'సీఎం కుమారుడు వైదొలగాలని సూచించా'
న్యూఢిల్లీ: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కుమారుడు డాక్టర్ యతీంద్ర డెరైక్టర్‌గా ఉన్న కంపెనీ మ్యాట్రిక్స్‌కు నిబంధనలకు విరుద్ధంగా కాంట్రాక్టు కట్టబెట్టారని వచ్చిన ఆరోపణలపై ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ స్పందించారు. ఆ సంస్థ నుంచి వైదొలగమని సిద్ధరామయ్య.. ఆయన కుమారుడికి చెప్పాల్సిందిగా సూచించినట్టు చెప్పారు. కాగా మ్యాట్రిక్స్‌కు కాంట్రాక్టు అప్పగించిన విషయంపై విచారణకు ఆదేశించాల్సిందిగా కర్ణాటక ముఖ్యమంత్రిని కోరుతారా అన్న మీడియా ప్రతినిధుల ప్రశ్నకు దిగ్విజయ్ అవసరంలేదని బదులిచ్చారు.
'కాంట్రాక్టు ఇచ్చే విషయం పూర్తిగా పారదర్శకంగా జరిగింది. ఈ ఫైలు సీఎం దగ్గరకు రాలేదు. విచారణకు ఆదేశించాలని నేను సీఎంను కోరను. కంపెనీ నుంచి సిద్ధరామయ్య కొడుకు వైదొలగాలని మాత్రమే సలహా ఇచ్చాను. ఇది ఆదేశం కాదు. సలహా మాత్రమే' అని దిగ్విజయ్ చెప్పారు. రాజేష్గౌడ డెరైక్టర్‌గా ఉన్న మ్యాట్రిక్స్ సంస్థలో సిద్ధరామయ్య కుమారుడైన డాక్టర్ యతీంద్ర డెరైక్టర్‌గా చేరడం, అదే మ్యాట్రిక్స్ సంస్థకు నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో డయాగ్నస్టిక్ సెంటర్లను ఏర్పాటు చేసే కాంట్రాక్టును కట్టబెట్టారన్న ఆరోపణలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే.