ్చే అవ కాశముందా..? ఈ సందేహం తీరాలంటే ఓమారు ఉప్పు లెక్కలు పరికించాల్సిందే... మనదేశంలో 11,799 రిజిస్టర్డ్ వ్యాపారులు 6.09 లక్షల ఎకరాలలో ఉప్పు సాగు చేస్తు న్నారు. ఏటా సగటున 215.8 లక్షల టన్నుల ఉప్పును ఉత్పత్తి చేస్తున్నాం. 2009-10లో 240 లక్షల టన్నుల ఉప్పు ఉత్పత్తి కాగా, 2012-13లో 221 లక్షల టన్నులు ఉత్పత్తయింది. 1947లో 10.9 లక్షల టన్నులు ఉత్పత్తి చేసే స్థితి నుంచి ఈ స్థాయికి చేరుకున్నాం. గుజరాత్, రాజ స్థాన్, తమిళనాడు రాష్ట్రాలలో మిగులు ఉత్పత్తి జరుగు తున్నది. మొత్తం ఉత్పత్తిలో 76.7 శాతం ఒక్క గుజరాత్ నుంచే వస్తుంది. తమిళనాడులో 11.16 శాతం రాజస్థాన్ లో 9.86 శాతం ఉత్పత్తి జరుగుతున్నది. మిగిలిన 2.28 శాతం ఉత్పత్తి ఆంధ్రప్రదేశ్, మహారాష్ర్ట, ఒడిశా, కర్ణాటక, పశ్చిమబెంగాల్, గోవా, హిమాచల్‌ప్రదేశ్, డయ్యూ - డామన్‌ల నుంచి వస్తుంది. అన్ని అవసరాలకూ వినియో గించుకోగా మనం ఏటా సగటున 35 లక్షల టన్నుల ఉప్పును ఇతర దేశాలకు ఎగుమతి కూడా చేస్తున్నాం. అందుకని ఉప్పు కొరత అన్నది కలలోని మాటే..
ఉప్పు పాతరలో జీవితాలు...
కూరగాయల ధరలు ఆకాశంలో ఉన్నాయంటే అవి పండిం చే రైతుల పంట పండింది అని మనం అనుకోవడం సహ జం. కానీ రైతుకు దక్కేదాంట్లో పెద్ద తేడా ఏమీ ఉండదు. మధ్య దళారులే ఈ పరిస్థితులను సొమ్ము చేసుకుంటారు. అలాగే ఉప్పు రైతులు, కార్మికుల స్థితిగతుల్లోనూ అధిక ధరలు ఎలాంటి మార్పునూ తీసుకురాలేదు. ఉప్పు కిలో రూ.200 అమ్ముతుండటంపై ఓ చానెల్ విలేకరులు గుజ రాత్‌లోని రాణ్ ఆఫ్ కచ్ ప్రాంతంలో కార్మికులతో మాట్లా డారు. అగారియా తెగకు చెందిన అనేక కుటుంబాలు ఇక్కడ ఉప్పు ఉత్పత్తి చేస్తూ జీవిస్తున్నాయి.
అనేక తరాలుగా వారికి ఇదే జీవనం. టన్ను ఉప్పు ఉత్పత్తి చేస్తే వారికి దక్కేది రూ.60 మాత్రమే. కిలో ఉప్పు రూ.200 అమ్ముడవుతున్న విషయం చెప్పగానే వారు నిర్వేదంగా నవ్వి ఊరుకున్నారు. తమ జీవితాలు ఉప్పు కొటార్ల మధ్య అనేక అసౌకర్యాల నడుమ నిలువుటెండలో తెల్లారిపోతున్నాయంటూ గుడ్లనీరు కుక్కుకున్నారు. ఇక్కడి వాతావరణంలో పగటిపూట ఎండ వేడిమి ఎక్కువ గానూ, రాత్రి పూట అత్యంత చలిగానూ ఉంటుంది. పగలు 40 డిగ్రీలుండే ఉష్ణొగ్రత రాత్రిపూట 5 డిగ్రీలకు పడిపోతుంది. రోజంతా ఉప్పు కయ్యల్లో నడుస్తూనే ఉంటారు. కాళ్ల రక్షణకు రబ్బరు తొడుగులు లేవు. ఎండ నుంచి రక్షించే ఎలాంటి ఆచ్ఛాదన వారు ఎరుగరు. రోజం తా ఎర్రటి ఎండలో ఉప్పులో నడిచి నడిచీ వారి కాళ్లు కొయ్యముక్కల్లా మారిపోతున్నాయి. మరణించిన తర్వా త వారి శరీరాలను దహనం చేస్తే కాళ్లు మాత్రం ఇనుపము క్కల్లా కాలకుండా అలానే ఉండిపోతున్నాయట. దాంతో బంధువులు ఆ కాళ్లను విడిగా ఉప్పుపాతరేస్తారు. చాలా కాలం తర్వాత అవి సహజసిద్ధంగా కరిగిపోతాయి.
ఇలాంటి దుర్భర పరిస్థితుల్లో జీవిస్తున్న తమను ఇకనైనా ప్రభుత్వాలు ఆదుకోవాలని వారు కోరుతు న్నారు. కోట్ల లాభాల గురించి తమకు ఆశలేదని, తమ జీవితాలలో కొద్దిగానైనా మార్పు రావాలని ఆశిస్తున్నా మని వారంటున్నారు. దుర్భర దారిద్య్రంతో సహజీవనం చేస్తున్న ఉప్పు కార్మికులకు ప్రభుత్వాలు తీపికబురు చెబుతాయా..? ఏమో... అదీ ఓ వదంతిలా వ్యాపించినా బాగుండు... విని సంతోషిద్దాం...
- సాయి చరణ్