ఆపరేషన్ - 2014
సాక్షి ప్రతినిధి, అనంతపురం : ఎన్నికలు ముంచుకొస్తోన్న నేపథ్యంలో శాంతిభద్రతలను పరిరక్షించేందుకు ఎస్పీ సెంథిల్‌కుమార్ ‘ఆపరేషన్ - 2014’కు శ్రీకారం చుట్టారు. గత ఎస్పీ శ్యాంసుందర్ రద్దు చేసిన స్పెషల్ ఆపరేషన్ గ్రూప్(ఎస్ఓజీ)ను పునరుద్ధరించారు. విధి నిర్వహణలో నిజాయితీ, చిత్తుశుద్ధితో వ్యవహరించే యువ ఎస్ఐలు, కానిస్టేబుళ్లకు ఎస్ఓజీలో స్థానం కల్పించారు.
నియోజకవర్గాల వారీగా క్రియాశీలకంగా ఉన్న ఫ్యాక్షనిస్టులు, రౌడీషీటర్లు, నేరప్రవృత్తి కలిగిన వారి పేర్లతో కూడిన జాబితాను రూపొందించారు. వారి కదలికలపై నిఘా పెట్టారు. అనుమానం వచ్చిన వెంటనే అదుపులోకి తీసుకుని.. కౌన్సెలింగ్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. పనిలో పనిగా పోలీసు శాఖలో గాడితప్పిన సీఐలు, ఎస్ఐలు, కానిస్టేబుళ్లను గుర్తించి, నివేదిక ఇచ్చే బాధ్యతను కూడా ఎస్ఓజీకే అప్పగించారు.
ఎస్ఓజీని పునరుద్ధరిస్తూ ఎస్పీ సెంథిల్‌కుమార్ తీసుకున్న నిర్ణయం అటు అసాంఘిక శక్తుల్లోనూ.. ఇటు పోలీసు శాఖలోనూ ప్రకంపనలను రేపుతోంది. రాయలసీమలో ఫ్యాక్షన్‌కు పెట్టింది పేరు అనంతపురం జిల్లా. కానీ.. పదేళ్లుగా ఫ్యాక్షన్ కక్షలు తగ్గుముఖం పట్టాయి. వర్గ కక్షలతో సర్వం కోల్పోవడం, పిల్లలు చదువుకుని ఉన్నత స్థానానికి చేరడం వంటివి ఫ్యాక్షన్ కక్షల తీవ్రత తగ్గడానికి దారితీశాయని చెప్పవచ్చు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఇటీవల కొన్ని నియోజకవర్గాల్లో మళ్లీ ఫ్యాక్షన్ కక్షలు చెలరేగే అవకాశాలు ప్రస్ఫుటంగా కన్పిస్తున్నాయి. తాడిపత్రి, ధర్మవరం, రాప్తాడు, ఉరవకొండ నియోజకవర్గాల్లో ఇప్పటికే కొన్ని గ్రామాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
నిఘా వర్గాల ద్వారా ఈ అంశాన్ని గుర్తించిన ఎస్పీ సెంథిల్‌కుమార్ ఆపరేషన్- 2014కు శ్రీకారం చుట్టారు. ఆ క్రమంలోనే ప్రజాప్రతినిధులు కాని వారికి గన్మెన్లను ఉపసంహరించుకోవాలని ప్రభుత్వానికి ప్రతిపాదించారు. బీహార్, ఉత్తరప్రదేశ్‌లకు చెందిన ప్రైవేటు వ్యక్తులను గన్మెన్లుగా నియమించుకున్న నేతలకు.. తక్షణమే వారిని పంపేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఇది ఫ్యాక్షన్ నేపథ్యమున్న నేతలను ఆత్మరక్షణలోకి నెట్టింది. ఈ నేపథ్యంలోనే ఎస్ఓజీని పున రుద్ధరిస్తూ ఎస్పీ తీసుకున్న నిర్ణయం అసాంఘిక శక్తుల్లో కలవరం రేపింది. విధి నిర్వహణలో నిజాయితీ, చిత్తుశుద్ధి, మంచి ట్రాక్ రికార్డు ఉన్న యువ ఎస్ఐలు, కానిస్టేబుళ్లను 20 మందిని గుర్తించిన ఎస్పీ.. వారితో ఎస్ఓజీని ఏర్పాటు చేశారు. ఇంటెలిజెన్స్, స్పెషల్ బ్రాంచ్, ఇతర వర్గాల ద్వారా నియోజకవర్గాల వారీగా పరిస్థితిని సమీక్షించి.. క్రియాశీలకంగా ఉన్న ఫ్యాక్షనిస్టులను గుర్తించారు. తోక విప్పుతోన్న రౌడీషీటర్లను, నేరచరిత్ర కలిగిన నేతలను గుర్తించి... జాబితా రూపొందించారు. ఇటీవల ఉద్రిక్త వాతావరణం నెలకొన్న గ్రామాలనూ గుర్తించారు. అదే జాబితాను ఎస్ఓజీకి అప్పగించారు. తోక విప్పుతోన్న ఫ్యాక్షనిస్టులు, రౌడీషీటర్లకు రహస్య కౌన్సెలింగ్ ఇవ్వాలని ఆదేశించారు.
ఉద్రిక్త వాతావారణం ఏర్పడిన గ్రామాల్లో.. అందుకు కారణమైన వ్యక్తులను గుర్తించి బైండోవర్ కేసులు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. రాప్తాడు, తాడిపత్రి, ఉరవకొండ, ధర్మవరం నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ నియోజకవర్గాల్లో గ్రామాల వారీగా పరిస్థితిని క్షుణ్ణంగా అధ్యయనం చేయించారు. అసాంఘిక శక్తులు(ట్రబుల్ మేకర్స్)ను గుర్తించారు. ఆ జాబితాలో ఉన్న నేతలపై ప్రత్యేక నిఘా వేయించారు.
ఎస్ఓజీ కార్యకలాపాలు పూర్తిగా ఎస్పీ కనుసన్నల్లోనే జరగనున్నాయి. ఎన్నికల షెడ్యూలు వెలువడక ముందే గ్రామాల్లో పరిస్థితిని చక్కదిద్దడం ద్వారా.. ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించవచ్చునని ఎస్పీ భావిస్తున్నారు. ఎన్నికల షెడ్యూలు వెలువడటంతోనే కోడ్ అమల్లోకి వస్తుంది. ఆలోగా జిల్లాలో మూడేళ్లకు మించి పని చేసిన సీఐలను బదిలీ చేయనున్నారు. ఒకే ప్రాంతంలో పనిచేస్తోన్న ఎస్ఐలు, కానిస్టేబుళ్లను కూడా బదిలీ చేయనున్నారు. బదిలీల తర్వాత పోలీసు సిబ్బంది పనితీరుపై కూడా ఎస్‌ఓజీతో నిఘా వేయిస్తారు. ఏ పార్టీకైనా కొమ్ముకాస్తున్నట్లు తేలితే కఠిన చర్యలు తీసుకోవాలని భావిస్తున్నారు. ఎస్పీ ఆదేశాల మేరకు ఎస్ఓజీ వేగంగా అడుగులు వేస్తోండటం అసాంఘిక శక్తుల్లో కలవరం రేపుతోంది.