చేనేతకు ‘చంద్ర’గ్రహణం
మాఫీకాని రుణాలు రూ.20 కోట్లు
ఆరు నెలలుగా అందని సిల్క్ సబ్సిడీ
కూలి పనులకు వెళ్తున్న నేతన్నలు
అధికారంలోకి వచ్చాక అన్ని వర్గాలకూ చుక్కలు చూపిస్తున్న చంద్రబాబు.. ఇప్పుడు నేతన్నలనూ వదిలిపెట్ట లేదు. చేనేత రంగానికి కనీస స్థాయిలో ప్రోత్సాహకాలు ఇవ్వడం లేదు. పదవిలోకి వచ్చి ఏదాదిన్నర కాలం పూర్తయినా చేనేత రుణమాఫీ పూర్తి స్థాయిలో అమలు కాలేదు. బకాయిలు పేరుకుపోయి.. దిక్కుతోచని స్థితిలో నేతన్నలు ప్రత్యామ్నామార్గాలను ఎంచుకుంటున్నారు.
మదనపల్లె సిటీ: ఇది ఒక వెంకటరమణ, సుబ్రమణ్యంకే జిల్లాలోని చేనేత కార్మికుల పరిస్థితి. రుణమాఫీ అవుతుందని ఆశలు పెట్టుకున్న నేతన్నల్లో నిరాశే మిగిలింది. చేనేత రుణమాఫీ ఇదిగో ఇస్తాం.. అదిగో ఇస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటనలకే పరిమితమైంది. బ్యాంకుల్లో కొత్త రుణాలు అందక నేతన్నలు సతమతమవుతున్నారు. కుటుంబ పోషణ కోసం వారు కుల వృత్తిని వదిలి కూలికి పోవాల్సిన దుస్థితి ఏర్పడింది.
జిల్లాలోదాదాపు 42 వేల మంది చేనేత కార్మికులు ఉన్నారు. మదనపల్లె(నీరుగట్టువారిపల్లె), కలకడ, కలికిరి, సత్యవేడు,రొంపిచెర్ల, నగిరి, పుత్తూరు, వరదయ్యపాళ్యం, బి.కొత్తకోట, కురబలకోట, శ్రీకాళహస్తి, తంబళ్లపల్లె, నిమ్మనపల్లెలలో అధికంగా చేనేతలు ఉన్నారు. ఓ వైపు ప్రభుత్వం ప్రోత్సాహం లేకపోవడం, మరో వైపు చేనేత వస్త్రాలకు రోజు రోజుకు ఆదరణ తగ్గడంతో మగ్గాలు మూలపడుతున్నాయి. కుల వృత్తే ఆధారంగా జీవించిన నేతన్నలు ప్రస్తుతం రోడ్డున పడ్డారు. చేనేతలకు సంబంధించిన రుణమాఫీపై స్పష్టత రాకపోవడంతో జిల్లాలో దాదాపు రూ.20 కోట్లు రుణాలు మాఫీకి నోచుకోలేదు. జీవో ఎప్పుడు వస్తుందా? రుణాలు ఎప్పుడు మాఫీ అవుతాయా? అని చేనేతలు ఎదురు చూస్తున్నారు. కొత్త రుణాల కోసం బ్యాంకర్లు ఆశ్రయిస్తే పాత అప్పులు కడితే కొత్త అప్పులు ఇస్తామని చెబుతున్నారు. చేనేతలకు సంబంధించి సిల్క్‌పై ప్రభుత్వం అందిస్తున్న సబ్బిడీ ఆరు నెలలుగా అందడం లేదు. ఒకొక్కరికి నెలకు రూ.600 ప్రకారం ఆరు నెలలగా ఇవ్వాల్సి ఉంది.
నిలిచిపోయిన నగదు రహిత వైద్యం..
అతి తక్కువ ప్రీమియంతో చేనేత కార్మికులకు అందుతున్న నగదు రహిత వైద్యం (క్యాష్‌లెస్) ఈ ఏడాది ప్రారంభం నుంచి నిలిచిపోయింది. 2014 డిసెంబర్ వరకు చేనేత కార్మికులకు ఏడాదికి రూ.100, ప్రభుత్వం రూ.370 కడితే ఒకే కుటుంబంలో 80 సంవత్సరాల లోపు వయసున్న నలుగురు వ్యక్తులకు ఐసీఐసీఐ లంబార్డ్ బీమా కంపెనీ క్యాష్‌లెస్ వైద్యాన్ని అందించేది. అవుట్ పేషంట్లకు రూ.15 వేలు, ఇన్ పేషంట్లకు రూ.7500 సంబంధిత బీమా కంపెనీ ఆయా ఆస్పత్రులకు చెల్లించేది. అయితే ఈ ఏడాది ప్రారంభం నుంచి ఈ వైద్యం ఆగిపోయింది. దీని స్థానంలో రాష్ట్ర స్వస్థ బీమా యోజన ద్వారా రూ.35 వేల వరకు చేనేతలకు వైద్య ఖర్చును అందిస్తామని ప్రభుత్వం జారీ చేసిన ప్రకటన నేటికి నెరవేరలేదు.