Signature Bank
-
సిలికాన్ వ్యాలీ బ్యాంక్ ఖాతాదారులకు భారీ ఊరట!
సిలికాన్ వ్యాలీ బ్యాంకు ఖాతాదారులకు ఊరట లభించింది. ఎఫ్‌డీఐసీ నియంత్రణలో ఉన్న సిలికాన్ వ్యాలీ బ్యాంక్ ఆస్తులు, డిపాజిట్లను ఫస్ట్ సిటిజన్స్ బ్యాంక్ కొనుగోలు చేసింది. శకునాలు చెప్పే బల్లి కుడితిలో పడినట్లుగా తయారైంది అమెరికా ఆర్థిక పరిస్థితి. యావత్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థను శాసించే అమెరికా సంక్షోభంలో చిక్కుకుంది. ప్రపంచ దేశాల్లో అత్యధిక కోవిడ్ మరణాల నమోదుతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది. కరోనా తగ్గుముఖం పట్టడంతో కుదుట పడింది. అంతలోనే బ్యాంకుల దివాలా రూపంలో అనుకోని ఉపద్రవం వచ్చిపడింది. ద్రవ్యోల్బణాన్ని తట్టుకునేందుకు అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ గత ఏడాది కాలంలో తొమ్మిది సార్లు (మార్చి 22 నాటికి ) వడ్డీ రేట్లు పెంచింది. దీంతో వడ్డీ రేట్ల పెంపుతో సిలికాన్ వ్యాలీ బ్యాంక్ (ఎస్వీబీ), సిగ్నేచర్ బ్యాంకులకు నష్టాలు చుట్టుముట్టడంతో ఫెడరల్ డిపాజిట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎఫ్‌డీఐసీ) రంగంలోకి దిగింది. ఆ రెండు బ్యాంకులను మూసివేసి తన నియంత్రణలోకి తీసుకుంది. ఈ తరుణంలో సిలికాన్ వ్యాలీ బ్యాంక్ చెందిన డిపాజిట్లు, రుణాలను ఫస్ట్ సిటిజన్స్ బ్యాంక్ కొనుగోలు చేసింది. తద్వారా నేటి నుంచి ఎస్వీబీ డిపాజిటర్లంతా ఫస్ట్ సిటిజన్ బ్యాంక్ ఖాతాదారులుగా మారనున్నారు. కాగా, ఎఫ్‌డీఐసీ నియంత్రణలో ఉన్న సిలికాన్ వ్యాలీ బ్యాంక్‌కు 2023 మార్చి 10 నాటికి 167 బిలియన్ డాలర్ల ఆస్తులు, 119 బిలియన్ డాలర్ల డిపాజిట్లు ఉన్నాయి. తాజా కొనుగోలులో 72 బిలియన్ డాలర్ల ఆస్తులను 16.5 బిలియన్ డాలర్ల రాయితీతో ఫస్ట్ సిటిజిన్ బ్యాంక్ సొంతం చేసుకుంది. -
బ్యాంకింగ్ మ్యూచువల్ ఫండ్స్‌కు నష్టాలు
న్యూఢిల్లీ: అమెరికా బ్యాంకుల సంక్షోభం మన దేశంలో బ్యాంకింగ్ స్టాక్స్‌పై ప్రభావం చూపిస్తోంది. ఫలితంగా బ్యాంకింగ్ స్టాక్స్‌లో పెట్టుబడులు పెట్టే పథకాల విలువ గత వారంలో సుమారు 6 శాతం క్షీణించింది. అమెరికాలో సిలికాన్ వ్యాలీ బ్యాంక్ కుప్పకూలిపోవడం, ఆ తర్వాత సిగ్నేచర్ బ్యాంక్ కూడా సంక్షోభంలో పడిపోవడం.. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సేవల రంగంపై ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీసేలా చేసింది. స్విట్జర్లాండ్‌కు చెందిన క్రెడిట్ సూసె సైతం నిధుల కటకటను ఎదుర్కోగా.. ఏకంగా ఆ దేశ కేంద్రబ్యాంక్ జోక్యం చేసుకుని నిధులు సమకూరుస్తామని హామీ ఇవ్వా ల్సి వచ్చింది. ఈ పరిణామాలతో మన దేశ బ్యాంక్ స్టాక్స్ 3–13 శాతం మధ్యలో నష్టపోయాయి. ప్రభావం పెద్దగా ఉండదు.. కానీ విదేశాల్లో బ్యాంకుల సంక్షోభాల ప్రభావం నేరుగా మన బ్యాంకులపై ఏమీ ఉండదని నిపుణులు చెబుతున్నారు. బ్యాంకింగ్ రంగ మ్యూచువల్ ఫండ్స్‌లో 16 పథకాలు ఉంటే, ఇవన్నీ కూడా మార్చి 17తో ముగిసిన వారంలో 1.6–6 శాతం మధ్య నష్టాలను చూశాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు చూస్తే వీటిల్లో నికర నష్టం 8–10% మధ్య ఉంది. ఇలా నష్టపోయిన వాటిల్లో ఆదిత్య బిర్లా సన్‌లైఫ్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఫండ్, టాటా బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఫండ్, హెచ్డీఎఫ్సీ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఫండ్, ఎల్ఐసీ మ్యూచువల్ ఫండ్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఫండ్, నిప్పన్ ఇండియా బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఫండ్ ఉన్నాయి. అయితే, ఏడాది కాలంలో ఈ పథకా లు నికరంగా 12 శాతం రాబడిని ఇవ్వడం గమనించొచ్చు. ‘‘స్టాక్ మార్కెట్లలో అస్థిరతలు, వడ్డీ రేట్ల పెరుగుదల ఈ థీమ్యాటిక్ ఫండ్స్ నష్టపోవడానికి కారణాలుగా ఫయర్స్ రీసెర్చ్ హెడ్ గోపాల్ కావలిరెడ్డి తెలిపారు. వడ్డీ రేట్ల పెరుగుదల తర్వాత తక్కు వ వడ్డీ మార్జిన్లు, నిధుల వ్యయాలు పెరగడం, రుణాల వృద్ధిపై ప్రభావం పడినట్టు చెప్పారు. -
ఫ్లాగ్‌స్టార్ చేతికి సిగ్నేచర్ బ్యాంక్ డీల్ విలువ రూ. 22,300 కోట్లు
న్యూయార్క్: గత వారం మూతపడిన సిగ్నేచర్ బ్యాంకు మెజారిటీ ఆస్తుల కొనుగోలుకి న్యూయార్క్ కమ్యూనిటీ బ్యాంక్ అంగీకరించింది. డీల్ విలువ 2.7 బిలియన్ డాలర్లు (రూ. 22,300 కోట్లు)గా ఫెడరల్ డిపాజిట్ ఇన్సూరెన్స్ కార్ప్ (ఎఫ్‌డీఐసీ) వెల్లడించింది. ఇదీ చదవండి: రెండు నెలల్లో 6 ఐపివోలకు చెక్: లిస్ట్‌లో ఓయో, షాక్‌లో పేటీఎమ్ ఒప్పందంలో భాగంగా అనుబంధ సంస్థలలో ఒకటైన ఫ్లాగ్‌స్టార్ బ్యాంక్ ద్వారా సిగ్నేచర్ బ్యాంకుకు చెందిన 38.4 బిలియన్ డాలర్ల ఆస్తులను న్యూయార్క్ కమ్యూనిటీ కొనుగోలు చేయనుంది. ఇవి సిగ్నేచర్ ఆస్తులలో ముప్పావు వంతుకాగా.. సోమవారం(20) నుంచి సిగ్నేచర్‌కు చెందిన 40 బ్రాంచీలు ఫ్లాగ్‌స్టార్ నిర్వహణలోకి వస్తాయి. సిగ్నేచర్‌కు చెందిన 60 బిలియన్ డాలర్ల రుణాలు రిసీవర్‌షిప్ (కస్టోడియన్) కింద ఉన్నట్లు ఎఫ్‌డీఐసీ పేర్కొంది. -
ఒక్క బ్యాంక్ కోసం ముందుకొచ్చిన 11 బ్యాంక్‌లు.. కారణం అదేనా
అమెరికాలో సిలికాన్ వ్యాలీ బ్యాంక్, సిగ్నేచర్ బ్యాంక్ మూసివేత తర్వాత మరిన్ని బ్యాంక్‌లు అదే దారిలో ఉన్నాయనే వార్తలు ఆగ్నికి ఆజ్యం పోసినట్లైంది. ఈ నేపథ్యంలో అమెరికాలో 11 బడా బ్యాంకులు ఏకతాటిపైకి వచ్చాయి. మరో భారీ సంక్షోభం రాకుండా పతనం అంచుల్లో ఉన్న ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంక్‌ను ఆదుకునేందుకు 30 బిలియన్ డాలర్ల ప్యాకేజీని ప్రకటించాయి. డిసెంబరు 31 నాటికి ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంకులో 176.4 బిలియన్ డాలర్ల డిపాజిట్లు ఉన్నాయి. అయితే, కుప్పుకూలిపోతున్న బ్యాంకులు, విశ్లేషకుల అంచనాలు, ఇతర పరిణామాలతో ఖాతాదారులు ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంక్ నుంచి నగదును ఉపసంహరించుకుంటున్నారు. దీంతో సదరు బ్యాంక్‌లో నగదు సమస్య ఏర్పడి బ్యాంక్ దివాలా తీయొచ్చని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జేపీ మోర్గాన్ చేజ్, బ్యాంక్ ఆఫ్ అమెరికా, సిటీ గ్రూప్, వెల్స్ ఫార్గో, మోర్గాన్ స్టాన్లీ, గోల్డ్‌మన్ శాక్స్, బీఎన్వై మెలన్, స్టేట్ స్ట్రీట్, పీఎన్సీ బ్యాంక్, ట్రుయిస్ట్, యూఎస్ బ్యాంకులన్నీ ఏకమై ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంక్‌ను ఆదుకునేందుకు ముందుకు వచ్చాయి. ఖాతాదారులందరూ బిలియనీర్లే ఇక ఫస్ట్ రిపబ్లిక్లో ఎక్కువ మంది బిలియనీర్లే ఖాతాదారులుగా ఉన్నట్లు సమాచారం. వారిలో మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ సైతం ఈ బ్యాంకు నుంచి తనఖా రుణం తీసుకున్నట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ పేర్కొంది. -
వేలకోట్ల బ్యాంక్‌ను ముంచేసి..భార్యతో పారిపోయిన సీఈవో!
అమెరికా బ్యాకింగ్ రంగంలో సంక్షోభం నెలకొంది. రెండ్రోజుల వ్యవధిలో రెండు బ్యాంకులు మూతపడ్డాయి. ముందుగా సిలికాన్ వ్యాలీ బ్యాంక్ (ఎస్వీబీ) చేతులెత్తేస్తే..ఆ తర్వాత సిగ్నేచర్ బ్యాంక్ చాపచుట్టేసింది. దీంతో వేలాది కంపెనీలు, లక్షల మంది ఉద్యోగాలు ప్రమాదంలో పడ్డాయి. అయితే ఎస్వీబీ బ్యాంక్ మూసివేతతో ఆ సంస్థ మాజీ సీఈవో గ్రెగ్ బెకర్ భార్యతో కలిసి పారిపోయాడు. ప్రస్తుతం ఓ దీవిలో తన భార్యతో ఎంజాయి చేస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. భార్యతో కలిసి పారిపోయాడు న్యూయార్క్ పోస్ట్ కథనం ప్రకారం..ఎస్వీబీ దివాళాతో గ్రెగ్ బెక్, తన భార్య మార్లిన్ బటిస్టాతో కలిసి హవాయీ ఐస్లాండ్ దీవిలోని మాయి అనే ప్రాంత 3.1 బిలియ్ డాలర్ల విలువైన టౌన్ హౌస్‌కి పారిపోయాడు. గ్రెగ్ బెక్ దంపతులు సోమవారం శాన్ ఫ్రాన్సిస్కో విమానాశ్రయం నుంచి హవాయికి ఈ జంట ఫస్ట్ క్లాస్ విమానంలో హవాయీ వెళ్లారు. అక్కడ లిమో(limo ride) రైడ్ చేసినట్లు, లహైన (Lahaina) ప్రాంతంలో సేద తీరే ఫోటోలు వెలుగులోకి వచ్చాయి. ఎస్వీబీ దివాళాకు రెండు వారాల ముందు ఫెడరల్ రెగ్యులేటర్లు ఎస్వీబీని మూసివేయడానికి రెండు వారాల ముందు 3 మిలియన్ డాలర్ల విలువైన తన షేర్లను విక్రయించడం చర్చనీయాంశమైంది. దీనిపై ఇప్పుడు విచారణ ఎదుర్కొంటున్న సమయంలో భార్యతో కలిసి ఎంజాయ్ చేస్తున్న ఫోటోలు ప్రత్యక్షమవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది. లోన్ అధికారి నుంచి సీఈవోగా ఎస్వీబీ వెబ్సైట్ ప్రకారం..గ్రెగ్ బెక్ మూడు దశాబ్దాల క్రితం అంటే 1993లో సిలికాన్ వ్యాలీ బ్యాంకులో లోన్ అధికారిగా చేరారు. ఆ తర్వాత అంచలంచెలుగా ఎదుగుతూ ఇన్నోవేషన్ సెక్టార్లో సేవలందించే గ్లోబల్ కమర్షియల్ బ్యాంకింగ్, వెంచర్ క్యాపిటల్, క్రెడిట్ ఇన్వెస్టింగ్, ప్రైవేట్ బ్యాంకింగ్, వెల్త్ మేనేజ్మెంట్, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ విభాగాల్లో కీలక పాత్రపోషించారు. నష్టాలను పూడ్చుకునేందుకు ప్రయత్నించి అమెరికా శాంతాక్లారా కేంద్రంగా కార్యకలాపాలు సాగించే ఎస్వీబీ ఫైనాన్షియల్ గ్రూప్ అనుబంధ సంస్థే సిలికాన్ వ్యాలీ బ్యాంక్. అమెరికాలో 16వ అతిపెద్ద బ్యాంక్ ఇది. ఎస్వీబీ ఫైనాన్షియల్ గ్రూప్ తన పోర్ట్‌ఫోలియోలో నష్టాలను పూడ్చుకోవడం కోసం, ఆర్థికంగా బలోపేతం అయ్యేందుకు 21 బిలియన్ డాలర్ల సెక్యూరిటీలను, 2.25 బిలియన్ డాలర్ల వాటా విక్రయించేందుకు సిద్ధమైంది. అయితే ఊహించని విధంగా బ్యాంక్‌ను మూసేసింది. బ్యాంక్ సంక్షోభంతో ఎస్వీబీలో డిపాజిట్లు ఉన్న దాదాపు 10వేల టెక్నాలజీ కంపెనీలు..వచ్చే 30 రోజుల్లో తమ ఉద్యోగులకు జీతాలు చెల్లించడంలో విఫలమయ్యే అవకాశం నెలకొంది. లక్షకు పైగా ఉద్యోగాలపై ప్రతికూల ప్రభావం పడినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. -
ప్రమాదంలో మరో బ్యాంక్.. ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ రాబర్ట్ కియోసాకి ఆందోళన!
అమెరికాలో సిలికాన్ వ్యాలీ బ్యాంక్, సిగ్నేచర్ బ్యాంక్ పతనంతో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మార్కెట్లలో కలవరం మొదలైంది. 2008 తర్వాత ఈ స్థాయిలో బ్యాంకులు కుప్పకూలిపోవడంతో ఇన్వెస్టర్లు తమ డిపాజిట్లను తిరిగి వెనక్కి తీసుకుంటున్నారు. ఈ తరుణంలో అంతర్జాతీయ పెట్టుబడుల బ్యాంకింగ్ సంస్థ క్రెడిట్ సూయిస్ సైతం మూసివేసే పరిస్థితి నెలకొందంటూ ప్రముఖ రిచ్ డాడ్ పూర్ డాడ్ బుక్ రైటర్, వాల్ స్ట్రీట్ అనలిస్ట్ రాబర్ట్ కియోసాకి (Robert Kiyosaki) అభిప్రాయం వ్యక్తం చేశారు. 2008 అమెరికా బ్యాంకింగ్ రంగంలో అతిపెద్ద సంక్షోభం నెలకొంది. ఆ సంవత్సరం బ్యాంకింగ్ సంస్థ లెమాన్ బ్రదర్స్ దివాలా తీసింది. ఆ బ్యాంక్ పతనం కాబోతుందంటూ రాబర్ట్ కియోసాకి ముందే చెప్పారు. ఆయన చెప్పినట్లే జరిగింది. బ్యాంక్‌ను మూసివేయడం, అమెరికాతో సహా ప్రపంచం మొత్తం ఆర్థిక మాంద్యం ఏర్పడడం ఇలా అనిశ్చిలు ఒకేసారి జరిగాయి. ఇప్పుడు అదే తరహాలో క్రెడిట్ సూయిస్ సైతం చిన్నాభిన్నం కాబోతుందంటూ కియోసాకి చేసిన వ్యాఖ్యలతో ఇన్వెస్టర్లలో కలవరం మొదలైంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాండ్ మార్కెట్.. స్టాక్ మార్కెట్ కంటే చాలా పెద్దది. ఫెడ్ రేట్ల పెంపు, యుఎస్ డాలర్ క్షీణించడం వంటి అంశాల కారణంగా మార్కెట్లో ఆర్ధిక ఆనిశ్చితులు నెలకొన్నాయని కియోసాకి ఫాక్స్ న్యూస్ 'కావుటో : కోస్ట్ టు కోస్ట్' షోలో చెప్పారు. ప్రస్తుతం ప్రపంచంలో 8వ అతిపెద్ద పెట్టుబడి బ్యాంకు క్రెడిట్ సూయిస్ గురించి ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. మార్కెట్లో అస్థిరత సమయంలో, బంగారంలో పెట్టుడులు, కొనుగోలు చేయాలని సలహా ఇచ్చారు. -
Gold rate: భారీగా పెరిగిన బంగారం ధరలు
జాతీయ, అంతర్జాతీయ ప్రతికూల అంశాలు స్టాక్ మార్కెట్‌పై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. ఆ ప్రభావంతో మదుపర్లు పసిడిపై పెట్టుబడులు పెట్టేందుకు మక్కువ చూపుతున్నారు. దీంతో ఇటీవలే తగ్గినట్లే తగ్గిన పసిడి ధరలు మళ్లీ పరుగులు తీస్తున్నాయి. అమెరికాకు చెందిన సిలికాన్ వ్యాలీ బ్యాంక్ తోపాటు సిగ్నేచర్ బ్యాంక్ మూసివేత, అమెరికా డాలర్ విలువ పతనం అవ్వడం, ద్రవ్యోల్బణం కట్టడికి ఓ వైపు ఫెడ్ రేట్ల పెంపు వంటి పరిణామాలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బ తీస్తున్నాయి. ఫలితంగా ధరలు పెరుగుతున్నట్లు హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీ నివేదిక చెబుతుంది. ఇక తాజాగా మార్చి 13న ఢిల్లీ మార్కెట్లో బంగారం ధరలు 10 గ్రాములకు రూ. 970 పెరిగి రూ. 56,550కి చేరింది. విదేశీ మార్కెట్లలో బంగారం ఔన్స్‌కు 1,875 డాలర్లు, వెండి 20.75 వద్ద ట్రేడ్ జరిగినట్లు హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ కమోడిటీస్ సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ తెలిపారు. ఈ సందర్భంగా యూఎస్ ఎకమిక్ డేటా పాజిటివ్‌గా రావడం, డాలర్లో పతనం, 2008 ఆర్థిక సంక్షోభం తర్వాత అతిపెద్ద అమెరికా బ్యాంక్ వైఫల్యం కారణంగా బంగారం ధరలు ఐదు వారాల కంటే అత్యధికంగా పెరిగాయి. పెట్టుబడిదారులకు సురక్షితమైన పెట్టుబడి సాధనమైన బంగారం వైపు పెట్టుబడులు మరలిస్తున్నారు. ఈ కారణం వల్ల బంగారానికి ఒక్కసారిగా డిమాండ్ ఏర్పడిందని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కమోడిటీ రీసెర్చ్ నవనీత్ దమానీ చెప్పారు. -
సిగ్నేచర్ బ్యాంక్ మూత..ఈ గండం నుంచి ట్రంప్ గట్టెక్కిస్తారా?
తగినంతగా ఆదాయం లేకపోవడం, అప్పులు తీర్చే సామర్ధ్యం తగ్గి పోవడంతో రూ.17లక్షల కోట్లు (209 billion) ఆస్తులున్న సిలికాన్ వ్యాలీ బ్యాంక్ (svb) మూత పడడం ప్రపంచ దేశాల్లో కలవరం మొదలైంది. మూసివేతతో అమెరికాలో గత ఏడాది స్టాక్ మార్కెట్లోని లిస్టెడ్ కంపెనీలలో దాదాపు సగం టెక్నాలజీ, హెల్త్‌కేర్ స్టార్టప్‌లపై ప్రతికూల ప్రభావం ఉంటుందని పరిశ్రమల వర్గాలు చెబుతున్నాయి. తాజాగా ఎస్వీబీ దారిలో న్యూయార్క్‌కు చెందిన సిగ్నేచర్ బ్యాంక్‌ను సైతం షట్‌డౌన్ చేస్తున్నట్లు యూఎస్ రెగ్యులేటరీ ఫెడరల్ డిపాజిట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (fdic) తెలిపింది. దీంతో యూఎస్ బ్యాంకింగ్ చరిత్రలో 2వ అతిపెద్ద బ్యాంక్ పతనంగా నిలిచింది. ఖాతాదారులకు ఎఫ్‌డీఐసీ భరోసా కార్యకలాపాల్ని నిలిపివేస్తున్నట్లు చేసిన ప్రకటన అనంతరం సిగ్నేచర్ బ్యాంకును ఎఫ్‌డీఐసీ తన ఆదీనంలోకి తీసుకుంది. ఈ సందర్భంగా సిగ్నేచర్ బ్యాంక్, సిలికాన్ వ్యాలీ బ్యాంక్ డిపాజిటర్ల బాధ్యత తమదేనని, దివాళా నష్టం పన్ను చెల్లింపుదారులపై ప్రభావం చూపదని యూఎస్ ట్రెజరీ విభాగం, బ్యాంకు రెగ్యులేటర్ సంయుక్తంగా విడుదల చేసిన ప్రకటనలో తెలిపాయి. కాగా, న్యూయార్క్ ఫైనాన్షియల్ సర్వీస్ విభాగం లెక్కల ప్రకారం..గత ఏడాది ముగిసే సమయానికి ఆ బ్యాంకుకు మొత్తం 110.36 బిలియన్ డాలర్ల ఆస్తులు, 88.59 డిపాజిట్లు ఉన్నట్లు తెలుస్తోంది. న్యూయార్క్ కేంద్రంగా సిగ్నేచర్ బ్యాంక్ న్యూయార్క్ కేంద్రంగా బ్యాంకింగ్ సేవల్ని అందిస్తుంది. న్యూయార్క్, కనెక్టికట్, కాలిఫోర్నియా, నెవాడా, నార్త్ కరోలినాలో ప్రైవేట్ క్లయింట్ కార్యాలయాలతో కూడిన వాణిజ్య బ్యాంకు, రియల్ ఎస్టేట్, డిజిటల్ అసెట్ బ్యాంకింగ్‌తో సహా తొమ్మిది అంతర్జాతీయ వ్యాపారాల్లో భాగస్వామ్యంగా ఉంది.ఇప్పుడు మూసివేతతో ఆ బ్యాంక్ యాజమాన్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రక్షిస్తారేమోనని ఆశగా ఎదురు చూస్తోంది. సిగ్నేచర్ బ్యాంక్‌ను డొనాల్డ్ ట్రంప్ ఆదుకుంటారా? signature bank యాజమాన్యం డొనాల్డ్ ట్రంప్, ఆయన కుటుంబ సభ్యులతో సుదీర్ఘ కాలంగా మంచి సంబంధాలను కొనసాగిస్తూ వచ్చింది. ట్రంప్ వ్యాపారాలకు సంబంధించిన అకౌంట్స్ చూడడంతో పాటు అతని కుటుంబసభ్యులకు చెందిన వ్యాపారాల్లో పెట్టుబడులు సైతం పెట్టింది. కానీ 2021, జనవరి 6న అమెరికా క్యాపిటల్ హిల్ భవనంలోకి చొరబాట్లను ప్రేరేపించినందుకు డొనాల్డ్ ట్రంప్‌ను దూరం పెట్టింది. ఇప్పుడు రెగ్యులేటర్లు మూసి వేయడంతో సిగ్నేచర్ బ్యాంక్ సీఈవో జోసెఫ్ జె.డెపాలో (Joseph DePaolo) ట్రంప్ ఈ గండం నుంచి గట్టెక్కిస్తారేమోనని ఆశగా ఎదురు చూస్తున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి.