కాలిఫోర్నియా : అమెరికాలోని 35 రాష్ట్రాలలో 260కి పైగా కేంద్రాల్లో, ప్రపంచ వ్యాప్తంగా 10కి పైగా ఇతర దేశాలలోనూ ప్రవాసాంధ్రుల పిల్లలకు తెలుగు భాషను నేర్పిస్తున్న సిలికానాంధ్ర మనబడి కొత్త విద్యా సంవత్సర తరగతులు ప్రారంభమయ్యాయి. ఈ విద్యా సంవత్సరంలో అత్యధిక సంఖ్యలో 10 వేల మందికి పైగా విద్యార్థులు నమోదు చేసుకున్నారు. తెలుగు విశ్వవిద్యాలయం గుర్తింపుతో పాటు, ప్రతిష్టాత్మక వాస్క్ అక్రిడిటేషన్, పలు స్కూల్ డిస్ట్రిక్ట్‌లలో ఫారిన్ లాంగ్వేజ్ గుర్తింపు లభించిన ఏకైక తెలుగు విద్యాలయం సిలికానాంధ్ర మనబడి అని మనబడి డీన్ రాజు చమర్తి పేర్కొన్నారు. గత పన్నెండేళ్ళలో మనబడి ద్వారా 45 వేల మందికి పైగా చిన్నారులకు తెలుగు నేర్పించామని, ఈ సంవత్సరవం 10వేలమందికి పైగా విద్యార్ధులు నమోదు చేసుకున్నారని ఆయన తెలిపారు. పిల్లలో పాఠాలపై ఆసక్తి పెంపొందించడాని ఈ సంవత్సరం మనబడి బాలరంజని అనే మొబైల్ యాప్ కూడా విడుదల చేశామని అధ్యక్షులు రాజు చమర్తి తెలిపారు.
అమెరికా వ్యాప్తంగా 260కి పైగా ప్రాంతాలలో ప్రారంభమైన మనబడిలో తెలుగు భాష నేర్పించడం మాత్రమే కాకుండా, తెలుగు మాట్లాట(పోటీలు), బాలానందం(రేడియో కార్యక్రమం), తెలుగుకు పరుగు, పద్యనాటకం, నాటకోత్సవాలు, పిల్లల పండుగలు వంటి ఎన్నో వినూత్న కార్యక్రమాల నిర్వహణతో విద్యార్థులకు మన కళలు, సంప్రదాయాల పట్ల అవగాహన కలిగిస్తున్నామని మనబడి అభివృద్ధి, ప్రాచుర్యం విభాగం ఉపాధ్యక్షుడు శరత్ వేట తెలిపారు. సిలికానాంధ్ర మనబడి 2019- 2020 విద్యా సంవత్సరంలో ప్రవేశం కావాలనుకున్న వారు సెప్టెంబర్ 20వ తేదీలోగా manabadi.siliconandhra.org ద్వారా నమోదు చేసుకోవాలని, మరిన్ని వివరాలకు 1-844-626-2234 కు కాల్ చేయవచ్చని శరత్ వేట తెలిపారు. అమెరికాలో దేశవ్యాప్తంగా మనబడి నాయకత్వం, ప్రాంతీయ సమన్వయకర్తలు, మనబడి కేంద్ర సమన్వయకర్తలు, ఉపాధ్యాయులు, స్వఛ్చంద కార్యకర్తల సహకారంతో నూతన విద్యా సంవత్సర తరగతులు వైభవంగా ప్రారంభమయ్యాయని, మనబడి విజయాలకు కారణమైన విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, భాషా సైనికులందరికీ మనబడి సంచాలకులు ఫణిమాధవ్ కస్తూరి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
Comments
Please login to add a commentAdd a comment