sidabad
-
ఆక్యుప్రెషర్‌తో రోగాలు నయం చేస్తామంటూ...
సాక్షి, హైదరాబాద్ : ఆక్యుప్రెషర్ పేరుతో రోగాలు నయం చేస్తామంటూ మోసం చేస్తున్న ఒక ఏజెంట్, ఇద్దరు నకిలీ డాక్టర్లపై సైదాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. కర్ణాటక రాష్ట్రంలోని బళ్లారి శివమొగ్గకు చెందిన నూర్ మహ్మద్ సయ్యద్, సయ్యద్ షబ్బీర్ ఆక్యుప్రెషర్ వైద్యంతో రోగాలు నయం చేస్తామంటూ చంపాపేట్ బాలాజీ గార్డెన్లో 15 రోజుల ఒకసారి శిబిరం నిర్వహిస్తున్నారు. ప్రతి రోగి వద్ద నుంచి 500 రూపాయలు వసూలు చేస్తూ లక్షల రూపాయలను దన్నుకున్నారు. అన్ని రకాల రోగాలను నయం చేస్తామని నమ్మబలికి వేల మంది రోగులను తప్పు దోవ పట్టిస్తూ వారి ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఏజెంట్ల ద్వారా వేలాది మందిని శిబిరానికి రప్పించుకుంటూ పెద్ద ఎత్తున దోచుకుంటున్నారు. మాదన్న పేటకు చెందిన మహ్మద్, ఆదిభట్లకు చెందిన సరస్వతి గతంలో ఎన్నో సార్లు వారి దగ్గర వైద్యం చేయించుకున్నారు. వైద్యం చేయించుకుంటున్నప్పటికి షుగర్ మరింత ఎక్కువవటంతో మోసపోయామని గ్రహించిన వారు సైదాబాద్ పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేసారు. దీంతో ఒక ఏజెంట్, ఇద్దరు డాక్టర్లపై పోలీసులు కేసు నమోదు చేశారు. -
జువెనైల్ హోం నుంచి 15 మంది బాలురు పరారీ
హైదరాబాద్ : నగరంలోని సైదాబాద్ జువెనైల్ హోం నుంచి శనివారం అర్థరాత్రి 15 మంది బాలురు పారిపోయారు. గదిలోని కిటికీ ఇనుప చువ్వలను ఆక్సా బ్లేడ్, కట్టర్ సాయంతో కోసి కిందకు దిగి గోడ దూకి పారిపోయినట్లు జువెనైల్ అధికారులు చెబుతున్నారు. వీరికి బెయిల్ రావడంలో ఆలస్యం అవుతుండటంతో ఈ పనికి పాల్పడినట్లు తెలుస్తోంది. 13 మంది ఒక గ్రూపుగా ఇద్దరు ఒక గ్రూపుగా విడిపోయి పారిపోతున్న దృశ్యాలు బస్తీలోని సీసీ కెమెరా ఫుటేజీలో కనిపించాయి. రాచకొండ, సైబరాబాద్, హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని పోలీస్స్టేషన్లలో వీరిపై ఐదేసి కేసులున్నట్లు జువెనైల్ అధికారులు చెబుతున్నారు. అయితే, ఈ ఘటనపై జువెనైల్ అధికారులు సైదాబాద్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు పారిపోయిన వారిలో ఒకరిని పట్టుకున్నారు. ఈ మేరకు సైదాబాద్ ఎస్సై కాట్న సత్తయ్య ఆదివారం మీడియాకు తెలిపారు. మూడ్రోజుల క్రితం ఇదే హోం నుంచి ఐదుగురు బాలురు పారిపోగా అధికారులు వారిని వెదికి పట్టుకొచ్చినట్లు తెలుస్తోంది. ఇది జరిగి రెండ్రోజులు గడవకముందే తాజాగా బాలురు తప్పించుకోవటం వెనుక అధికారుల వైఫల్యం కొట్టొచ్చినట్లు కనబడుతోంది. జువెనైల్ హోంను పరిశీలించిన డైరెక్టర్ ఈ ఘటనపై సమాచారం అందుకున్న వీధి బాలల సంక్షేమశాఖ డైరెక్టర్ శైలజ ఆదివారం పరిశీలన గృహాన్ని పరిశీలించారు. అక్కడి హోం సూపరింటెండెంట్ నీల కంఠాధర్‌ను వివరాలు అడిగి తెలుసుకుని ఘటనపై విచారణకు ఆదేశించారు. దీనికి బాధ్యులైన వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకునేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. సూపరింటెండెంట్‌ను సస్పెండ్ చేయాలి ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపించి పరిశీలనగృహం సూపరింటెండెంట్ నీల కంఠాధర్‌ను సస్పెండ్ చేయాలని బాలల హక్కుల సంఘం గౌరవాధ్యక్షుడు అచ్యుతరావు ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. పిల్లల వద్దకు ఆక్సా బ్లేడ్ వంటి పరికరాలు ఎలా వచ్చాయని ఆయన ప్రశ్నించారు. పిల్లలను సంస్కరించాల్సిన హోం యమపురిగా మారిందని ఆయన మండిపడ్డారు. -
చెల్లిళ్ల గొంతునులిమి చంపిన అన్నయ్య
హైదరాబాద్: నగరంలోని సైదాబాద్ పూసలబస్తీలో అర్థరాత్రి దారుణం జరిగింది. అరవింద్ అనే వ్యక్తి తన ఇద్దరు సొంత చెల్లెళ్లను గొంతు నులిమి హత్య చేశాడు. అనంతరం నిందితుడు అరవింద్ పోలీసు స్టేషన్ వచ్చి పోలీసుల ఎదుట లొంగిపోయాడు. పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేశారు. అనంతరం రెండు మృతదేహాలను స్వాధీనం చేసుకుని... పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. హత్యకు గల కారణాలు తెలియరాలేదు.