నాడి చూసే నాథుడే లేడు..
జి.సిగడాం(శ్రీకాకుళం): శ్రీకాకుళం జిల్లా జి. సిగడాం మండల కేంద్రంలోని ఆస్పత్రి రోగులకు అక్కరకు రాకుండా పోతోంది. వర్షాల కారణంగా వ్యాపించే డయేరియా, విషజ్వరాలతో పాటు పాముకాటు, కుక్క కాటు వంటి పేషెంట్లకు నాడిపట్టి చూసి మందులు ఇచ్చే నాథుడు కరువుయ్యాడు. మండలం పరిధిలో ఉన్న 31 గ్రామ పంచాయితీలకు ఒకే ఒక్క ఆసుపత్రి. దీనికి తోడు వైద్యులను ప్రభుత్వం నియమించక పోవడంతో రోగులు నానా ఇబ్బందులు పడుతన్నారు. ఈ ఆరోగ్యకేంద్రం పరిధిలో 10 సబ్ సెంటర్లు, 106 గ్రామాలు.. సుమారుగా 65 వేల జనాబా కలిగిన మండలం అయినా ఆరోగ్య కేంద్రంలో వైద్యులు లేకపోవడంతో రోగులు నానా ఇబ్బందులు పడుతున్నారు, గ్రామానికి శివారులో ఉన్న శ్మశానవాటిక వద్ద ఉన్న ఈ ఆస్పత్రిలో రాత్రి సమయాల్లో సంబందిత స్టాఫ్ నర్స్లు ఉంటున్నారు. కానీ వీరికి సరైన రక్షణ లేకపొవడంతో నానా ఇబ్బందులు పడుతన్నారు.
ప్రస్తుతం ప్రభుత్వం ఇద్దరు వైద్యులను నియమించగా వారు ఉన్నత చదువులకు సెలవులపై వెళ్లారు. దీంతో రోగులు నానా అవస్థలు పడుతున్నారు. ఈ 24గంటల ఆసుపత్రికి ప్రతిరోజు సుమారుగా వంద నుంచి 150 మంది వరకు ఓపీ వస్తుంది. వీటిని చూసే నాథుడులేక సిబ్బంది.. స్టాఫ్ నర్స్ పనులు చేసి మందులు అందిస్తున్నారు. వైద్యాధికారులు లేకపొవడంతో సిబ్బంది వారి ఇష్టానుసారంగా విధులకు హజరవుతున్నారు.