సిద్దిపేట ఫస్ట్
సిద్దిపేట జోన్: సరిగ్గా ఆరు నెలల క్రితం శ్రీముఖం..మరి నేడో రాష్ట్రంలోనే అగ్రస్థానం. అర్ధవార్షిక ఆస్తి పన్ను వసూలు ప్రక్రియలో వైఫల్యాలను చవి చూసిన సిద్దిపేట స్పెషల్ గ్రేడ్ మున్సిపాల్టీ ప్రస్తుతం పన్ను వసూళ్లలో ప్రథమ స్థానంలో నిలిచింది. అప్పట్లోనే సాక్షి మున్సిపల్ వైఫల్యాలను ఎత్తి చూ పుతూ ‘బల్దీయాలకు శ్రీముఖాలు’ అ నే విశ్లేషనాత్మక కథనాన్ని ప్రచురించిన విషయం పాఠకులకు విదితమే. కానీ అధికారుల సమష్టి కృషితో తెలంగాణ రాష్ట్రంలోని 66 మున్సిపాల్టీల్లో అత్యధికంగా ఆస్తి పన్నును వసూలు చేసిన జాబితాలో నెం.1 అయింది. సిద్దిపేట అధికారుల పని తీరును తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డెరైక్టర్ జనార్దన్‌రెడ్డి అభినందిస్తూ ఆదర్శంగా నిలిచారంటూ శనివారం హైదరాబాద్‌లో జరిగిన తెలంగాణ పరిధిలోని మున్సిపాల్టీల సమావేశంలో ఆయన కితాబిచ్చారు.
ఏప్రిల్ నుంచి సెప్టెం బర్ వరకు జరిగిన అర్ధవార్షిక మొదటి వసూలు ప్రక్రియలో సిద్దిపేట మున్సిపాల్టీ నిర్దేశిత లక్ష్యంలో 73 శాతాన్ని అధిగమించడం గమనార్హం. మున్సిపల్ రికార్డుల ప్రకారం రూ. 2.3కోట్ల లక్ష్యానికి గాను రూ. 1.40 కోట్లను అర్ధవార్షికలో వసూలు చేసి తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధికంగా ఆస్తి పన్నును వసూలు చేసిన జాబితాలో అగ్రగామిగా నిలిచింది.
వివరాల్లోకి వెళ్తే... స్పెషల్ గ్రేడ్ మున్సిపాల్టీగా గుర్తింపు పొందిన సిద్దిపేటతో పాటు జిల్లాలో మెదక్, సంగారెడ్డి, జహీరాబాద్, సదాశివపేటతో పాటు మూడు నగరపంచాయితీలున్నాయి. సిద్దిపేట స్పెషల్ గ్రేడ్ మున్సిపాల్టీకి అప్పట్లోనే పూర్తి బాధ్యతలతో కూడిన నూతన కమిషనర్ నియమితులయ్యారు. ఆస్తి పన్ను అసెస్మెంట్ల వివరాలు, నిర్దేశిత లక్ష్యాలు, సిబ్బంది పని తీరుపై తరచుగా సమీక్షలు నిర్వహించడం జరిగింది. ఈ క్రమంలో ప్రతి అర్ధవార్షిక ఆస్తి పన్ను వ సూలు సమయాల్లో ప్రజలకు అవగాహన కల్పిస్తూనే, వసూలు ప్రక్రియను వేగవంతం చేసేందుకు విస్తృతంగా ప్ర త్యేక క్యాంపులు, ఒత్తిళ్లు, చైతన్య కార్యక్రమాలు మున్సిపల్ అధికారులు నిర్వహించారు. దాంతో సత్ఫలితాలొచ్చాయి.