siddipet zone
-
సిద్దిపేట జిల్లా లో సందడి చేసిన సోనూసూద్..ఫోటోలు వైరల్
-
కంప్యూటర్ విద్య కంచికి
సిద్దిపేట జోన్, న్యూస్‌లైన్: ప్రభుత్వ పాఠశాలల్లోని కంప్యూటర్ గదులకు తాళాలు పడ్డాయి. రెండు నెలల క్రితం ప్రభుత్వం కంప్యూటర్ టీచర్లను తొలగించడంతో విద్యార్థులు ఆ విద్యకు దూరమయ్యారు. అదే సమయంలో కాంట్రాక్టు టీచర్లు రోడ్డున పడ్డారు. మరోవైపు కోట్లాది రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసిన విలువైన కంప్యూటర్లు మూలకు చేరాయి. ప్రభుత్వ చర్యను నిరసిస్తూ కంప్యూటర్ టీచర్లు ఆందోళనకు సిద్ధమయ్యారు. నిరుపేద విద్యార్థుల కోసం కేంద్ర ప్రభుత్వం కంప్యూటర్ విద్యకు శ్రీకారం చుట్టింది. 2002 నుంచి 2007 వరకు మొదటి విడతగా జిల్లాలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో కంప్యూటర్ విద్యను ప్రారంభించింది. 2008-09 సంవత్సరానికి గాను రెండో విడత కింద రాష్ట్ర వ్యాప్తంగా 5 వేల పాఠశాలల్లో ఏజెన్సీల ద్వారా కంప్యూటర్ బోధనకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అందుకు అనుగుణంగానే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో జిల్లాలో సుమారు 256 పాఠశాలల్లో కాంట్రాక్ట్ పద్ధతిన కంప్యూటర్ టీచర్లను నియమించింది. గత ఐదేళ్లుగా వీరి సేవలను వినియోగించుకున్న రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్టు వ్యవస్థను రద్దు చేస్తూ గత సెప్టెంబర్‌లో ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు అదే పాఠశాలలో కంప్యూటర్ బోధనపైన ఆసక్తి గల సబ్జెక్ట్ టీచర్లను వినియోగించుకొని తాత్కాలికంగా ల్యాబ్‌లను పర్యవేక్షించాలని ఆదేశించింది. దీంతో జిల్లాలో సుమారు 600 మంది టీచర్లు వీధిన పడ్డారు. గత రెండు నెలలుగా ప్రభుత్వ పాఠశాలల్లో కంప్యూటర్ టీచర్లు లేక, ఆసక్తి గల ఉపాధ్యాయులు ముందుకు రాక కంప్యూటర్ ల్యాబ్‌లు తెరుచుకోవడం లేదు. నామమాత్రపు వేతనంతో పని చేస్తున్న కంప్యూటర్ టీచర్లను విద్యా సంవత్సరం మధ్యలో తొలగించడంతో వారిపై ఆధారపడ్డ కుటుంబాలు సైతం అవస్థలు పడుతున్నాయి. ఈ దశలో సదరు టీచర్లు ప్రభుత్వంపై సమరం మోగించేందుకు సిద్ధమయ్యారు. డిసెంబర్ వరకు ప్రభుత్వానికి గడువు ఇచ్చి నెల రోజులపాటు విడతల వారీగా ఆందోళనలు చేపట్టాలని నిర్ణయించారు. మూలకు చేరిన కంప్యూటర్లు ఐదేళ్ల క్రితం ప్రభుత్వం లక్షల రూపాయలు వెచ్చించి ప్రతి పాఠశాలలకు పది కంప్యూటర్లు, సర్వర్లు, యూపీఎస్, ప్రింటర్, టేబుళ్లను కొనుగోలు చేసింది. ప్రస్తుతం కంప్యూటర్ ల్యాబ్‌లు తెరిచే వారే లేకపోవడంతో వాటి నిర్వహణ ప్రశ్నార్థకంగా మారింది. -
బీఆర్జీఎఫ్ లెక్కలు తేలుస్తున్న యంత్రాగం
సిద్దిపేట జోన్/ సిద్దిపేట రూరల్ న్యూస్‌లైన్: బీఆర్జీఎఫ్ నిధుల వినియోగంలో చోటుచేసుకున్న అక్రమాలే లక్ష్యంగా జిల్లా యంత్రంగం తీగ లాగుతోంది. అక్రమాల గుట్టువిప్పేందుకు సన్నద్ధమవుతోంది. నాలుగేళ్లుగా ప్రభుత్వ నిధుల వినియోగంపై అధికారిక లెక్కలను సేకరిస్తోంది. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి వెచ్చించిన(బీఆర్జీఎఫ్) నిధులపై ప్రభుత్వం ప్రత్యేక నిఘా పెట్టింది. మూడేళ్లుగా సిద్దిపేట డివిజన్ పరిధిలో ఆయా మండలాల్లో బీఆర్జీఎఫ్ నిధుల కింద చేపట్టిన పనులు, వినియోగ ధృవీకరణ పత్రాలు, పెండింగ్ పనులు, మిగులు పనులు లాంటి సమగ్ర వివరాలను క్షేత్ర స్థాయిలో సేకరించేందుకు సమాయత్తమైంది. అందులో భాగంగానే జెడ్పీ సీఈఓ ఆశీర్వాదం, డీపీఓ ప్రభాకర్‌రెడ్డి, పంచాయతీరాజ్ ఎస్సీ అనందంలు బుధవారం సిద్దిపేటలో రోజంతా డివిజన్ పరిధిలోని అధికారులతో సుధీర్ఘ సమీక్షను నిర్వహించారు. ముఖ్యంగా బీఆర్జీఎఫ్ నిధుల వినియోగంలో చోటు చేసుకున్న అక్రమాలను గుర్తించే పనికి శ్రీకారం చుట్టిన జిల్లా యంత్రాంగం ఆ దిశగా నిధుల వినియోగంపై ఆరా తీస్తోంది. ముందస్తుగా సిద్దిపేట డివిజన్ పరిధిలోని ఆయా మండలాలకు మంజూరైన నిధుల వివరాలు, యూసీల సమాచారాన్ని మండలాల వారీగా సేకరించారు. పెండింగ్ పనులపై ప్రత్యేక చర్చ సిద్దిపేట డివిజన్ పరిధిలోని ఆయా మండలాలకు కేటాయించిన బీఆర్జీఎఫ్ నిధుల వినియోగంపై సమగ్ర వివరాలను సేకరిస్తున్న జిల్లా అధికారులు ముఖ్యంగా పెండింగ్ పనులపై దృష్టి సారించారు. గ్రామ సర్పంచ్ల పదవీకాలం ముగిసి కొత్త పాలక వర్గాలు అధికారంలోకి వ చ్చిన నేపథ్యంలో గత నాలుగేళ్లుగా ఆయా గ్రామాల్లో బీఆర్జీఎఫ్ కింద నిలిచిన పనుల వివరాలను, పెండింగ్ నిధులను మండల అధికారుల ద్వారా సేకరించారు. త్వరితగతిన పెండింగ్ పనులను పూర్తిచేయాలని, బ్యాంకుల్లో నిధులు నిల్వ ఉండడం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయని, పనులు సకాలంలో పూర్తి చే యకపోవడంతో సంబంధిత నిధులు వెనక్కివె ళ్లే ప్రమాదం ఉందని జిల్లా అధికారులు ఈ సందర్భంగా సూచించారు. ముఖ్యంగా బీఆర్జీఎఫ్ నిధులు నిర్వీర్యం కాకుండా చూడాలని ఆదేశించారు. మండలాలవారీగా బీఆర్జీఎఫ్ నిధుల వినియోగంపై వివరాలు సేకరించిన జిల్లా అధికారులకు డివిజన్ పరిధిలోని ఒక మండలంలో అధికారికంగా లెక్కలకు పొంతన కుదరలేదన్న అభిప్రాయం వెలిబుచ్చినట్లు సమాచారం. ఈ సమీక్షలో మండల పరిధిలోని డివిజన్ పరిధిలోని ఎంపీడీఓలు, పీఆర్, ఆర్‌డబ్ల్యూఎస్‌కు చెందిన ఈఈలు, డిప్యూటీ ఈఈలు, ఏఈలు పాల్గొన్నారు.