అభివృద్ది ‘దిశ’గా...
పని చేయండి,, ప్రజల మన్ననలు పొందండి
నిధుల వ్యయంపై నిఘా
జిల్లా అధికారులు గైర్హాజరైతే చర్యలు
‘దిశ’ సమావేశంలో కన్వీనర్, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి
ఖమ్మం జెడ్పీసెంటర్: ‘‘అభివృద్ధి. మనందరి లక్ష్యం ఇదొక్కటే. దీనిని సాధించేందుకు అందరం సమన్వయంతో పనిచేద్దాం. ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందిద్దాం. అభివృద్ధి దిశగా ముందుకు సాగుతూ ప్రజల మన్ననలు పొందుదాం’’ అని, దిశ కమిటీ కన్వీనరైన ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కో–కన్వీనరైన ఎంపీ సీతారాం నాయక్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘దిశ’ కమిటీ సమావేశం శనివారం నగరంలోని టీటీడీసీ సమావేశ మందిరంలో జరిగింది. ప్రభుత్వ పథకాల అమలు, జిల్లా అభివృద్ధి, సమన్వయం, పర్యవేక్షణపై చర్చించింది. కన్వీనర్, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ పథకాలపై పూర్తిస్థాయిలో పర్యవేక్షణ కోసం ‘దిశ’ కమిటీ ఏర్పాటైందన్నారు. విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశాలను గతంలో ఐదుసార్లు నిర్వహించామన్నారు. ‘‘ఆ సమావేశాల్లో చర్చకు వచ్చిన పలు అంశాలపై అధికారులు ‘మమ’ అనిపించారు. ఎన్నిసార్లు చెప్పినా ఎలాంటి ప్రయోజనం కనిపించలేదు. కొన్నిసార్లు అధికారులను మందలించాం. వ్యక్తిగతంగా చిన్నచూపు చూడాలని ఎవరికీ ఉండదు. ప్రజల కోసం పని చేయాల్సిందే’’ అని అన్నారు. కేంద్రం నుంచి వచ్ని నిధుల వినియోగాన్ని ఈ కమిటీ పర్యవేక్షిస్తుందన్నారు. ఎజెండా అంశాలను మీటింగ్ సమయంలో ఇస్తే ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు.
మహబూబాబాద్ ఎంపీ, కమిటీ కోకన్వీనర్ సీతారాం నాయక్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ పథకాలపై అధికారులకు పూర్తి అవగాహన ఉండాలన్నారు. ఈ పథకాలలోని అన్ని అంశాలను తెలుగులో పొందుపర్చాలన్నారు. కొత్తగూడెం–హైదరాబాద్ మధ్య నేరుగా 220 కిలోమీటర్ల రహదారి నిర్మాణానికి ప్రభుత్వం ఆమోదం తెలిపినట్టు చెప్పారు.
ముందుగా కలెక్టర్ లోకేష్‌కుమార్ మాట్లాడుతూ.. విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ స్థానంలో దిశ కమిటీని కేంద్ర ప్రభుత్వం రూపొందించిందన్నారు. దీని సభ్యులను నామినేట్ చేయాల్సుంటుందన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుపై ఈ కమిటీ పూర్తిస్థాయిలో చర్చిస్తుందన్నారు. అనంతరం, అంశాల వారీగా అధికారుల పరిచయ కార్యక్రమం నిర్వహించారు. దీనికి కొత్తగూడెం మున్సిపల్ కమిషనర్ గైర్హాజరవడంపై ఎంపీ పొంగులేటి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక నుంచి జిల్లా అధికారులు సమీక్ష సమావేశానికి హాజరుకావాల్సిందేనన్నారు. గైర్హాజరైతే చర్యలు ఉంటాయని హెచ్చరించారు. రైతులను తీవ్రంగా కొన్ని బ్యాంకులు ఇబ్బందులపాలు చేస్తున్న నేపథ్యంలో బ్యాంకర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించాలని ఎల్డీఎం శ్రీనివాస్‌కు, విద్యుత్ కోత నివారణకు చర్యలు తీసుకోవాలని ట్రాన్స్‌కో అధికారులకు ఎంపీ సూచించారు. ఆరు నుంచి పదోతరగతి వరకు విద్యార్థులకు బల్లలు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని, ఇందుకు అవసరమైతే తమ నిధులు ఇస్తామని డీఈఓతో చెప్పారు. కొన్ని పాఠశాలల్లో మరుగుదొడ్లు లేవని, వీటి నిర్మాణానికి ఎన్నేళ్లు పడుతుందని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీ, ఎస్సీ హాస్టళ్లలో సరైన భోజనం పెట్టేందుకు అవసరమైన నిధులు వెంటనే అందించాలని కలెక్టర్‌ను కోరారు. ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజనపై రైతులకు అవగహన కల్పించాలన్నారు. ప్రజాప్రతినిధులకు తెలియకుండా కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపితే సహించేది లేదని హెచ్చరించారు.
జెడ్పీ చైర్పర్సన్ గడిపల్లి కవిత, ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు, తాటి వెంకటేశ్వర్లు, కోరం కనకయ్య, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మినారాయణ, మేయర్ డాక్టర్ పాపాలాల్, జాయింట్ కలెక్టర్ దివ్య, ఐటీడీఏ పీఓ రాజీవ్‌గాంధీ హన్మంతు, జెడ్పీ సీఈఓ మారుపాకనాగేశ్, డీఆర్డీఏ పీడీ మురళీధర్‌రావు తదితరులు పాల్గొన్నారు.