కంప్యూటర్ విద్య కంచికి | Government abruptly removed teachers | Sakshi
Sakshi News home page

కంప్యూటర్ విద్య కంచికి

Published Sun, Dec 1 2013 1:49 AM | Last Updated on Sat, Sep 2 2017 1:08 AM

Government abruptly removed teachers

సిద్దిపేట జోన్, న్యూస్‌లైన్: ప్రభుత్వ పాఠశాలల్లోని కంప్యూటర్ గదులకు తాళాలు పడ్డాయి. రెండు నెలల క్రితం ప్రభుత్వం కంప్యూటర్ టీచర్లను తొలగించడంతో విద్యార్థులు ఆ విద్యకు దూరమయ్యారు. అదే సమయంలో కాంట్రాక్టు టీచర్లు రోడ్డున పడ్డారు. మరోవైపు కోట్లాది రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసిన విలువైన కంప్యూటర్లు మూలకు చేరాయి. ప్రభుత్వ చర్యను నిరసిస్తూ కంప్యూటర్ టీచర్లు ఆందోళనకు సిద్ధమయ్యారు.
 నిరుపేద విద్యార్థుల కోసం కేంద్ర ప్రభుత్వం కంప్యూటర్ విద్యకు శ్రీకారం చుట్టింది. 2002 నుంచి 2007 వరకు మొదటి విడతగా జిల్లాలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో కంప్యూటర్ విద్యను ప్రారంభించింది. 2008-09 సంవత్సరానికి గాను రెండో విడత కింద రాష్ట్ర వ్యాప్తంగా 5 వేల పాఠశాలల్లో ఏజెన్సీల ద్వారా కంప్యూటర్ బోధనకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అందుకు అనుగుణంగానే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో జిల్లాలో సుమారు 256 పాఠశాలల్లో కాంట్రాక్ట్ పద్ధతిన కంప్యూటర్ టీచర్లను నియమించింది. గత ఐదేళ్లుగా వీరి సేవలను  వినియోగించుకున్న రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్టు వ్యవస్థను రద్దు చేస్తూ గత సెప్టెంబర్‌లో ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు అదే పాఠశాలలో కంప్యూటర్ బోధనపైన ఆసక్తి గల సబ్జెక్ట్ టీచర్లను వినియోగించుకొని తాత్కాలికంగా ల్యాబ్‌లను పర్యవేక్షించాలని ఆదేశించింది.
దీంతో జిల్లాలో సుమారు 600 మంది టీచర్లు వీధిన పడ్డారు. గత రెండు నెలలుగా ప్రభుత్వ పాఠశాలల్లో కంప్యూటర్ టీచర్లు లేక, ఆసక్తి గల ఉపాధ్యాయులు ముందుకు రాక కంప్యూటర్ ల్యాబ్‌లు తెరుచుకోవడం లేదు. నామమాత్రపు వేతనంతో పని చేస్తున్న కంప్యూటర్ టీచర్లను విద్యా సంవత్సరం మధ్యలో తొలగించడంతో వారిపై ఆధారపడ్డ కుటుంబాలు సైతం అవస్థలు పడుతున్నాయి. ఈ దశలో సదరు టీచర్లు ప్రభుత్వంపై సమరం మోగించేందుకు సిద్ధమయ్యారు. డిసెంబర్ వరకు ప్రభుత్వానికి గడువు ఇచ్చి నెల  రోజులపాటు విడతల వారీగా ఆందోళనలు చేపట్టాలని నిర్ణయించారు.
 మూలకు చేరిన కంప్యూటర్లు
 ఐదేళ్ల క్రితం ప్రభుత్వం లక్షల రూపాయలు వెచ్చించి ప్రతి పాఠశాలలకు పది కంప్యూటర్లు, సర్వర్లు, యూపీఎస్, ప్రింటర్, టేబుళ్లను కొనుగోలు చేసింది. ప్రస్తుతం కంప్యూటర్ ల్యాబ్‌లు తెరిచే వారే లేకపోవడంతో వాటి నిర్వహణ ప్రశ్నార్థకంగా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement