గోలీ.. నకిలీ!
సిద్దిపేట/సిద్దిపేట మున్సిపాలిటీ, న్యూస్‌లైన్: జలుబైనా.. జబ్బు చేసినా.. డాక్టర్లు యాంటీబయాటిక్ మాత్రలు రాయడం పరిపాటి. అందుకే యాంటీబయా‘ట్రిక్స్’ ప్లేచేశారు సిద్దిపేటలో మెడికల్ దందాలో ఉన్న కొందరు వ్యక్తులు. సాధారణంగా బ్రాండెడ్, వంద శాతం నాణ్యతా ప్రమాణాలున్న వాటికి వచ్చే లాభాలకన్నా 50 శాతం అధికంగా ఆర్జించే వెసులుబాటు ఉండటంతో నాసిరకం (సబ్ స్టాండర్డ్) గోలీలకు డిస్ట్రిబ్యూటర్ల అవతారమెత్తారు. కొంత కాలం నుంచి ఈ అక్రమ దందాతో రూ.లక్షలు గడిస్తున్నారు.
సిద్దిపేటలోని భారత్‌నగర్-శివాజీనగర్ ఏరియాల్లోనే ఎక్కువగా దవాఖానాలు, రిటైల్ మందుల దుకాణాలు, మెడికల్ ఏజెన్సీలున్నాయి.
స్థానిక ఓ మెడికల్ ఏజెన్సీ కేంద్రంగా సబ్స్టాండర్ట్ యాంటీబయాటిక్ మాత్రల దిగుమతులు, ఎగుమతులు జరుగుతున్నట్టు సమాచారం. మామూలుగానైతే హైదరాబాద్ నుంచి స్టాకు రావాలి. కానీ...ఏకంగా ఇక్కడ్నించే భాగ్యనగరానికి ఎగుమతి చేస్తుండటం గమనార్హం. ఇదే క్రమంలో అందిన సమాచారం మేరకు ఔషధ నియంత్రణ అధికారులు రంగంలోకి దిగారు. సదరు ఏజెన్సీలో తనిఖీ చేసి నాణ్యతా ప్రమాణాలు లేవని, మరేదో మోసం దాగి ఉందని ప్రాథమికంగా భావించారు. అందుకే ఆ యాంటీబయాటిక్పై ఆయా చోట్ల శోధిస్తున్నారు.
అనేక అనుమానాలు
ఈ వ్యవహారంలో సంబంధిత అధికారుల తీరుపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ యాంటీబయాటిక్ మందులు, బిల్లులు చూడగానే సందేహించిన వాళ్లు ఆ ఏజెన్సీని తక్షణం తమ ఆధీనంలోకి ఎందుకు తీసుకోలేదన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఎలాగూ తమ బండారం బయటపడుతుందని అంచనాకొచ్చిన ఏజెన్సీ బాధ్యులు స్టాకును రహస్య స్థావరాలను తరలించారని ప్రచారం జరుగుతోంది.
యాంటీబయాటిక్ మాత్రల గోల్‘మాల్’ జాతకాన్ని తేల్చేందుకు సంబంధిత అధికారుల బృందం లోతుగానే శోధిస్తోంది. నిజానికి ఈ టీంలోని ఓ అధికారి తిరుమల తిరుపతిలో దైవదర్శనానికి వెళ్లేందుకు రెడీ అయ్యారు. ఇంతలోనే ఈ పని పడడంతో తిరుపతి పర్యటన రద్దు చేసుకొని మరీ..ఆయన ఆ యాంటీబయాటిక్ డ్రగ్స్ మూలాలున్న ఉత్తరాఖండ్‌కు వెళ్లారని తెలిసింది. మందుల నాణ్యతను నిర్ధారించడంతోపాటు వాటి వేర్లు, ఇతర వివరాలను రాబడుతున్నారు. అయితే మొత్తంగా ఈ వ్యవహారంపై ఏడీని వివరణ కోరేందుకు ‘న్యూస్‌లైన్’ బుధ, గురువారాల్లో ఫోన్లో పలుమార్లు ప్రయత్నించినా అందుబాటులోకి రాలేదు. డీఐ ప్రభాకర్‌గౌడ్‌ను ఫోన్లో సంప్రదిస్తే...‘ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం...వివరాలు వెల్లడించే అధికారం నాకు లేదు..ఏడీనే అడగండి..’ అంటూ బదులిచ్చారు. ఇదిలా ఉండగా మెడికల్ ఏజెన్సీల పరంగా మెదక్ జిల్లాకు రాష్ట్రంలోనే మంచి గుర్తింపుందని తన పేరు వెల్లడించడానికి ఇష్టపడని వారి సంఘం ప్రతినిధి ఒకరు ‘న్యూస్‌లైన్’తో అన్నారు. అలాంటి కొందరు వ్యక్తుల నిర్వాకం వల్లే మచ్చ వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.