విప్రో మాజీ ఉద్యోగినికి భారీ నష్ట పరిహారం!
లండన్: లైంగిక వేధింపులకు గురవుతున్నానంటూ ఉద్యోగుల ట్రైబ్యునల్ ను ఆశ్రయించిన విప్రో మాజీ ఉద్యోగి శ్రేయా యుకిల్ ఎట్టకేలకు విజయం సాధించింది. ఆ వివరాలిలా ఉన్నాయి... లండన్ కు చెందిన విప్రో కంపెనీలో శ్రేయా పనిచేస్తున్న సమయంలో లింగవివక్షతో పాటు లైంగిక వేధింపులకు గురయింది. మహిళా ఉద్యోగి, అందులో భారత్ కు చెందిన వ్యక్తి అని ఆమెపై తోటి ఉద్యోగులు వివక్ష చూపేవారు. అసభ్య పదజాలంతో దూషించేవారు, వీటికి సంబంధించిన అన్ని సాక్ష్యాలను ప్రవేశపెడుతూ తనకు న్యాయం చేయాలంటూ 2014లో కోర్టును ఆశ్రయించింది.
విప్రో కంపెనీ యాజమాన్యానికి ఫిర్యాదు చేసినా ఎలాంటి రెస్పాన్స్ లేకపోవడంతో న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సి వచ్చిందని చెప్పింది. తాను బెంగళూరులో ఏడేళ్లు జాబ్ చేశాక, 2010లో లండన్ లో తమ కంపెనీలో జాయిన్ అయినట్లు వివరించింది. పురుష ఉద్యోగుల నుంచి లైంగిక వేధింపులు, అసభ్య పదజాలంతో నిత్యం దూషించేవారని ఆవేదన చెందింది. తనకు 1.5 కోట్ల నష్టపరిహారం ఇవ్వాలని తన పిటిషన్ లో పేర్కొంది. మహిళలు తమ అభిప్రాయాలు చెబితే.. ఎమోషనల్ అంటూ కామెంట్లు చేసేవారని శ్రేయా చెప్పింది.
రాజీనామా లేఖ ఇస్తే, కంపెనీ అందుకు అంగీకరించలేదన్నది. తాను సిక్ లీవ్ లో ఉన్నప్పుడు తనను ఇబ్బందులకు గురిచేశారని, ఫిర్యాదులు పట్టించుకోవడం లేదని తన బాధలను ఒక్కోక్కటిగా చెప్పుకొచ్చింది. శ్రేయాకు న్యాయం చేయాలని, ఆమె డిమాండ్ చేసిన నష్టపరిహారం ఇప్పించేందుకు ట్రైబ్యునల్ సిద్ధంగా ఉందని ఆమె తరఫు లాయర్ కిరణ్ దౌర్కా తెలిపారు. జీతంతో పాటు ఆమెను మానసికంగా వేధించినందుకు కంపెనీ తగిన మూల్యం చెల్లించుకోనుందని తన క్లైయింట్ కు కొన్ని రోజుల్లో న్యాయం జరగనుందని లాయర్ ధీమా వ్యక్తంచేశారు.