కాంబో బ్రెయిడ్
సిగ సింగారం
ఇది కాంబో బ్రెయిడ్. ఇందులో రెండు రకాల జడలు వేసుకోవాలి. ఒకటి ఫ్రెంచ్ బ్రెయిడ్.. రెండోది ఫిష్‌టెయిల్ (వాడుకలో నాలుగుపాయలు/ ఈత పాయల జడ అంటారు) బ్రెయిడ్. ఈ హెయిర్ స్టయిల్‌ను చూస్తే... వేసుకోవడం చాలా కష్టంగా అనిపించొచ్చు. కానీ దీన్ని చాలా సింపుల్‌గా వేసుకోవచ్చు. ఈ స్టయిల్‌ను ఒత్తు జుత్తు గల పిల్లలకు వేస్తే... భలేగా ఉంటుంది. యువత కూడా ఈ కాంబో బ్రెయిడ్ను పంజాబీ డ్రెస్, జీన్స్‌ల మీదకు వేసుకోవచ్చు. మరి ఇంకేం.. ఈ హెయిర్ స్టయిల్‌ను మీరూ ట్రై చేయండి.
1. ముందుగా జుత్తును చిక్కులు లేకుండా దువ్వుకోవాలి. తర్వాత ఫొటోలో కనిపిస్తున్న విధంగా జుత్తును రెండు భాగాలుగా చేసుకోవాలి.
2. నుదురు పై ఉన్న జుత్తు భాగానికి ఏదైనా బ్యాండ్ లేదా క్లిప్ పెట్టుకోవాలి. ఆ మిగిలిన భాగాన్ని మూడు భాగాలుగా చేసుకొని ఎడమ చెవి వైపు నుంచి కుడివైపుకు కొద్దిగా అల్లాలి. తర్వాత రెండువైపుల నుంచి ఒక్కో పాయను తీసుకొని జడలో అల్లుకుంటూ పోవాలి.
3. మొత్తం జుత్తును అల్లుకొని, చివర కాస్త వదిలేసి బ్యాండు పెట్టుకోవచ్చు.
4. ఇప్పుడు నుదురు పైన భాగంలో ఉన్న జుత్తును రెండు పాయలుగా చేసుకొని... ఒక్కో అల్లికకు ఒక్కో పెద్దపాయల నుంచి సన్నని పాయను తీసి కలుపుతూ అల్లుకోవాలి. ఈ జడను కుడిచెవివైపుకు అల్లి బ్యాండు పెట్టుకోవాలి.
5. ఆ అల్లిన జడను ఎడమవైపుకు తీసుకెళ్లి, ఫొటోలో కనిపిస్తున్న విధంగా ఫ్రెంచ్ బ్రెయిడ్లో పై నుంచి కిందివైపుకు తీయాలి.
6. తర్వాత బయటికి కనిపిస్తున్న చిన్న పోనీని, అందులోనే దూర్చి స్లైడ్ పెట్టేయాలి.
7. ఫొటోలో కనిపిస్తున్న విధంగా ఒక్కో పాయను కదిలిస్తూ రెండు జడలనూ వదులు చేసుకోవాలి.
8. చివరగా నుదురు భాగంలో, కొన్ని వెంట్రుకలను బయటికి తీయాలి. ఆ ముంగురులతో మీ సిగ సోయగం మరింత పెరుగుతుంది.