SiliconAndhra Mana Badi
-
సింగపూర్లో వైభవంగా మనబడి స్నాతకోత్సవం
ఎన్నో వైవిధ్యమైన కార్యక్రమాలతో నిరంతరం సింగపూర్ లోని తెలుగు వారి కోసం సేవ చేస్తున్న సింగపూర్ తెలుగు సమాజం వారి ఆద్వర్యంలో మనబడి తెలుగు విద్యార్థుల స్నాతకోత్సవ కార్యక్రమం జరిగింది. జ్యోతి ప్రజ్వలనతో ప్రారంబమైన కార్యక్రమం ఆద్యంతం ఆహ్లాదకరంగా జరిగింది.మెరీనా బే సాండ్స్ ఎగ్జిబిషన్ హాల్లో ఈ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. 2022-23, 2023-24 విద్యా సంవత్సరములలో ప్రవేశం, ప్రస్తుత తరగతుల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు తెలుగు సంప్రదాయం ఉట్టిపడేలా తెల్లటి పైకండువా కప్పి, మెడల్ తోపాటు సిలికానాంధ్ర, సింగపూర్ తెలుగు సమాజం స్నాతకోత్సవ ధృవపత్రాలను బహుకరించినట్లు కార్యక్రమ నిర్వాహకులు స్వామి గోపి కిషోర్ తెలిపారు. మంచి అభిరుచితో తెలుగు నేర్చుకుంటున్న విద్యార్థులను అభినందిస్తూ, మనబడి కార్యక్రమానికి సహకారం అందిస్తున్న ఉపాధ్యాయులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.సింగపూర్ తెలుగు సమాజం అధ్యక్షులు బొమ్మారెడ్డి శ్రీనివాస రెడ్డి ప్రారంభోన్యాసంలో ఈ తరం వారికి తెలుగు భాష అవసరాన్ని తెలుపుతూ అందరూ సమాజం సభ్యులుగా చేరి ఆ రకంగా తెలుగు సమాజం అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు.NRI ONE స్థిరాస్తి విక్రేతలు అందించిన సహకారంతో జరిగిన ఈ కార్యక్రమానికి, స్థానిక GIG అంతర్జాతీయ పాఠశాల ఎక్జిక్యూటివ్ డైరక్టర్ సాంబశివ రావు ముఖ్య అతిథి గా విచ్చేసి ఉపాధ్యాయులకు జ్ఞాపికను బహుకరించారు. ఈ సందర్భంగా సాంబశివరావు మాతృభాష ఉన్నతి కోసం కృషి చేస్తున్న సింగపూర్ తెలుగు సమాజం కార్యవర్గాన్ని, నిస్వార్ధంతో సేవ చేస్తున్న ఉపాధ్యాయులను అభినందిస్తూ భవిష్యత్తులో మనబడి కార్యక్రమానికి అవసరమైన సహాయ సహకారం అందిస్తామని పేర్కొన్నారు.తెలుగు బడి విద్యార్థులు ప్రదర్శించిన పద్య పఠనం, తెలుగు పాటలు, శాస్త్రీయ సంగీతం, నాట్య ప్రదర్శనలు ఆహుతులను అలరించాయి. ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించిన చాణక్య సభికులను ఆకట్టుకుంటూ కార్యక్రమం ఆద్యంతం క్రమపద్ధతిలో జరిగేలా సహకరించారు. ఈ సందర్భంగా జీఐజీ రావు గారికి, NRI ONE శేఖర్కి జ్ఞాపికను బహుకరించారు.అనంతరం సింగపూర్ తెలుగు సమాజం గౌరవ కార్యదర్శి అనిల్ కుమార్ పోలిశెట్టి వందన సమర్పణ చేస్తూ కార్యక్రమం విజయవంతం చేయటానికి సహకరించిన, విద్యార్థులకు, తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, NRI ONE వారికి, GIG రావుకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మనబడి కార్యక్రమాలను మరింత మంది ఉపయోగించుకుని తద్వారా మాతృభాష అభివృద్ధికి దోహదం చేయాలని కోరారు.ఉపాధ్యక్షులు పాలెపు మల్లికార్జున్, కురిచేటి జ్యోతీశ్వర్ కార్యక్రమానికి మొదటి నుండి సహకారం అందిస్తూ వెన్నంటి నిలిచారు. కార్యక్రంలో సింగపూర్ తెలుగు సమాజం కార్యవర్గం శ్రీనివాసరెడ్డి పుల్లన్నగారి, టేకూరి నాగేష్, కురిచేటి స్వాతి, వైదా మహేష్, కొత్త సుప్రియ పాల్గొని సహకారం అందించారు. ఉపాధ్యాయులు ప్రతిమ, దేదీప్య, శ్రీలక్ష్మి, కిరణ్ కుమార్, గోపి క్రిష్ణ, రంగనాధ్, గీత, శ్రీలత, విజయ వాణి విద్యార్థులకు ప్రశంస పత్రాలు అందచేసారు. ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా 200 మంది, పరోక్షంగా 4000 మంది వీక్షించినట్లు నిర్వహకులు తెలిపారు.(చదవండి: అయోవాలో ప్రారంభమైన నాట్స్ ప్రస్థానం) -
సిలికానాంధ్ర మనబడి విద్యాసంవత్సరం ప్రారంభం
కాలిఫోర్నియా : అమెరికాలోని 35 రాష్ట్రాలలో 260కి పైగా కేంద్రాల్లో, ప్రపంచ వ్యాప్తంగా 10కి పైగా ఇతర దేశాలలోనూ ప్రవాసాంధ్రుల పిల్లలకు తెలుగు భాషను నేర్పిస్తున్న సిలికానాంధ్ర మనబడి కొత్త విద్యా సంవత్సర తరగతులు ప్రారంభమయ్యాయి. ఈ విద్యా సంవత్సరంలో అత్యధిక సంఖ్యలో 10 వేల మందికి పైగా విద్యార్థులు నమోదు చేసుకున్నారు. తెలుగు విశ్వవిద్యాలయం గుర్తింపుతో పాటు, ప్రతిష్టాత్మక వాస్క్ అక్రిడిటేషన్, పలు స్కూల్ డిస్ట్రిక్ట్లలో ఫారిన్ లాంగ్వేజ్ గుర్తింపు లభించిన ఏకైక తెలుగు విద్యాలయం సిలికానాంధ్ర మనబడి అని మనబడి డీన్ రాజు చమర్తి పేర్కొన్నారు. గత పన్నెండేళ్ళలో మనబడి ద్వారా 45 వేల మందికి పైగా చిన్నారులకు తెలుగు నేర్పించామని, ఈ సంవత్సరవం 10వేలమందికి పైగా విద్యార్ధులు నమోదు చేసుకున్నారని ఆయన తెలిపారు. పిల్లలో పాఠాలపై ఆసక్తి పెంపొందించడాని ఈ సంవత్సరం మనబడి బాలరంజని అనే మొబైల్ యాప్ కూడా విడుదల చేశామని అధ్యక్షులు రాజు చమర్తి తెలిపారు. అమెరికా వ్యాప్తంగా 260కి పైగా ప్రాంతాలలో ప్రారంభమైన మనబడిలో తెలుగు భాష నేర్పించడం మాత్రమే కాకుండా, తెలుగు మాట్లాట(పోటీలు), బాలానందం(రేడియో కార్యక్రమం), తెలుగుకు పరుగు, పద్యనాటకం, నాటకోత్సవాలు, పిల్లల పండుగలు వంటి ఎన్నో వినూత్న కార్యక్రమాల నిర్వహణతో విద్యార్థులకు మన కళలు, సంప్రదాయాల పట్ల అవగాహన కలిగిస్తున్నామని మనబడి అభివృద్ధి, ప్రాచుర్యం విభాగం ఉపాధ్యక్షుడు శరత్ వేట తెలిపారు. సిలికానాంధ్ర మనబడి 2019- 2020 విద్యా సంవత్సరంలో ప్రవేశం కావాలనుకున్న వారు సెప్టెంబర్ 20వ తేదీలోగా manabadi.siliconandhra.org ద్వారా నమోదు చేసుకోవాలని, మరిన్ని వివరాలకు 1-844-626-2234 కు కాల్ చేయవచ్చని శరత్ వేట తెలిపారు. అమెరికాలో దేశవ్యాప్తంగా మనబడి నాయకత్వం, ప్రాంతీయ సమన్వయకర్తలు, మనబడి కేంద్ర సమన్వయకర్తలు, ఉపాధ్యాయులు, స్వఛ్చంద కార్యకర్తల సహకారంతో నూతన విద్యా సంవత్సర తరగతులు వైభవంగా ప్రారంభమయ్యాయని, మనబడి విజయాలకు కారణమైన విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, భాషా సైనికులందరికీ మనబడి సంచాలకులు ఫణిమాధవ్ కస్తూరి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. -
50వేల మైలురాయిని దాటిన సిలికానాంధ్ర మనబడి
డాలస్ : ప్రవాస బాలలకు తెలుగు నేర్పిస్తున్న సిలికానాంధ్ర మనబడి మరోసారి తన ప్రత్యేకత చాటుకుంది. గత 12 సంవత్సరాలుగా అమెరికాలోని 35 రాష్ట్రాల్లో 250 ప్రాంతాలతో పాటు మరో 10 దేశాలలో మనబడి ద్వారా తెలుగు భాష నేర్చుకుంటున్న విద్యార్ధుల సంఖ్య ఈ విద్యాసంవత్సరం నమోదు ప్రక్రియలో భాగంగా 50 వేల మైలు రాయిని దాటిందని సిలికానాంధ్ర మనబడి అధ్యక్షులు రాజు చమర్తి తెలిపారు. 2007 లో 300 మంది విద్యార్ధులతో ప్రారంభమై, తెలుగు విశ్వవిద్యాలయం సౌజన్యంతో పాఠ్యప్రణాళికను తయారుచేసుకుని, 4-6 సంవత్సరాల పిల్లలకోసం బాలబడి 6 సంవత్సరాల నుండి ప్రవేశం, ప్రసూనం, ప్రకాశం, ప్రమోదం, ప్రభాసం తరగతులను నిర్వహిస్తూ తెలుగు విశ్వవిద్యాలయం వారు పరీక్షలు నిర్వహించగా ఉత్తీర్ణులయిన వారికి యూనివర్సిటీ క్రెడిట్లతో కూడిన సర్టిఫికేట్లు అందించే ఏకైక విద్యాలయం మనబడి అని రాజు చమర్తి తెలిపారు. మనబడి 50వేలమంది విద్యార్ధులకు చేరిన నేపథ్యంలో 'పుష్కర కాలంలో అక్షర సైన్యం అర లక్ష' అనే నినాదంతో 2000 మందికి పైగా ఉన్న భాషా సేవకుల తరఫున తెలుగు భాషా సేవకు పునరంకితమౌతున్నామని, రేపటి తరానికి ప్రతినిధులైన ప్రవాస బాలలకు మన మాతృభాషతో పాటు, మన కళలు, సంస్కృతిని పరిచయంచేసే ఎన్నో కార్యక్రమాలతో రూపకల్పన చేశామని రాజు చమర్తి తెలిపారు. మనబడి ప్రాచుర్యం అభివృద్ది విభాగం ఉపాధ్యక్షులు శరత్ వేట మాట్లాడుతూ, అమెరికా వ్యాప్తంగా ఉన్న మనబడి కేంద్రాలన్నీ ప్రతిష్టాత్మక WASC (వెస్టర్న్ అసోసియేషన్ ఆఫ్ స్కూల్ అండ్ కాలేజెస్) సంస్థ నుండి అక్రిడిటేషన్ పొందాయన్నారు. అటువంటి అర్హత సాధించిన ఏకైక తెలుగు విద్యాలయం మనబడి మాత్రమేనని తెలిపారు. మనబడి విద్యావిధానం గురించి ఇప్పటికే భారత రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి వంటి ఎందరో ప్రముఖుల ప్రశంశలు పొందిందని చెప్పారు. విద్యార్ధుల తల్లితండ్రులు, ఉపాధ్యాయులు, భాషా సైనికుల అందిస్తున్న ప్రోత్సాహంతో ముందుకు సాగుతామని ఆయన తెలిపారు. సిలికానాంధ్ర మనబడి 2019-20 విద్యాసంవత్సరానికి అడ్మిషన్లు జరుగుతున్నాయని, ఈ విద్యాసంవత్సరం తరగతులు సెప్టెంబర్ 7 నుండి అమెరికా వ్యాప్తంగా 250 కి పైగా కేంద్రాలలో ప్రారంభమౌతున్నాయని, అగస్టు 31 లోగా నమోదు చేసుకోవాలనీ, నమోదు మరియు మరిన్ని వివరాల కొరకు manabadi.siliconandhra.org చూడవచ్చని, లేదా 1-844-626-(BADI) 2234 నంబరును సంప్రదించాలని సిలికానాంధ్ర ఉపాధ్యక్షులు ఫణిమాధవ్ కస్తూరి తెలిపారు. -
ఘనంగా సిలికానాంధ్ర మనబడి ‘పిల్లల పండుగ’
బఫెలో గ్రోవ్(చికాగో): సిలికానంధ్ర మనబడి వారు ‘భాషా సేవయే భావితరాల సేవ’ అనే నినాదం తో తెలుగు భాషని ఒక ప్రణాళికా బద్ధంగా నేర్పిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. పిల్లలు నేర్చుకున్న తెలుగుని మరియు వారిలో వున్న ప్రతిభా పాఠవాలను వెలికి తీసి ఉత్సాహ పరిచేందుకు సిలికానంధ్ర మనబడి ‘పిల్లల పండుగను’ ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా ఈ నెల 16న బఫెలో గ్రోవ్ కేంద్ర సమన్వయకర్త, ప్రచార అధిపతి డా. వెంకట్ గంగవరపు ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. విద్యార్థులు, తల్లిదండ్రులు, స్థానిక తెలుగువారు పెద్ద సంఖ్యలో కార్యక్రమానికి హాజరై విజయవంతం చేశారు. ఈ సందర్భంగా వెంకట్ గంగవరపు మాట్లాడుతూ అమెరికాలో 11,000 మంది పిల్లలు మనబడిలో తెలుగు నేర్చుకుంటున్నారని అందులో 210 మంది పిల్లలు బఫెలో గ్రోవ్ కేంద్రం లో నేర్చుకోవడం చాలా ఆనందం గా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో చిన్నారుల పద్యాలు, హాస్యనాటికలు, నీతి కథలు, సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించించాయి. అనంతరం విద్యార్థులు, వారి తల్లిదండ్రులు వారి అనుభవాలను పంచుకున్నారు. రజినీకాంత్ ఉన్నం, రమణి గోగుల, వెంకట్ పెరుగు, బాలగురువు మహిత చతుర్వేదుల వ్యాఖ్యాతలుగా వ్యవహరించిన ఈ కార్యక్రమం ఆద్యంతం ఆసక్తికరంగా, ఉత్సాహభరితంగా సాగింది. స్థానిక 7స్పైసెస్ అచ్చమైన తెలుగు వంటకాలతో శ్రోతలకు పసందైన విందును వడ్డించారు. ఈ కార్యక్రమానికి సహకరించిన నిర్వాహకులు డా. రమణ మల్లాది, పావని గంగవరపు, నరేంద్ర గుడిపాటి, లోకేష్ కొసరాజు, ప్రతాప్ మేదరమెట్ట, దీప్తి ముసునూరి, మాధవి దొనపాటి, శ్రీనివాస్ ఇవటూరి, ప్రతాప్ మేదరమెట్ట, శ్రీనాథ్ గోగినేని, మురళి శేషం, యోగేష్ తోట, రాజా దండు, అనిల్ పేరిన, కృష్ణ మొవ్వ, సాయి సుందరి, చంద్ర పెండ్యాల, తదితరులకు వెంకట్ గంగవరపు కృతజ్ఞతలు తెలిపారు. -
ఘనంగా మనబడి స్నాతకోత్సవం
క్యాలిఫోర్నియా : సిలికానాంధ్ర మనబడి స్నాతకోత్సవాలు అత్యంత ఘనంగా జరిగాయి. అమెరికాలో క్యాలిఫోర్నియా నగరంలోని ఇండియన్ కమ్యూనిటీ సెంటర్లో శుక్రవారం మనబడి సంస్థ నిర్వహకులు ఈ కార్యక్రమాన్ని జరిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన తెలుగు యూనివర్శిటీ ఉపాధ్యక్షులు ఆచార్య ఎస్వీ సత్యనాయరణ చేతుల మీదుగా పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంతో మనబడి కలిసి నిర్వహించిన జూనియర్, సీనియర్ సర్టిఫికేట్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన 300 మంది విద్యార్థులకు ద్రువీకరణ పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వేలమైళ్ల దూరంలో ఉన్నా, మాతృభాషపై మమకారంతో తెలుగు భాష నేర్చుకుంటున్న చిన్నారులను, వారిని ప్రోత్సహస్తున్న తల్లిదండ్రులను అభినందించారు. మనబడి అధ్యక్షుడు రాజు చమర్తి మాట్లాడుతూ.. మొత్తం 1857 మంది విద్యార్థులుకు గాను 1830 మంది ఉత్తీర్ణత సాధించినట్టు తెలిపారు. అందులో 68.6 శాతం మంది డిస్టింక్షన్లో, 20.4 శాతం మంది ఫస్ట్ క్లాస్లో ఉత్తీర్ణత సాధించారని అన్నారు. మిగతా విద్యార్థులకు డాల్లస్, చికాగో, అట్లాంటా, వర్జీనియా, న్యూజెర్సీ నగరాలలో జరగనున్న మనబడి స్నాతకోత్సవాలలో ఎస్వీ సత్యనారయణ చేతుల మీదుగా అందజేయనున్నట్టు తెలపారు. పరీక్షల నిర్వహణలో సహకరించిన వారందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. 2018-19 విద్యాసంవత్సరానికి గాను నమోదు కార్యక్రమం ప్రారంభమైనట్లు వెల్లడించారు. విద్యార్థులు మనబడి వెబ్సైట్ ద్వారా ఆగస్టు 30వ తేది లోగా నమోదు చేసుకోవచ్చని తెలిపారు. సిలికానాంధ్ర సంస్థాపక అధ్యక్షుడు ఆనంద్ కూచిబొట్ల మాట్లాడుతూ.. కేజీ నుంచి పీజీ దాకా విద్యాబోధనే ధ్యేయంగా ఏర్పాటు చేసిన మనబడి, సిలికానాంధ్రకు తెలుగు విశ్వవిద్యాలయం తోడు కావడం సంతోషకరమైన విషయమన్నారు. భారత్లో నిర్మిస్తున్న సిలికానాంధ్ర సంజీవని ఆసుపత్రి కార్యాచరణను ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మనబడి ఉపాధ్యక్షుడు దీనబాబు కొండుభట్ల, తెలుగు యూనివర్శిటీ అధికారులు ఆచార్య రమేష్ భట్టు, ఆచార్య రెడ్డి శ్యామల, డా.గీతా వాణి, సిలికానాంధ్ర ఉపాధ్యక్షుడు దిలీప్ కొండిపర్తి, శాంతి కూచిబొట్ల, శ్రీదేవి గంటి, మనబడి బృంద సభ్యులు శ్రీరాం కోట్ని, శిరీష చమర్తి, శ్రీవల్లి కొండుభట్ల, కృష్ణ జయంతి, సాయి కందుల, లక్ష్మి యనమండ్ర తదితరులు పాల్గొన్నారు. -
ప్రపంచ వ్యాప్తంగా మనబడి తెలుగు పరీక్షలు
అమెరికా : సిలికానాంధ్ర మనబడి ద్వారా తెలుగు భాష సర్టిఫికెట్ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులకు పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ వారు ఈ నెల 12న పరీక్ష నిర్విహించారు. 2017-18 విద్యా సంవత్సారానికి గాను 1933 మంది విద్యార్థులు, ప్రపంచ వ్యాప్తంగా 58 కేంద్రాల్లో పరీక్షలు రాశారు. దీనిలో 1400 మంది జూనియర్, 533 మంది సీనియర్ సర్టిఫికెట్ కోసం పరీక్షలు రాశారు. ఈ సందర్భంగా విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ అలేఖ్య పుంజల మాట్లాడుతూ.. ఎన్నో వేల మైళ్ల దూరంలో ఉన్నా పిల్లలకు తెలుగు భాష నేర్పించటానికి కృషి చేస్తున్న తల్లిదండ్రులను అభినందనలు తెలిపారు. మనబడి అధ్యక్షుడు రాజు చమర్తి మాట్లాడుతూ.. గత 10 ఏళ్లుగా 35 వేల మందికి పైగా బాలబాలికలు మనబడి ద్వారా తెలుగు నేర్చుకున్నారని తెలిపారు. 250 కేంద్రాల ద్వారా తెలుగు నేర్పిస్తున్న మనబడి విద్యావిధానానికి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం గుర్తింపుతో పాటు, అమెరికలోని అనేక స్కూల్ డిస్ట్రిక్ట్లలో ఫారిన్ లాంగ్వేజ్ క్రెడిట్ అర్హత కూడా ఉందన్నారు. అంతే కాకుండా వెస్టెన్ అసోసియేషన్ ఆఫ్ స్కూల్స్ అండ్ కాలేజ్స్ గుర్తింపు పొందిన ఏకైక తెలుగు నేర్పే విద్యావిధానం మనబడి మాత్రమేనని తెలిపారు. అయితే ఈ పరీక్ష నిర్వహణను పర్యవేక్షించడానికి పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ రిజిస్ట్రార్ అలేఖ్య, పరీక్షల నియంత్రణాధికారి రెడ్డి శ్యామల, మండలి వెంకట కృష్ణారావు, అంతర్జాతీయ తెలుగు కేంద్ర సంచాలకులు శ్రీమతి గీతావాణి, ఆచార్య రమేశ్ భట్టు, ఆచార్య యెండ్లూరి సుధాకర్ రావు లు హైదరాబాద్ నుంచి వచ్చారు. 2018-19 సంవత్సరానికి గాను అడ్మిషన్స్ ప్రారంభమైనట్టు మనబడి ఉపాధ్యక్షుడు దీనబాబు కొండుభట్ల తెలిపారు. మనబడి వెబ్సైట్ ద్వారా ఆగస్టు 31లోగా నమోదు చేసుకోవాలని సూచించారు. పరీక్షల నిర్వాహణలో మనబడి సభ్యులు శాంతి కూచిబొట్ల, డాంజి తోటపల్లి, శరత్ వేట, శ్రీదేవి గంటి, భాస్కర్ రాయవరంతో పాటు మనబడి సమన్వయకర్తలు, ఉపాధ్యాయులు పాల్తొన్నారు. పరీక్షలను విజయవంతంగా నిర్వహించడంలో సహకరించిన వారందరిని భాషాసైనికులుగా అభివర్ణిస్తూ మనబడి ఉపాధ్యక్షుడు ధన్యవాదాలు తెలిపారు. -
సిలికానాంధ్ర మనబడికి ‘వాస్క్’ గుర్తింపు
సాక్షి, హైదరాబాద్: అమెరికాలో 35 రాష్ట్రాలతోపాటు మరో 12 దేశాల్లో తెలుగులో వారాంతపు బోధనా తరగతులు నిర్వహిస్తున్న ‘సిలికానాంధ్ర మనబడి’కి ప్రతిష్టాత్మక ‘వాస్క్’ (వెస్ట్రన్ అసోసియేషన్ ఆఫ్ స్కూల్స్ అండ్ కాలేజెస్) గుర్తింపు లభించింది. ఈ మేరకు మనబడి సంచాలకులు శ్రీదేవి గంటి ప్రకటన విడుదల చేశారు. వాస్క్ గుర్తింపు కోసం మనబడి డీన్ రాజు చమర్తి నాయకత్వంలో దాదాపు 18 నెలలుగా అహర్నిశలూ పనిచేసినట్లు తెలిపారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని కాలిఫోర్నియాలోని శాన్హోస్ నగరంలోగల పార్క్సైడ్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భారత్ నుంచి ముఖ్య అతిథులుగా పద్మభూషణ్ అవార్డు గ్రహీత యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, సాక్షి ఎడిటోరియల్ డెరైక్టర్ కె. రామచంద్రమూర్తి, జగన్ బుద్ధవరపు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన వాస్క్ సంచాలకులు డాక్టర్ జింజర్ హన్నిక్ మాట్లాడుతూ ‘మనబడి’లో తెలుగు నేర్చుకున్న విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల అభిరుచి తనను ఎంతో ఆకట్టుకుందన్నారు. కార్యక్రమంలో మనబడి సభ్యులు ఆనంద్ కూచిభొట్ల, దీనబాబు కొండుభట్ల, దిలీప్ కొండిపర్తి, భాస్కర్ రాయవరం, సంజీవ్ తనుగుల, ప్రభ మాలెంపాటి, శాంతి కూచిభొట్ల తదితరులు పాల్గొన్నారు.