Sim activation
-
నెంబర్ మీదే.. కానీ.. వాడేది కేటుగాళ్లు
సాక్షి, హైదరాబాద్: చీటికి మాటికీ మీ సిమ్ కార్డ్‌కు నెట్వర్క్ సమస్య వస్తోందా? ఫోన్ కాల్, మెసేజ్‌లు అస్సలు చేయలేకపోతున్నారా? ఉన్నట్టుండి అకస్మాత్తుగా మీ సిమ్ బ్లాక్ అయ్యిందా?.. అయితే మీరు సైబర్ నేరస్తుల వలలో పడినట్టే ! ఆలస్యం చేయకుండా వెంటనే మీ టెలికం సర్వీస్ ప్రొవైడర్‌ను సంప్రదించండి. ఎందుకంటే ఈమధ్య కాలంలో సైబర్ నేరస్తులు నకిలీ గుర్తింపు పత్రాలు సమర్పించి.. మీ నంబర్‌తో కొత్త సిమ్ కార్డ్‌లను పొందుతున్నారు. ఇటీవల సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ‘నకిలీ వేలి ముద్రలు’ కేసులో అరెస్ట్ చేసిన నిందితుల ముఠా సిమ్ కార్డ్‌లు, బ్యాంక్ ఖాతాలు సమీకరించింది ఇలాగే ! ప్రముఖ మొబైల్ నెట్వర్క్ ఆపరేటర్ల కస్టమర్ల ఫోన్ నెంబర్లను సైబర్ నేరస్తులు టార్గెట్ చేస్తున్నారు. నెట్వర్క్ సమస్యలు వస్తున్నాయని బాధితులు సర్వీస్ ప్రొవైడర్లకు ఫిర్యాదు చేస్తున్న సంఘటనలు ఈ మధ్య పెరిగిపోయాయి. నకిలీ గుర్తింపు కార్డ్‌లను సమర్పించడంతో సర్వీస్ ప్రొవైడర్ కొత్త సిమ్ కార్డ్ జారీ చేస్తున్నారు. దీంతో అసలు యజమాని మొబైల్లో ఉన్న సిమ్ కార్డ్ డీయాక్టివేట్ అవుతుంది. కొన్ని గంటల్లోనే నేరస్తుడి సెల్ఫోన్లో ఉన్న కొత్త సిమ్ కార్డ్ యాక్టివేట్ అవుతుంది. ఎలా చేస్తారంటే? కస్టమర్లు స్టోర్‌ను సందర్శించినప్పుడు పాయింట్ ఆఫ్ సేల్ (పీఓఎస్) ఏజెంట్ డిజిటల్ కేవైసీ (నో యువర్ కస్టమర్) ద్వారా సిమ్ కార్డ్‌ను యాక్టివేట్ చేస్తాడు. కానీ, డిజిటల్ కేవైసీ ఫెయిలయిందని కస్టమర్‌కు చెప్తాడు. తర్వాత ఈ–కేవైపీ పద్ధతి ద్వారా కస్టమర్ పేరు మీద మరొక సిమ్ కార్డ్‌ను యాక్టివేట్ చేస్తాడు. ఇలా ఒక్క కస్టమర్ పేరు మీదనే రెండు సిమ్ కార్డ్‌లను యాక్టివేట్ చేస్తారు. డిజిటల్ కేవైసీ ద్వారా యాక్టివేట్ చేసిన సిమ్ కార్డ్ కస్టమర్‌కు, ఈ–కేవైసీ ద్వారా యాక్టివేట్ చేసిన సిమ్ కార్డ్‌ను నేరస్తులకు చేరవేస్తుంటారు. నకిలీ వేలి ముద్రల కేసులో ఒంగోలుకు చెందిన విశ్వనాథుల అనిల్ కుమార్ ఇలాగే కస్టమర్ల పేర్ల మీద 121 సిమ్ కార్డ్‌లను యాక్టివేట్ చేసి.. ఈ కేసులో ఏ–4 ఒంగోలుకు చెందిన దర్శనం సామేలు చేరవేశాడు. ఇతడు కమీషన్ రూపంలో ఈ సిమ్ కార్డ్‌లను ప్రధాన నిందితుడు వెంకటేశ్వర్లుకు సరఫరా చేశాడు. అకౌంట్లోని నగదు లూటీ.. ఒరిజినల్ సిమ్ కార్డ్‌ను నేరస్తులు స్వాపింగ్, క్లోన్ చేస్తున్నారు. దీంతో అప్పటికే మీ సిమ్ కార్డ్‌లో సేవ్ అయి ఉన్న కాంటాక్ట్, ఇతరత్రా వ్యక్తిగత సమాచారం నేరస్తుల చేతిలోకి వెళ్లిపోతుంది. బ్యాంక్ ఖాతాలను కూడా ఆపరేట్ చేస్తున్నారు. బాధితుడు ఆ సమయంలో మొబైల్ సేవలను వినియోగించలేడు కాబట్టి బ్యాంక్ వన్ టైం పాస్వర్డ్ (ఓటీపీ) కూడా కొత్త సిమ్ కార్డ్ వినియోగిస్తున్న నేరస్తుడికే వెళ్లిపోతుంది. దీంతో అకౌంట్లోని నగదును నిందితుల బ్యాంక్ ఖాతాలకు బదిలీ చేసుకుంటారు. ఈ వ్యవహారంలో నిందితులు సమర్పించే గుర్తింపు కార్డ్‌లు, నగదు బదిలీ జరిగే బ్యాంక్ ఖాతాలు అన్నీ నకిలీవే ఉంటున్నాయని పోలీసులు దర్యాప్తులో తేలింది. ఒకే రోజు రెండు సిమ్‌లు జారీ చేయొద్దు సిమ్ కార్డ్‌ల జారీలో టెలికం విభాగం అప్రమత్తంగా ఉండాలి. ఒకే రోజు వేర్వేరు కేవైసీ పద్ధతులతో రెండు సిమ్ కార్డ్‌లను యాక్టివేషన్ చేయకూడదు. అలాగే సిమ్ కార్డ్‌లు తీసుకునే సమయంలో కస్టమర్లు వాటిని దృవీకరించుకోవాలి. – స్టీఫెన్ రవీంద్ర, పోలీస్ కమిషనర్, సైబరాబాద్ (చదవండి: తల్లి మృతిని తట్టుకోలేక.. ) -
ఫోర్జరీ డాక్యుమెంట్లతో సిమ్ల యాక్టివేషన్
ముఠా గుట్టురట్టు నెల్లూరు (క్రైమ్) : ఫోర్జరీ డాక్యుమెంట్లతో యాక్టివేషన్ చేసిన (ప్రీయాక్టివేటెడ్) సిమ్‌కార్డులను విక్రయిస్తున్న నలుగురు వ్యక్తులను నాల్గోనగర పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. నగర డీఎస్పీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో డీఎస్పీ జి. వెంకటరాముడు నిందితుల వివరాలను వెల్లడించారు. నగరంలోని ఏసీనగర్‌కు చెందిన బాలాజీకుమార్, స్టోన్‌హౌస్‌పేటకు చెందిన పెంచలయ్య స్నేహితులు. వీరు మూడు నెలలుగా హరనాథపురంలో గిరి మెడికల్ షాపు సమీపంలో వోడాఫోన్ అవుట్లెట్ నిర్వహిస్తూ ఆ కంపెనీ సిమ్‌లను విక్రయిస్తున్నారు. సిమ్కోసం వచ్చే వినియోగదారులనుంచి ఫొటోగుర్తింపు, ధ్రువపత్రాలను తీసుకుని వాటి ద్వారా ఫోర్జరీ డాక్యుమెంట్లు సృష్టిస్తున్నారు. వోడాఫోన్ సీఎస్ఎం అండ్ అసిస్టెంట్ మేనేజర్ షరాబు భానుప్రసాద్, డిస్ట్రిబ్యూటర్ జి. రాజశేఖర్ సహాయంతో ఫోర్జరీ ధువపత్రాలతో సిమ్‌కార్డులు యాక్టివేట్ చేసి ఒక్కో సిమ్ రూ.200 నుంచి రూ.400 వరకు విక్రయిస్తున్నారు. ఫోర్జరీ డాక్యుమెంట్లతో సిమ్ల విక్రయాలపై నాల్గోనగర ఇన్స్పెక్టర్ సీహెచ్ సీతారామయ్య కొంతకాలంగా నిఘా ఉంచారు. బుధవారం సీతారామయ్య ఆధ్వర్యంలో నాల్గోనగర ఎస్ఐలు ఎస్కే అలీసాహెబ్, ఎం రఘునాథ్ తమ సిబ్బందితో కలిసి వొడాఫోను అవుట్‌లెట్‌పై దాడి చేశారు. యాక్టివేషన్ చేసిన వొడాఫోన్ సిమ్‌కార్డులు 10, యాక్టివేషన్ కానివి 99, ఖాళీ దరఖాస్తులు 29, రెండు కార్బన్ సెల్ఫోన్లు, రూ. వెయ్యి నగదును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అవుట్లెట్ నిర్వహిస్తున్న బాలాజీకుమార్, పెంచలయ్యతో పాటు వోడాఫోన్ సీఎస్ఎం అండ్ అసిస్టెంట్ మేనేజర్ షరాబు భానుప్రసాద్, డిస్ట్రిబ్యూటర్ రాజశేఖర్‌ను అరెస్ట్‌చేశారు. రోడ్లపై సిమ్‌లు కొనుగోలు చేయవద్దు రోడ్లపై ఏర్పాటు చేసిన అవుట్లెట్ల్లో సిమ్‌లు సాధ్యమైనంత మేర కొనుగోలు చేయవద్దని నగర డీఎస్పీ సూచించారు. అవుట్లెట్ నిర్వాహకులు అనేక మంది డబ్బులకు ఆశపడి అనేక అక్రమాలకు పాల్పడుతున్నారన్నారు. సిమ్కొనుగోలు చేసిన సమయంలో వినియోగదారులు ఇచ్చిన ధృవపత్రాలను ఫోర్జరీ చేసి ఇతర సిమ్‌లను వాటి ద్వారా యాక్టివేట్ చేసి విక్రయిస్తోన్నారని చెప్పారు. దీని వల్లన అనేక ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు. ఆధీకృత కంపెనీ డీలర్ల వద్దనే సిమలు కొనుగోలు చేయాలని ఆయన సూచించారు.ఫోర్జరీ డాక్యుమెంట్లతో సిమ్‌లను యాక్టివేట్ చేసి విక్రయించి జేబులు నింపుకుంటున్న ముఠాలపై నిఘా ఉంచామన్నారు. సిబ్బందికి అభినందన సిమ్ మాఫియా గుట్టురట్టు చేసిన నాల్గోనగర ఇన్స్పెక్టర్ సీహెచ్ సీతారామయ్య, ఎస్ఐలు ఎస్కే అలీసాహెబ్, ఎం. రఘునాథ్ సిబ్బంది పోలయ్య, సురేష్, శివకృష్ణ, మహేంద్రనాథ్‌రెడ్డి, వేణు, రాజేంద్ర, శ్రీకాంత్‌ను డీఎస్పీ అభినందించారు. ఈ సమావేశంలో పోలీసు అధికారులు తదితరులు పాల్గొన్నారు.