మూడేళ్ళలో అరవై కిలోలు తగ్గిన శ్రేయాస్...
ప్రతిభావంతులు, సేవా తత్పరులు, రాజనీతిజ్ఙులు ఇలా ప్రత్యేకతలు కలిగిన పలువురి జీవితాలను స్ఫూర్తిగా తీసుకుంటాం. కానీ ఆధునిక కాలంలో అతి పెద్ద సమస్యగా మారిన ఊబకాయులు కూడ ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్నారు. అందుకు శ్రేయాస్ కర్నాడ్ పెద్ద ఉదాహరణ. శ్రేయాస్ తన జీవన ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్న తర్వాత స్వయంగా... ఆరోగ్యకరమైన జీవితాన్ని సాగిస్తూ అందరికీ ఆదర్శమౌతున్నాడు
ఇరవై ఏళ్ళ వయసుకూడ పూర్తికాని శ్రేయాస్ కర్నాడ్ 2009 లో 120 కిలోల బరువుండేవాడు. ఊబకాయంతో ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నాడు. డాక్టర్లు, వైద్యాలు ఒక్కటేమిటి రకరకాలుగా బరువు తగ్గేందుకు ప్రయత్నాలు చేశాడు. తనలా ఊబకాయంతో ఎవ్వరూ బాధపడకూడదన్నది శ్రేయాస్ ఆకాంక్ష. అందుకు తాను ఎంతైనా కష్టపడేందుకు నిర్ణయించుకున్నాడు. ముఖ్యంగా ఆహారపు అలవాట్లే వారి వారి ఆరోగ్యాలకు సహాయపడతాయనేందుకు శ్రేయాస్ పెద్ద ఉదాహరణగా నిలిచాడు. ఓ ట్రైనర్ ప్రోత్సాహంతో 2009 నాటికి కేవలం మూడేళ్ళలో 62 కిలోలకు చేరి అందరికి స్ఫూర్తిగా నిలిచాడు.
2009 లో కడుపులో గ్యాస్, కిడ్నీల్లో రాళ్ళు, కాలేయంలో కొవ్వు వంటి ఇబ్బందులేకాక, రక్తశుద్ధిలేక రకరకాల చర్మవ్యాధులతో కూడ బాధపడేవాడు. వీటన్నింటికీ తన శరీర బరువే కారణమని తెలుసుకున్నాడు. ఆహారపు అలవాట్లతో శరీరంలో జింగ్ ఎక్కువ పెరిగిపోవడంతో రకరకాల ఇబ్బందులకు గురయ్యాడు. ఆరోగ్యంగా బతకాలంటే... శరీరంలో కొవ్వు తగ్గిస్తే తప్పించి మరో దారి లేదని డాక్టర్లు కూడ చెప్పేశారు. కేవలం 22 ఏళ్ళ వయసులో భారీ కాయంతో నానా తంటాలు పడ్డాడు శ్రేయాస్.
2010 లో బరువు తగ్గేందుకు జిమ్ లో చేరిన శ్రేయాస్.. పోషకాహారం తీసుకుంటూ అనేక వ్యాయామాలు చేశాడు. కొవ్వును, బరువును పెంచే అన్ని పదార్థాలను తినడం మానేశాడు. పండ్లు, కూరగాయలు, సలాడ్లు, చక్కెర లేని రసాలు తీసుకోవడం ప్రారంభించాడు. ఆహారపు అలవాట్లలో మార్పు తెచ్చినా శ్రేయాస్ కు అంత ఫలితం కనిపించలేదు. ఇక లాభం లేదనుకొని ఓ ట్రైనర్ ను సంప్రదించి మూడు నెలలపాటు శిక్షణ తీసుకున్నాడు. అదే అతడి జీవితంలో పెద్ద మార్పును తెచ్చి పెట్టింది.
ప్రతిరోజు 70 శాతం కార్డియో, 30శాతం బరువుకు సంబంధించిన ఫిట్నెస్ కార్యక్రమం మొదలు పెట్టాడు. మొదట్లో ట్రెడ్మిల్ పై నాలుగడుగులు వేసేందుకు కూడ శరీరం సహకరించక ఇబ్బంది పడ్డాడు. అయితే పట్టుదల వీడకుండా అనుకున్నది సాధించేందుకు తీవ్ర కృషి చేశాడు. చివరికి ఒకరోజు 30 నిమిషాల్లో పది కిలోమీటర్లు ట్రెడ్మిల్ పై నడక సాగించాడు. తాను సాధించిన దానికి తానే ఆశ్చర్యపోయాడు. అక్కడినుంచీ వెనుదిరిగి చూడకుండా ప్రతిరోజూ కొంత సమయాన్ని పెంచుతూ 2011 నాటికి పది కిలోమీటర్ల దూరం 50 నిమిషాల్లో చేయగలిగాడు. తన ప్రయత్నంతోపాటు 120 కేజీలనుంచీ 80 కేజీలకు బరువు కూడ తగ్గిపోయాడు. ఆ తర్వాత నడకకు తోడు పరుగును కూడ ప్రారంభించాడు.
మారథాన్ అంటే ఏమిటో పూర్తిగా తెలియకుండానే, ఎటువంటి శిక్షణా లేకుండానే 2011 లో మొదటిసారి ఆరుగంటలపాటు మారథాన్ చేసిన శ్రేయాస్... ఆ తర్వాత పలు రకాలుగా పరుగును కొనసాగించాడు. దీనికి తోడు తన రోజువారీ షెడ్యూల్ లో యోగాను కూడ చేర్చాడు. అంతేకాదు కొంతకాలం పూర్తిగా శాకాహారిగా మారడంతో కూడ బరువు భారీగా తగ్గిపోయాడు. చివరిగా 2012 నాటికి మూడు సంవత్సరాల్లో 120 నుంచీ 57 కేజీల బరువు తగ్గి 62 కేజీలకు చేరాడు. అదే స్ఫూర్తితో శ్రేయాస్.. 2012 నుంచి సుమారు 50 మారథాన్లలో పాల్గొన్నాడు.
దేశంలోనే కాక, ఇతర దేశాల్లో కూడ అనేక సైక్లింగ్ కార్యక్రమాల్లో ముందున్నాడు. వచ్చే సంవత్సరంలో అల్ట్రా మారథాన్స్ లో పట్టా కూడ పుచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. అలాగే మనాలి నుంచి లేహ్ వరకు సైకిల్ టూర్... పశ్చిమ కనుమలు, పశ్చిమ తీరంద్వారా సైక్లింగ్ చేయడంతో పాటు... యూ.ఎస్ లోని అప్పలచియన్ ట్రయల్, హాంకాంగ్ లో అల్ట్రా ట్రయల్ మారథాన్, యూరప్ లోని కొన్ని భాగాల్లో సైక్లింగ్ చేసేందుకు సిద్ధమౌతున్నాడు. అయితే తన కథ ఎందరో ఊబకాయులకు స్ఫూర్తిగా నిలవాలని, బరువు తగ్గి అంతా ఆరోగ్యంగా జీవించాలని శ్రేయాస్ ఆశిస్తున్నాడు.