వారం వారం వెండి అక్రమ రవాణా
నరసాపురం టు అమలాపురం
ప్రతి గురువారం తరలింపు
పట్టుబడ్డ రూ.15 లక్షల విలువైన 34 కిలోల వెండి
పోలీసుల అదుపులో ముగ్గురు యువకులు
నగదు, కారు స్వాధీనం
అమలాపురం టౌన్ :
ప్రభుత్వానికి ఎటువంటి పన్నులు చెల్లించకుండా వెండి ఆభరణాలను అక్రమంగా రవాణా చేస్తున్న ఓ ముఠా గుట్టు రట్టయింది. ప్రతి గురువారం ఈ ముఠా పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం నుంచి అమలాపురానికి వెండి వస్తువులను రవాణా చేస్తుంటుంది. ఆ క్రమంలో ఓ ఖరీదైన కారులో ముగ్గురు వ్యక్తులతోపాటు అక్రమంగా రవాణా అవుతున్న 34 కిలోల వెండి వస్తువులను వాహనాల తనిఖీల్లో గురువారం సాయంత్రం పోలీసులు పట్టుకున్నారు. పట్టణ సీఐ వైఆర్కే శ్రీనివాస్ ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది అమలాపురం బస్స్టేçÙన్ వద్ద తనిఖీలు చేస్తుండగా ఈ అక్రమ రవాణా బండారం బయట పడింది. వారంవారం నరసాపురం నుంచి వెండి అక్రమ రవాణా జరుగుతున్నట్టు ఇప్పటికే పట్టణ పోలీసులకు సమాచారం ఉంది. దాంతో ఆ కోణంలో గత రెండు గురువారాల్లో పోలీసులు తనిఖీలు చేశారు. అయితే ఈ సారి వారు పట్టుబడ్డారు. ఈ తనిఖీల్లో కారు సీట్లు వెనుక ఉన్న రహస్య అరల్లో 34 కిలోల వెండి వస్తువులు దొరికాయి. వాటిలో వెండిపట్టాలు, లక్ష్మీదేవి విగ్రహాలు, హారతి ప్రమిదలు ఉన్నాయి. మూడు కిలోల వంతున ఈ వస్తువులతో ఉన్న ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.15 లక్షలు ఉంటుందన్నారు. అక్రమ రవాణాకు ఉపయోగించిన ఖరీదైన కారు, రూ.1.30 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. అక్రమ రవాణా చేస్తున్న నరసాపురానికి చెందిన పరిమి రవిశంకర్, కవురు గోపాలకృష్ణ, వేండ్ర రామశంకర్ సిద్ధార్ధలను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అమలాపురం వాణిజ్య పన్నుల శాఖ డీసీటీవో కృష్ణ ప్రసాద్, ఏసీటీవో రామకృష్ణ పోలీసు స్టేషన్కు వచ్చి పోలీసులు స్వాధీనం చేసుకున్న వెండి వస్తువులను పరిశీలించారు. ఇవి ప్రభుత్వానికి పన్నులు చెల్లించకుండా ఎలాంటి బిల్లులు లేకుండా అక్రమంగా రవాణా చేస్తున్న వెండి వస్తువులుగా నిర్ధారించారు. వెండి వస్తువులపై ఒక శాతం పన్నులు చెల్లించాల్సి ఉందని డీసీటీఓ కృష్ణ ప్రసాద్ తెలిపారు. తాము అదుపులోకి తీసుకున్న ముగ్గురు యువకులను, స్వాధీనం చేసుకున్న వెండి వస్తువులు, నగదును సీఐ శ్రీనివాస్ వాణిజ్య పన్నుల అధికారులకు అప్పగించారు. నరసాపురానికి చెందిన ఓ బడా వెండి వ్యాపారి చురుకైన యువకులను గుమస్తాలుగా నియమించుకొని ఈ అక్రమ వ్యాపారాన్ని సాగిస్తున్నట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది.