ఒకటే స్కూల్... ఆరు ఆత్మహత్యలు!
భోపాల్: మధ్యప్రదేశ్ లో ఒకే ప్రభుత్వ పాఠశాలకు చెందిన విద్యార్థినులు వరుసగా ఆత్మహత్యలకు పాల్పడడం చర్చనీయాంశంగా మారింది. సిద్ధి జిల్లాలోని సాఫీ ఉన్నత మాధ్యమిక పాఠశాలకు చెందిన ఆరుగురు విద్యార్థినులు మూడు వారాల వ్యవధిలో బలవన్మరణాలకు పాల్పడ్డారు. ఎటువంటి సూసైడ్ నోట్ రాసిపెట్టకుండా ఈ ఆరుగురు ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నారు.
సిద్ధి జిల్లా కేంద్రానికి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ పాఠశాలలో వివిధ గ్రామాలకు చెందిన విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. విద్యార్థినుల ఆత్మహత్యలతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. తమ పిల్లలను బడికి పంపేందుకు జంకుతున్నారు. మానసిక కుంగుబాటు కారణంగానే విద్యార్థినులు ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీసులు భావిస్తున్నారు. బలవన్మరణాలకు పాల్పడిన బాలికలు తొమ్మిది నుంచి 11వ తరగతులు చదువుతున్నారని పోలీసులు తెలిపారు.
చివరిగా గాజ్ రాహి గ్రామానికి చెందిన రాణి యాదవ్ అనే 14 ఏళ్ల బాలిక మార్చి 9న ఆత్మహత్య చేసుకుంది. మార్చి 5న ఆకాంక్ష శుక్లా(17), దీనికి మూడు రోజుల ముందు అమృత గుప్తా(18), ఫిబ్రవరి 27న అనిత సాహు(16) బలవన్మరణాలకు పాల్పడ్డారు. విద్యార్థినుల ఆత్మహత్యలకు గల కారణాలు తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.