బఫెలో గ్రోవ్(చికాగో): సిలికానంధ్ర మనబడి వారు ‘భాషా సేవయే భావితరాల సేవ’ అనే నినాదం తో తెలుగు భాషని ఒక ప్రణాళికా బద్ధంగా నేర్పిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. పిల్లలు నేర్చుకున్న తెలుగుని మరియు వారిలో వున్న ప్రతిభా పాఠవాలను వెలికి తీసి ఉత్సాహ పరిచేందుకు సిలికానంధ్ర మనబడి ‘పిల్లల పండుగను’ ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా ఈ నెల 16న బఫెలో గ్రోవ్ కేంద్ర సమన్వయకర్త, ప్రచార అధిపతి డా. వెంకట్ గంగవరపు ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. విద్యార్థులు, తల్లిదండ్రులు, స్థానిక తెలుగువారు పెద్ద సంఖ్యలో కార్యక్రమానికి హాజరై విజయవంతం చేశారు.
ఈ సందర్భంగా వెంకట్ గంగవరపు మాట్లాడుతూ అమెరికాలో 11,000 మంది పిల్లలు మనబడిలో తెలుగు నేర్చుకుంటున్నారని అందులో 210 మంది పిల్లలు బఫెలో గ్రోవ్ కేంద్రం లో నేర్చుకోవడం చాలా ఆనందం గా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో చిన్నారుల పద్యాలు, హాస్యనాటికలు, నీతి కథలు, సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించించాయి. అనంతరం విద్యార్థులు, వారి తల్లిదండ్రులు వారి అనుభవాలను పంచుకున్నారు. రజినీకాంత్ ఉన్నం, రమణి గోగుల, వెంకట్ పెరుగు, బాలగురువు మహిత చతుర్వేదుల వ్యాఖ్యాతలుగా వ్యవహరించిన ఈ కార్యక్రమం ఆద్యంతం ఆసక్తికరంగా, ఉత్సాహభరితంగా సాగింది. స్థానిక 7స్పైసెస్ అచ్చమైన తెలుగు వంటకాలతో శ్రోతలకు పసందైన విందును వడ్డించారు.
ఈ కార్యక్రమానికి సహకరించిన నిర్వాహకులు డా. రమణ మల్లాది, పావని గంగవరపు, నరేంద్ర గుడిపాటి, లోకేష్ కొసరాజు, ప్రతాప్ మేదరమెట్ట, దీప్తి ముసునూరి, మాధవి దొనపాటి, శ్రీనివాస్ ఇవటూరి, ప్రతాప్ మేదరమెట్ట, శ్రీనాథ్ గోగినేని, మురళి శేషం, యోగేష్ తోట, రాజా దండు, అనిల్ పేరిన, కృష్ణ మొవ్వ, సాయి సుందరి, చంద్ర పెండ్యాల, తదితరులకు వెంకట్ గంగవరపు కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment