గోమారంలో శృతిహాసన్ సందడి
శివ్వంపేట, న్యూస్‌లైన్:
మండల పరిధిలోని గోమారంలో హీరోయిన్ శృతిహాసన్ సందడి చేశారు. స్థానిక ఉన్నత పాఠశాల విద్యార్థులతో ముచ్చటించి వారిని ఉత్సాహపరిచారు. పీఅండ్‌జీ కంపెనీ ‘శిక్ష’ కార్యక్రమం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని పాఠశాలలను అభివృద్ధి చేస్తోంది. అందులో భాగంగా గోమారం ఉన్నత పాఠశాలలో మౌలిక వసతులతో పాటు క్రీడామైదానాన్ని అభివృద్ధి చేసేందకు సిద్ధమైంది. పీఅండ్‌జీ కంపెనీ ‘శిక్ష’ కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న శృతిహాసన్ మంగళవారం క్రీడామైదానానికి శంకుస్థాపన చేశారు. అనంతరం విద్యార్థులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ, ప్రతిఒక్కరూ చదువు కోవాలనే సంకల్పంతో పాఠశాలలో మౌలిక వసతుల కల్పన కోసం కృషి చేస్తున్న పీఅండ్‌జీ కంపెనీ ‘శిక్ష’ కార్యక్రమానికి ముగ్ధురాలినయ్యానన్నారు. శిక్ష ఆధ్వర్యంలో క్రీడామైదానాన్ని అభివృద్ధి చేయడంతో పాటు మరుగుదొడ్ల నిర్మించడం జరుగుతుందన్నారు.
వీటితో పాటు అసంపూర్తిగా ఉన్న పాఠశాల భవన నిర్మాణాలను సైతం పూర్తి చేస్తారన్నారు.
పీఅండ్‌జీ కంపెనీ తన ఉత్పాదనల ద్వారా వచ్చే కొంత ఆదాయాన్ని సామాజిక కార్యక్రమాలకు ఖర్చు చేయడంతో ఎంతో మందికి లబ్ధి జరుగుతుందన్నారు. అనంతరం విద్యార్థులకు క్రీడా పరికరాలను శృతిహాసన్ అందజేశారు. శృతిహాసన్‌ను చూసేందుకు వివిధ ప్రాంతాల నుంచి భారీగా అభిమానులు తరలివచ్చారు. కార్యక్రమంలో సర్పంచ్ చంద్రాగౌడ్, ఎంఈఓ భిక్షపతి, పీఅండ్‌జీ శిక్ష సభ్యులు, రౌండ్ టేబుల్ ఇండియా సభ్యులు గోవర్ధన్‌రావు, కిషోర్‌కుమార్, నవీన్ మాల్వే, రాహుల్‌బింద్రా, రాహుల్ మోహిరత్, గోవిందరాజన్ పాల్గొన్నారు.