వందరోజుల్లో పది పాసయ్యేనా!
కామారె డ్డి, న్యూస్‌లైన్: పదో తరగతి పరీక్షలకు గడువు దగ్గర పడుతోంది. ఈ విద్యాసంవత్సరం మార్చి 26 నుంచి నిర్వహించడానికి ప్రభుత్వం ఇప్పటికే షెడ్యూల్ కూడా ప్రకటించింది. మరోవైపు పాఠశాలల్లో సిలబ స్ పూర్తికాకపోవడం విద్యార్థుల ఉత్తీర్ణతపై ప్రభావం చూపే అవకా శం కనిపిస్తోంది. పరీక్షలకు వందరోజుల గడువు ఉన్నప్పటికీ సం క్రాంతి, క్రిస్మస్ పండుగల సెలవులు, ఆదివారాలు అన్ని కలిపితే 20 రోజులకు పైగా సెలవులు ఉన్నాయి. దీంతో విద్యాబోధనకు 75 రోజుల నుంచి 80 రోజుల గడువు మాత్రమే మిగలనుంది.
సిలబస్ పూర్తయ్యేదెన్నడో..
పరీక్షల గడువు దగ్గర పడుతున్నా చాలా పాఠశాలల్లో సిలబస్ 70 శాతం కూడా పూర్తికాలేదు. సిలబస్ పూర్తయ్యేదెన్నడో...ప్రిపేర్ అ య్యేదెన్నడోనని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో పదోతరగతి పరీక్షల ఉత్తీర్ణత శాతంలో అగ్రభాగాన ఉన్న జిల్లా ఏడాదికేడాది పడిపోయింది. 2008-09, 2009-10 ఈ రెండు విద్యాసంవత్సరాలు జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. 2010-11లో 10వ స్థానానికి, 2011-12, 2012-13లో 18వ స్థానానికి దిగజారిపోయింది.
అధికారులకే తెలియాలి..
జిల్లాలో 478 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో 35వేల మంది పదో తరగతి చదువుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో సబ్జెక్టు టీచర్ల కొరత ఉంది. ఇటీవల కొందరు సబ్జెక్టు టీచర్లను అవసరం ఉన్న చోటుకి డిప్యూటేషన్ చేశారు. అయినప్పటికీ సిలబస్ ఎప్పుడు పూర్తవుతుందో.. ఎప్పుడు ప్రిపేర్ అవుతారో అధికారులకే తెలియాలి. పరీక్షలకు గడువు సమీపిస్తున్న సమయంలో ఆదరాబాదరాగా పాఠాలు బోధించడం వల్ల విద్యార్థుల మెదడుకు ఎలా ఎక్కుతుందో, వారెలా చదువుతారోనని పలువురు పేర్కొంటున్నారు.
ముందస్తు ప్రణాళికాలోపం..
పదో తరగతి ఉత్తీర్ణతలో మొదటి స్థానంలో ఉన్న జిల్లా రెండేళ్లుగా 18వస్థానంతో సరిపెట్టుకోవడాన్ని జిల్లావాసులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఐదేళ్ల కాలంలో ఉత్తీర్ణత స్థాయి పడిపోవడం ఆందోళన కలిగిస్తోంది. అయినప్పటికీ జిల్లా యంత్రాంగం ముందస్తు ప్రణాళికలు చేపట్టడంలో విఫలమయ్యారనే ఆరోపణలున్నాయి. పాఠశాలలు తెరిచేనాటికి విద్యార్థులందరికీ పాఠ్యపుస్తకాలను అందించలేకపోయారు. ఇదే సమయంలో సబ్జెక్టు టీచర్ల కొరతతో చాలా ఉన్నత పాఠశాలల్లో బోధన సజావుగా సాగలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఉత్తీర్ణత శాతం పెరుగుతుందా.. ఈ ఏడాదీ జిల్లాస్థానం దిగజారాల్సిందేనా.. అన్నది ప్రశ్నార్థకంగా మారింది.