Shubham Gupta
-
ఈ ప్రదర్శనను ఆపండి...!
న్యూఢిల్లీ: ఒక వైపు కన్నకొడుకును కోల్పోయి పుట్టెడు దుఃఖంలో మునిగి ఉన్న ఓ మాతృమూర్తి..పరిహారం చెక్కు ఇస్తూ ఫొటో తీయించుకోవాలనే మంత్రి యావను చూసి అసహనం వ్యక్తం చేశారు. ‘ఈ ప్రదర్శనను ఆపండి’ అంటూ అక్కడున్న వారిని వేడుకున్నారు. యూపీలో చోటుచేసుకున్న ఈ ఘటన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. మంత్రి తీరును ప్రతిపక్ష పార్టీల నేతలు తీవ్రంగా ఎండగట్టారు. జమ్మూకశ్మీర్‌లోని రాజౌరీలో గురువారం ఉగ్రవాదులతో జరిగిన ఎన్కౌంటర్లో యూపీలోని ఆగ్రాకు చెందిన కెప్టెన్ శుభమ్ గుప్తా అసువులు బాశారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున పరిహారం చెక్కు అందజేసేందుకు మంత్రి యోగేంద్ర ఉపాధ్యాయ్ శుక్రవారం ఆయన కుటుంబాన్ని కలుసుకున్నారు. తీవ్ర శోకంలో ఉన్న కెప్టెన్ శుభమ్ గుప్తా తల్లితో మంత్రి మాట్లాడారు. అనంతరం పరిహారం చెక్కు ఇచ్చేందుకు మంత్రి ప్రయత్నించగా ఆమె తీసుకోలేదు. ‘నాకు ఏమీ వద్దు, ఈ ఎగ్జిబిషన్(ప్రదర్శని మత్ లగావో)ను ఇక ఆపండి’ అంటూ వేడుకున్నా చెక్కును అలాగే పట్టుకుని ఫొటో తీయించుకునేందుకు మంత్రి ప్రయత్నిస్తున్నట్లు వీడియోలో రికార్డయింది. -
'నితిన్ విషయంలో అనుమానించొద్దని కాల్చుకుంది'
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో మెర్సిడిస్ కారులో జరిగిన యువతి హత్య కేసు కొత్త మలుపు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. తొలుత ఆమెను తానే హత్య చేసినట్లు ఒప్పుకున్న శుభం గుప్తా ఇప్పుడు ప్లేటు ఫిరాయించాడు. తాను అసలు ఆమెను చంపనేలేదని తనే కాల్చుకొని చనిపోయిందంటూ విచారణ అధికారుల ముందు చెప్పాడు. అయితే, కేసును తప్పుదోవపట్టించేందుకు అతడు ప్రయత్నిస్తున్నాడని పోలీసులు చెబుతున్నారు. కొంత దూరం నుంచే కాల్పులు జరిపినట్లుగా తమవద్ద స్పష్టమైన ఆధారాలు ఉన్నట్లు వారు తెలిపారు. కొన్ని రోజుల కిందట స్థానిక నజఫ్ గఢ్‌కు చెందిన సిమ్రన్(17) ఇద్దరు స్నేహితులతో కలిసి షాపింగ్‌కు వెళ్లింది. అనంతరం ఇద్దరితో కలిసి మెర్సిడిస్ కారులో ఇంటి సమీపానికి చేరుకుంది. అక్కడ ఓ యువకుడు కారు దిగి వెళ్లిపోగా కారులోనే ఉన్న శుభం గుప్తా, సిమ్రన్ మాత్రమే ఉన్నారు. తన మాజీ బాయ్‌ఫ్రెండ్ నితిన్‌తో సిమ్రన్ సన్నిహితంగా ఉండటం, అబద్ధాలు చెబుతుండటంపై శుభం ఆమెను ప్రశ్నించాడు. అనంతరం వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఆమె తల్లి చూస్తుండగానే అతడు సిమ్రన్ను తుపాకీతోనే కాల్చేశాడు. ఆమె చనిపోయింది. పోలీసుల ముందు నేరం కూడా ఒప్పుకున్నాడు. కానీ, విచారణ అధికారుల ముందు మాత్రం తమ మధ్య వాగ్వాదం జరిగిన తర్వాత సిమ్రన్ తన చేతిలోని తుపాకీ లాక్కొని కాల్చుకొని చనిపోయిందంటూ కొత్తగా చెప్పాడు. తాను నితిన్ గురించి అబద్ధం చెప్పడం లేదని ప్రూవ్ చేసుకునేందుకు కాల్చుకుందని తెలిపాడు. తనను నమ్మకుంటే నిజంగానే కాల్చుకొని చనిపోతానని చెప్పిందని, తాను అలా చేస్తుందని ఊహించలేకపోయానంటూ పోలీసులముందు అబద్ధాలు చెప్పాడు. కానీ, శుభం చెప్పేదంతా కట్టుకథేనని, అసలు నిజాలు త్వరలోనే తెలుస్తాయని చెప్పారు. -
ఈ టైంలో అబ్బాయిలతో తిరుగుతున్నావెందుకని..
పుణె: 'ఎలా నువ్వు పొట్టి దుస్తులు వేసుకుంటావు? ఇంత సమయంలో ఇద్దరు మగాళ్లతో ఎలా తిరగగలుగుతున్నావు? పుణెలో ఇలాంటివి నడవవు' అని ఓ 22 ఏళ్ల యువతిని ఓ గ్యాంగ్ ప్రశ్నించింది. తెల్లవారుతుండగా ఈ ఘటన జరిగింది. అంతేకాదు.. ఆ యువతిని కారులో నుంచి బయటకు ఈడ్చి దాడి చేసింది. అనంతరం గట్టిగా వార్నింగ్ కూడా ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఆమెకు గాయాలయ్యాయి. అయితే, ఘటన చోటుచేసుకున్న వారం తర్వాతగానీ పోలీసులు కేసు నమోదుచేయలేదు. పూర్తి వివరాల్లోకి వెళితే.. తన స్నేహితురాలి వివాహ కార్యక్రమానికి ముందు జరిగే సంగీత్‌లో పాల్గొనేందుకు డ్యాన్స్ రిహార్సల్స్ కోసం ఈ యువతి తన ఇద్దరు స్నేహితులతో కలిసి వెళ్లొస్తుండగా ఆమె కారును మరోకారు ఫాలో అయింది. సరిగ్గా తెల్లవారు జామున 5.30గంటల ప్రాంతంలో ఆ కారులోని వ్యక్తులు ఆమె కారు డోర్ కొట్టారు. అనంతరం అందులోకి తొంగిచూశారు. ఆ వెంటనే అనకూడని మాటలు మొదలుపెట్టారు. అలా తిడుతూనే కారులోనే వెంబడించారు. కొద్ది దూరం వెళ్లాక కారును ఆపేశారు. ఆ యువతి స్నేహితుడు జోక్యం చేసుకోవడంతో అతడిపై చేయిచేసుకున్నారు. ఆ వెంటనే ఆ అమ్మాయిని కూడా అసభ్యకరంగా తిడుతూ కొట్టారు. ఈ సందర్భంగా తన స్నేహితులు లేకుంటే బహుషా వారు ఆరోజు తనపై లైంగిక దాడి కూడా చేసేవారని బాధితురాలు చెప్పింది. ఈ కేసుకు సంబంధించి అమిత్ ముఖ్దేద్ కార్, శుభం గుప్తా అనే ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు.