తగినంతగా ఆదాయం లేకపోవడం, అప్పులు తీర్చే సామర్ధ్యం తగ్గి పోవడంతో రూ.17లక్షల కోట్లు (209 billion) ఆస్తులున్న సిలికాన్ వ్యాలీ బ్యాంక్ (svb) మూత పడడం ప్రపంచ దేశాల్లో కలవరం మొదలైంది. మూసివేతతో అమెరికాలో గత ఏడాది స్టాక్ మార్కెట్‌లోని లిస్టెడ్ కంపెనీలలో దాదాపు సగం టెక్నాలజీ, హెల్త్‌కేర్ స్టార్టప్‌లపై ప్రతికూల ప్రభావం ఉంటుందని పరిశ్రమల వర్గాలు చెబుతున్నాయి.
తాజాగా ఎస్‌వీబీ దారిలో న్యూయార్క్‌కు చెందిన సిగ్నేచర్ బ్యాంక్‌ను సైతం షట్‌డౌన్ చేస్తున్నట్లు యూఎస్ రెగ్యులేటరీ ఫెడరల్ డిపాజిట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (fdic) తెలిపింది. దీంతో యూఎస్ బ్యాంకింగ్ చరిత్రలో 2వ అతిపెద్ద బ్యాంక్ పతనంగా నిలిచింది.
ఖాతాదారులకు ఎఫ్‌డీఐసీ భరోసా
కార్యకలాపాల్ని నిలిపివేస్తున్నట్లు చేసిన ప్రకటన అనంతరం సిగ్నేచర్ బ్యాంకును ఎఫ్‌డీఐసీ తన ఆదీనంలోకి తీసుకుంది. ఈ సందర్భంగా సిగ్నేచర్ బ్యాంక్, సిలికాన్ వ్యాలీ బ్యాంక్ డిపాజిటర్ల బాధ్యత తమదేనని, దివాళా నష్టం పన్ను చెల్లింపుదారులపై ప్రభావం చూపదని యూఎస్ ట్రెజరీ విభాగం, బ్యాంకు రెగ్యులేటర్ సంయుక్తంగా విడుదల చేసిన ప్రకటనలో తెలిపాయి. కాగా, న్యూయార్క్ ఫైనాన్షియల్ సర్వీస్ విభాగం లెక్కల ప్రకారం..గత ఏడాది ముగిసే సమయానికి ఆ బ్యాంకుకు మొత్తం 110.36 బిలియన్ డాలర్ల ఆస్తులు, 88.59 డిపాజిట్లు ఉన్నట్లు తెలుస్తోంది.
న్యూయార్క్ కేంద్రంగా
సిగ్నేచర్ బ్యాంక్ న్యూయార్క్ కేంద్రంగా బ్యాంకింగ్ సేవల్ని అందిస్తుంది. న్యూయార్క్, కనెక్టికట్, కాలిఫోర్నియా, నెవాడా, నార్త్ కరోలినాలో ప్రైవేట్ క్లయింట్ కార్యాలయాలతో కూడిన వాణిజ్య బ్యాంకు, రియల్ ఎస్టేట్, డిజిటల్ అసెట్ బ్యాంకింగ్‌తో సహా తొమ్మిది అంతర్జాతీయ వ్యాపారాల్లో భాగస్వామ్యంగా ఉంది.ఇప్పుడు మూసివేతతో ఆ బ్యాంక్ యాజమాన్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రక్షిస్తారేమోనని ఆశగా ఎదురు చూస్తోంది.
సిగ్నేచర్ బ్యాంక్‌ను డొనాల్డ్ ట్రంప్ ఆదుకుంటారా?
signature bank యాజమాన్యం డొనాల్డ్ ట్రంప్, ఆయన కుటుంబ సభ్యులతో సుదీర్ఘ కాలంగా మంచి సంబంధాలను కొనసాగిస్తూ వచ్చింది. ట్రంప్ వ్యాపారాలకు సంబంధించిన అకౌంట్స్ చూడడంతో పాటు అతని కుటుంబసభ్యులకు చెందిన వ్యాపారాల్లో పెట్టుబడులు సైతం పెట్టింది. కానీ 2021, జనవరి 6న అమెరికా క్యాపిటల్ హిల్ భవనంలోకి చొరబాట్లను ప్రేరేపించినందుకు డొనాల్డ్ ట్రంప్‌ను దూరం పెట్టింది. ఇప్పుడు రెగ్యులేటర్లు మూసి వేయడంతో సిగ్నేచర్ బ్యాంక్ సీఈవో జోసెఫ్ జె.డెపాలో (Joseph DePaolo) ట్రంప్ ఈ గండం నుంచి గట్టెక్కిస్తారేమోనని ఆశగా ఎదురు చూస్తున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి.
Comments
Please login to add a commentAdd a comment