ఎస్‌ఐఎఫ్‌టీ ఆక్వా ల్యాబ్‌కు అంతర్జాతీయ గుర్తింపు
సాక్షి, అమరావతి: రాష్ట్ర మత్స్య సాంకేతిక పరిజ్ఞాన సంస్థ (స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిషరీస్ టెక్నాలజీ (ఎస్‌ఐఎఫ్‌టీ) కాకినాడ)కు మరో అరుదైన గౌరవం దక్కింది. ఎస్‌ఐఎఫ్‌టీలోని ఆక్వా లేబొరేటరీకి అంతర్జాతీయ గుర్తింపు లభించింది. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఆక్వా ల్యాబ్‌ల నైపుణ్యతను పరీక్షించేందుకు అమెరికాకు చెందిన ఆరిజోనా యూనివర్సిటీ నిర్వహించే రింగ్ టెస్ట్‌లో ఎస్‌ఐఎఫ్‌టీ అత్యుత్తమ ప్రతిభను కనబర్చింది.
ఇందులో 14 దేశాలకు చెందిన 29 ఆక్వా ల్యాబ్‌లతో పాటు భారత్ తరఫున ఎస్‌ఐఎఫ్‌టీ ఆక్వా ల్యాబ్ పాల్గొంది. రొయ్యలలో తెల్లమచ్చల వ్యాధి, ఎంట్రోసైటోజూన్ హైపాటోపెనై (ఈహెచ్‌పీ) వ్యాధి కారకాలను నిర్ణీత కాలవ్యవధిలో అత్యంత సమర్థవంతంగా పరీక్షించి గుర్తించగలగడంతో ఎస్‌ఐఎఫ్‌టీలోని ఆక్వా ల్యాబ్ విజయం సాధించింది. ల్యాబ్, పరీక్షల నిర్వహణ, వ్యాధి కారకాల గుర్తింపులో అంతర్జాతీయ ప్రమాణాలు పాటిస్తున్న ల్యాబ్‌గా ఎస్‌ఐఎఫ్‌టీ ల్యాబ్‌ను ఆరిజోనా యూనివర్సిటీ గుర్తించింది.
అంతర్జాతీయ ప్రమాణాలతో 61 పరీక్షలు
2001లో కాకినాడ ఎస్‌ఐఎఫ్‌టీలో ఏర్పాటైన రియల్ టైం పాలీమరేస్ చైన్ రియాక్షన్ (ఆర్టీపీసీఆర్) ఆక్వా ల్యాబ్‌కు 2017లో ఐఎస్ఓ సర్టిఫికేషన్ రాగా, గతేడాది బోర్డ్ ఆఫ్ క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో పనిచేసే నేషనల్ అక్రిడిటేషన్ బోర్డు లిమిటెడ్ (ఎన్ఏబీఎల్) గుర్తింపు కూడా లభించింది. ఇక్కడ అంతర్జాతీయ ప్రమాణాలతో 61 రకాల పరీక్షలు చేస్తుంటారు.
రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆక్వా కల్చర్ యాక్ట్ (అప్సడా) నియమావళి ప్రకారం వివిధ రకాల మేతలు, సీడ్ నాణ్యతలను పరీక్షించి ధృవీకరించేందుకు ఎస్‌ఐఎఫ్‌టీ ఆక్వాకల్చర్ ల్యాబ్ రాష్ట్ర రిఫరల్ ల్యాబ్‌గా పనిచేస్తోంది. అలాగే, నాణ్యమైన ఆక్వా ఉత్పత్తులు సాధించడమే లక్ష్యంగా రూ.50.30 కోట్ల అంచనా వ్యయంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న ఎనిమిది ఆక్వా ల్యాబ్స్‌ను ఆధునీకరించడంతోపాటు కొత్తగా 27 ఇంటిగ్రేటెడ్ ఆక్వా ల్యాబ్స్‌ను ఏర్పాటుచేస్తోంది. 35 ల్యాబ్‌లలో స్థానిక అవసరాలను బట్టి 14 చోట్ల మేతల నాణ్యత విశ్లేషణ, 17 చోట్ల పీసీఆర్, 14 చోట్ల క్వాలిటీ కంట్రోల్æ పరీక్షలు చేసేందుకు ఏర్పాట్లుచేశారు.
ఆక్వా రైతులు వినియోగించుకోవాలి
ఎన్ఏబీఎల్ గుర్తింపు పొందిన ఎస్‌ఐఎఫ్‌టీ ఆక్వా ల్యాబ్‌ను ఆరిజోనా యూనివర్సిటీ కూడా గుర్తించడం ద్వారా మన ల్యాబ్ అంతర్జాతీయ ప్రమాణాలు కల్గిన ల్యాబ్‌గా ఖ్యాతిని గడించింది. ఆక్వా రైతులు, హేచరీలు ఈ ల్యాబ్ సేవలను సద్వినియోగం చేసుకుని సుస్థిర సాగుతో పాటు అధిక దిగుబడులు సాధించేందుకు కృషిచేయాలి.
– పి.కోటేశ్వరరావు, ప్రిన్సిపల్, ఎస్‌ఐఎఫ్‌టీ