Sidhi district
-
ఒకరి ఆస్తి 660కోట్లు మరొకరి ఆస్తి రూ.1,823
ఎన్నికలంటేనే కోట్ల రూపాయల వ్యవహారంగా మారిన ఈ రోజుల్లో పట్టుమని పదివేలు కూడా లేకుండా ఎన్నికల బరిలో దిగడం సాహసమే అనాలి. లేదా తెలివి తక్కువతనమనాలి. మధ్య ప్రదేశ్ నుంచి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న వారిలో ఇలాంటి నిరుపేదలు ఉన్నారని ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం(ఏడీఆర్) విశ్లేషణలో తేలింది.ఈ ఎన్నికల్లో కోటీశ్వరులతో పాటు పేదలు, నిరక్షరాస్యులు కూడా పోటీ చేస్తున్నారు. సిద్ధి లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంటుగా పోటీ చేస్తున్న లలన్ కుమార్ ఆస్తి కేవలం 1,823 రూపాయలు. రాష్ట్రం నుంచి పోటీ చేస్తున్న 104 మందిలో ఈయనే కడు పేదవాడని ఏడీఆర్ పేర్కొంది. అలాగే,ఇక్కడ నుంచే బరిలో దిగిన మరో ఇండిపెండెంట్ అభ్యర్థి రాం సహాయ్ ఆస్తి 6,134 రూపాయలు. కాగా జబల్పూర్ అభ్యర్థి ధనుక్ పరిస్థితి వీరిద్దరికంటే కొంచెం మెరుగు.ఆయన ఆస్తి విలువ 10,300 రూపాయలు. ఇక కోటీశ్వరుల విషయానికి వస్తే, చింద్వారా కాంగ్రెస్ అభ్యర్థి నకుల్ నాథ్(సీఎం కమల్‌నాథ్ కుమారుడు) ఆస్తి 660 కోట్లు. జబల్పూర్ నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ తన్ఖా 66 కోట్ల ఆస్తిపరుడు. సిద్ధి కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ సింగ్‌కు 37కోట్ల విలువైన ఆస్తిపాస్తులున్నాయని ఏడీఆర్ తెలిపింది.వివేక్ తన వార్షికాదాయం 11 కోట్ల రూపాయలని ఇన్‌కంట్యాక్స్ రిటర్న్స్‌లో పేర్కొంటే, నకుల్ 2 కోట్లుగా పేర్కొన్నారు. మొత్తం 104 మంది అభ్యర్థుల్లో 14శాతం మందిపై క్రిమినల్ కేసులున్నాయి. కాంగ్రెస్ అభ్యర్థుల్లో 17శాతం మంది తమపై క్రిమినల్ కేసులున్నాయని అఫిడవిట్లలో తెలిపారు. అభ్యర్థుల్లో 41 మంది డిగ్రీ ఆపై చదువులు చదివారు. 55 మంది 5 నుంచి 12వ తరగతి వరకు చదువుకున్నారు. ఇద్దరు అసలు చదువుకోలేదు. మరో నలుగురికి చదవడం, రాయడం వచ్చు. ఈసారి ఎన్నికల్లో అన్ని పార్టీలు ఎక్కువగా యువకులనే బరిలో దింపాయని ఏడీఆర్ తెలిపింది. మొత్తం అభ్యర్థుల్లో 60శాతం పాతిక నుంచి 50 ఏళ్ల లోపు వారే ఉన్నారు. మధ్యప్రదేశ్‌లోని ఆరు లోక్‌సభ స్థానాలకు(షాదోల్, సిద్ధి, జబల్పూర్, మాండ్లా, బాలాఘాట్, చింద్వారా)కు ఏప్రిల్ 29న పోలింగు జరుగుతుంది. -
సీఎం వాహనంపై రాళ్ల దాడి
సిద్ధి(మధ్యప్రదేశ్): మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ వాహనంపై రాళ్ల దాడి జరిగింది. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో శివరాజ్‌సింగ్ జన ఆశీర్వాద యాత్ర పేరుతో రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా ఆయన ఆదివారం సిద్ధి జిల్లాలోని చుర్హట్లో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. ఈ సమయంలో కొందరు దుండగులు ఆయన వాహనంపై రాళ్లతో దాడి చేశారు. అంతేకాకుండా ఆయనకు వ్యతిరేకంగా నల్లజెండాలను ప్రదర్శించారు. ఈ ఘటనపై చుర్హట్ పోలీస్ అధికారి బాబు చౌదరి మాట్లాడుతూ.. ఈ ప్రమాదంలో శివరాజ్‌సింగ్‌కు ఎటువంటి గాయాలు కాలేదని తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి ఇతర విషయాలు వెల్లడించటానికి ఆయన ఆసక్తి కనబరచలేదు. శివరాజ్ సింగ్ వాహనంపై దాడి జరిగిన చుర్హట్ ప్రాంతం ప్రతిపక్షనేత, కాంగ్రెస్ ఎమ్మెల్యే అజయ్ సింగ్ నియోజకవర్గంలో ఉందని మధ్యప్రదేశ్ బీజేపీ అధికార ప్రతినిధి రాజ్నీశ్ అగర్వాల్ తెలిపారు. ఈ దాడి కాంగ్రెస్ నేతలు చేసిందేనని ఆరోపించారు. తన బహిరంగ సభ అనంతరం శివరాజ్ సింగ్ మాట్లాడుతూ.. అజయ్ సింగ్‌కు ధైర్యం ఉంటే బహిరంగంగా తలపడాలని సవాలు విసిరారు. తను శారీరకంగా బలహీనుడైనప్పటికీ.. రాష్ట్ర ప్రజలు తన వెంట ఉన్నారని పేర్కొన్నారు. కాగా ఈ దాడితో తనకు గానీ, కాంగ్రెస్ పార్టీకి గానీ ఎటువంటి సంబంధం లేదని అజయ్ సింగ్ తెలిపారు. తమ పార్టీ ఇలాంటి హింసాత్మక చర్యలకు పాల్పడదని పేర్కొన్నారు. ఈ దాడి వెనుక కుట్ర ఉండవచ్చనే అనుమానం వ్యక్తం చేశారు. తనను, చుర్హట్ ప్రజలను చెడ్డవారిగా చిత్రీకరించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందన్నారు. -
ఒకటే స్కూల్... ఆరు ఆత్మహత్యలు!
భోపాల్: మధ్యప్రదేశ్ లో ఒకే ప్రభుత్వ పాఠశాలకు చెందిన విద్యార్థినులు వరుసగా ఆత్మహత్యలకు పాల్పడడం చర్చనీయాంశంగా మారింది. సిద్ధి జిల్లాలోని సాఫీ ఉన్నత మాధ్యమిక పాఠశాలకు చెందిన ఆరుగురు విద్యార్థినులు మూడు వారాల వ్యవధిలో బలవన్మరణాలకు పాల్పడ్డారు. ఎటువంటి సూసైడ్ నోట్ రాసిపెట్టకుండా ఈ ఆరుగురు ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నారు. సిద్ధి జిల్లా కేంద్రానికి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ పాఠశాలలో వివిధ గ్రామాలకు చెందిన విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. విద్యార్థినుల ఆత్మహత్యలతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. తమ పిల్లలను బడికి పంపేందుకు జంకుతున్నారు. మానసిక కుంగుబాటు కారణంగానే విద్యార్థినులు ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీసులు భావిస్తున్నారు. బలవన్మరణాలకు పాల్పడిన బాలికలు తొమ్మిది నుంచి 11వ తరగతులు చదువుతున్నారని పోలీసులు తెలిపారు. చివరిగా గాజ్ రాహి గ్రామానికి చెందిన రాణి యాదవ్ అనే 14 ఏళ్ల బాలిక మార్చి 9న ఆత్మహత్య చేసుకుంది. మార్చి 5న ఆకాంక్ష శుక్లా(17), దీనికి మూడు రోజుల ముందు అమృత గుప్తా(18), ఫిబ్రవరి 27న అనిత సాహు(16) బలవన్మరణాలకు పాల్పడ్డారు. విద్యార్థినుల ఆత్మహత్యలకు గల కారణాలు తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. -
బస్సులోంచి బయటకు లాక్కెళ్లి...
భోపాల్: నడుస్తున్న బస్సులోంచి యువతిని బయటకు లాగి దారుణంగా పొడిచి చంపిన ఘటన మధ్యప్రదేశ్ లోని సిద్ధి జిల్లాలో చోటు చేసుకుంది. మాడ్వాస్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గోట్రా గ్రామంలో జరిగిన ఘటన స్థానికంగా సంచలనం రేపింది. డిగ్రీ విద్యార్థిని సంజూ(18)ను నిందితుడు శివేంద్ర సింగ్ అలియాస్ శిబ్బు పొడిచి చంపాడు. కాలేజీ నుంచి ఇంటికి తిరిగి వస్తున్న సంజూను బస్సులోంచి దౌర్జన్యంగా బయటకు లాక్కొచ్చి ఈ దురాగతానికి పాల్పడ్డాడు. అడ్డుకోబోయిన బస్సు కండక్టర్ ను కూడా అతడు కత్తితో పొడిచాడు. ఎవరైన తనను అడ్డుకుంటే పెట్రోల్ పోసి బస్సను తగలబెడతానని ప్రయాణికులను శిబ్బు బెదిరించాడని పోలీసులు తెలిపారు. పలుమార్లుకత్తితో పొడవడంతో సంజూ ఘటనా స్థలంలోనే ప్రాణాలు విడిచిందని చెప్పారు. నిందితుడు పరారీలో ఉన్నాడని, అతడిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని పోలీసులు తెలిపారు. కొద్దిరోజులుగా సంజూను శిబ్బు వేధిస్తున్నాడని మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపారు. నిందితుడిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ సంజూ మృతదేహంతో ధర్నాకు దిగారు.